logo

ఆ చేపల పులుసు.. ఆహా..!

శాలిగౌరారం చేపలు రుచిలో అదుర్స్‌.. చేపల పులుసు, వేపుడు, పచ్చడి.. ఇలా వంటకం ఏదైనా..రుచిలో వీటిది ప్రత్యేకత. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీమళ్లీ తినాలనిపిస్తుంది ఆ చేపలను.

Published : 08 Jun 2023 03:24 IST

జలాశయం వద్ద చేపలు పట్టే  సీజన్‌లో ఇలా.. జాతరలా.(దాచిన చిత్రం)

నకిరేకల్‌, శాలిగౌరారం న్యూస్‌టుడే: శాలిగౌరారం చేపలు రుచిలో అదుర్స్‌.. చేపల పులుసు, వేపుడు, పచ్చడి.. ఇలా వంటకం ఏదైనా..రుచిలో వీటిది ప్రత్యేకత. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీమళ్లీ తినాలనిపిస్తుంది ఆ చేపలను. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం ప్రాజెక్టు అంటే గుర్తొచ్చేవి చేపలే. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 8న ఊరూరా చెరువుల పండుగ. 8, 9, 10 తేదీల్లో మూడు జిల్లా కేంద్రాల్లో ‘చేపల ఆహార పండుగ’ (ఫిష్‌ ఫుడ్‌ పెస్టివల్‌)ను ప్రభుత్వం నిర్వహిసోంది.  

వందల ఏళ్ల చరిత్ర..

మండు వేసవిలో నిండి, వానాకాలం, యాసంగి రెండు పంటలకు సాగునీరందించే శాలిగౌరారం ప్రాజెక్టును 1804లో నిజాం కాలంలో నిర్మించారు. ఇక్కడి మత్స్య  సంపదకు కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా ఏడు గ్రామాల్లోని 10 వేల ఎకరాల వరకు ఆయకట్టుకు సాగునీరందిస్తోంది.

జలాశయంలో చేపలవేటలో మత్స్యకార్మికుడు

మత్స్య పారిశ్రామికుల సంఘం ఏర్పాటు..  

ప్రాజెక్టులో చేపల పెంపకంతో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు జిల్లా మత్స్య శాఖ 1972లో మత్స్య పారిశ్రామికుల సహకార సంఘాన్ని ఏర్పాటు చేసింది. 30 మందితో ప్రారంభమైన ఈ సొసైటీ దినదినాభివృద్ది చెంది ప్రస్తుతం 709 మందికి చేరింది. చేపలను పడుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఒక్కరోజు మత్య్స కార్మికుడు చేపటల వేటకు వెళ్లి రూ.300 నుంచి 600 పైగా సంపాదిస్తారు.

* చేపలు పెరిగే నీటితోపాటు చెరువు నేల స్వభావం, అందులో పెరిగే నాచు, నీటిలో పడే చెట్ల ఆకుల వంటివి చేపల రుచిని ప్రభావితం చేస్తుంటాయని మత్స్య  సొసైటీ ప్రతినిధులు, మత్స్య వ్యాపారులు చెబుతున్నారు.


రుచులు పంచుతూ..

ప్రాజెక్టు వద్ద వేడివేడి చేపల కూర ఇలా. సిద్ధం

ప్రాజెక్టులో చేపలు పట్టినప్పుడు ఒక్కో చేప సుమారు 4 నుంచి 20 కిలోల వరకు బరువు ఉంటుంది. చేపలు పడుతున్నారంటే చాలు నల్గొండ, హైదరాబాద్‌, సూర్యాపేట, అర్వపల్లి, తిరుమలగిరి, మోత్కూరు నుంచి చేపల ప్రేమికులు తరలివస్తారు. చిన్న, పెద్ద వ్యాపారులతో ప్రాజెక్టు ప్రాంతం జాతర వాతావరణాన్ని సంతరించుకుంటుంది. గౌరారం చేపలకు కోల్‌కతాలో డిమాండ్‌ అధికం. గత కొన్నేళ్ల నుంచి ఇక్కడి రవ్వ, బొచ్చ, కొర్రమీను, వాలుగ వంటి పలు రకాల చేపలను వ్యాపారులు కోల్‌కతాకే ఎగుమతి చేస్తున్నారు. ఏటా 50 టన్నులకు పైగా చేపలు అక్కడికి వెళ్తుంటాయి. హైదరాబాదు, రాజమహేంద్రవరం, విజయవాడకు శాలిగౌరారం చేపలు ఎగుమతవుతుంటాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని