logo

మండుటెండల్లో.. నిండుకుండల్లా..!

మండుటెండలు, వడగాలుల ప్రభావంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి వాతావరణంలో  కొన్ని దృశ్యాలు ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.

Published : 08 Jun 2023 03:35 IST

జలకళను సంతరించుకున్న మేళ్లచెరువు నాగుల చెరువు

హుజూర్‌నగర్‌, మేళ్లచెరువు, న్యూస్‌టుడే: మండుటెండలు, వడగాలుల ప్రభావంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి వాతావరణంలో  కొన్ని దృశ్యాలు ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ కనిపిస్తున్న చెరువులే ఇందుకు కారణం. మండుటెండల్లోనూ నిండుకుండల్లా  దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా సాగర్‌ ఆయకట్టు ప్రాంతాల్లో ఈ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మిషన్‌ కాకతీయ పథకంతో చెరువులకు ఈ కళ వచ్చింది. ఈ పథకం ద్వారా చెరువుల్లో తవ్విన పూడిక మట్టి కంటే రైతులే స్వయంగా తోడుకున్న మట్టి నాలుగింతలై పంట పొలాలకు తరలింది. నేడు ఆ ఫలాలు చెరువుల్లో కనిపిస్తున్నాయి.

చెరువుల్లో జలకళ..

గతంలో వేసవి సమీపిస్తుంటేనే చెరువులు అడుగంటిపోయేవి. చుక్కనీరు లేక అడుగు నెర్రెలు బారేది. ఇప్పుడు అవే చెరువులు జలకళ సంతరించుకున్నాయి. మేళ్లచెరువులోని నాగుల చెరువే ఇందుకు సాక్ష్యం. ఇలాంటి చెరువులు సాగర్‌ ఆయకట్టులోని హుజూర్‌నగర్‌, కోదాడ, మిర్యాలగూడ నియోజకవర్గాలతో పాటు  ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో దర్శనమిస్తున్నాయి. తద్వారా ఆయా ప్రాంత భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. గ్రామాల్లో మునుపటి నీటి ఎద్దడి లేదు. నల్లాల వద్ద బారులు తీరిన బిందెలూ లేవు. మిషన్‌ భగీరథ పథకంతో నీటి బెంగలేదు.

తగ్గని భూగర్భ జలం..

మిషన్‌ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పూడిక మట్టి తొలగింపు ప్రక్రియ సానుకూల ఫలితాలనిచ్చింది. గతంలో సాగర్‌ నీటితో చెరువులు నింపినా నెలరోజుల్లోనే ఇంకిపోయేవి. మిషన్‌ కాకతీయ పనులు చేపట్టిన చెరువుల్లో మాత్రం మండు వేసవిలోనూ నీరు తగ్గలేదు. సాగర్‌ నీటిని వదిలినా చెరువులకు ప్రత్యేకంగా మలిపేంత అవసరం రాలేదు. దీనికి అకాల వానలు కలిసొచ్చాయని చెప్పొచ్చు. మేళ్లచెరువులో భూగర్భ జలం గతంలో 150 అడుగుల లోతుకు పడిపోయింది. ప్రస్తుతం వంద అడుగుల్లోపే నీరు ఉంది. నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నమవడం లేదు. చెరువు పూడిక తీత పనులు జరిగిన మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. భూగర్భ నీటిమట్టం పెరుగుదల ఉమ్మడి జిల్లాలో 7.77 మీటర్లలో ఉందని అధికారులు చెబుతున్నారు.


చెరువులకు పూర్వపు సామర్థ్యం వచ్చింది
స్వామి, డీఈ, నీటిపారుదలశాఖ, హుజూర్‌నగర్‌

మిషన్‌ కాకతీయ వల్ల చెరువులకు దశాబ్దాలుగా పూడిపోయిన పూడిక తీశారు. దీనివల్ల చెరువులకు పూర్వపు నీటి నిల్వ సామర్థ్యం వచ్చింది. నాలుగు దశల్లో ఆయా జిల్లాల్లోని చెరువులన్నిటిలో పూడికతీత పనులు పూర్తయ్యాయి. దీనివల్లే మండే ఎండల్లోనూ చెరువులు నిండు కుండల్లా మారాయి. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని