logo

పశువులు.. ప్రాణాలు తీస్తున్నాయ్‌..!

మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతం వేసవి కావడంతో యజమానులు పశువులను ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. అవి ఎప్పుడు, ఎక్కడి నుంచి రహదారిపైకి వస్తున్నాయో తెలియని పరిస్థితి.

Published : 08 Jun 2023 03:35 IST

* ఖమ్మం జిల్లాకు చెందిన విశ్రాంత అధ్యాపకుడు నేతాజీ, ఆయన భార్య ఇందిరతో కలిసి కారులో ఇటీవల హైదరాబాద్‌కు బయలుదేరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి శివారులో ఆయన వెళ్తున్న కారుకు ఒక్కసారిగా గేదెలు అడ్డు వచ్చాయి. గేదెలను ఢీకొని కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నేతాజీ అక్కడికక్కడే మృతి చెందగా, ఇందిరకు తీవ్ర గాయాలయ్యాయి.


* మోతె మండలంలో ఇటీవల గేదెలు మేత మేసి సాయంత్రం ఇంటికి వెళ్తున్నాయి. గ్రామ సమీపానికి చేరుకోగానే గుర్తు తెలియని కారు గేదెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. కారులో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి.


మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతం వేసవి కావడంతో యజమానులు పశువులను ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. అవి ఎప్పుడు, ఎక్కడి నుంచి రహదారిపైకి వస్తున్నాయో తెలియని పరిస్థితి. రాత్రి వేళ అవి కనిపించక వాహనదారులు వాటిని ఢీకొట్టి కొందరు మృత్యుపాలవుతుండగా.. మరికొందరు తీవ్ర గాయాలపాలై మంచానికే పరిమితమైన ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి.

గేదెను తప్పించబోయి బోల్తా పడిన వాహనం

పదుల సంఖ్యలో ప్రమాదాలు..

* పశువుల ద్వారా ఉమ్మడి జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 182 ప్రమాదాలు జరిగాయి. ఇందులో పదుల సంఖ్యలో వ్యక్తులు, పశువులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

* సూర్యాపేట జిల్లాలో ప్రధానంగా జాతీయ రహదారిపై మునగాల, టేకుమట్ల, ఆకుపాముల వద్ద, నూతన ఖమ్మం జాతీయరహదారిపై ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

* నల్గొండలో నార్కట్పల్లి, కట్టంగూర్‌, నకిరేకల్‌, చిట్యాల వద్ద, గుంటూరుకు వెళ్లే రహదారి మర్రిగూడ బైపాస్‌, మిర్యాలగూడ వద్ద తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

* యాదాద్రి జిల్లాలో చౌటుప్పల్‌, బీబీనగర్‌, భువనగిరి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే దారిపై కూడా సంభవిస్తున్నాయి. ఇవి కాకుండా జిల్లా కేంద్రాల నుంచి మండలాలకు, గ్రామీణకు ప్రాంతాలకు వెళ్లే రహదారుల్లో సైతం జరుగుతూనే ఉన్నాయి.

* మేకలు, గొర్రెలు సైతం రహదారిపై వెళ్లే సమయంలో ఇష్టానుసారంగా తీసుకెళ్తుండటంతో లారీ, బస్సులు ఢీకొని అధికంగా మృత్యువుపాలైన ఘటనలు తరచూ ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వీటిని పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లకుండా మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకుని ఎంతో కొంత నగదు ముట్టజెప్పి ముగించుకుంటున్నారు.


నిబంధనలు ఇలా..

జాతీయ రహదారిపైకి పశువులు వెళ్లకుండా చూసుకోవాల్సి ఉంది. జాతీయ రహదారి సంస్థ ఆధ్వర్యంలో రహదారికి ఇరువైపులా రెయిలింగ్‌ నిర్మించాలి.  కానీ చాలా చోట్ల లేకపోవడంతో ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. రహదారికి ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్‌ రహదారులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ చాలా గ్రామాల్లో సర్వీసు రహదారులు లేవు.  రైతులు కూడా పశువులను ఇష్టానుసారంగా రహదారులపై వదిలితే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాల్సిఉన్నా... కొందరు వాహనదారులు మద్యం మత్తులో గేదెలను ఢీకొట్టడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధిక శాతం రాత్రి వేళలో కనిపించకపోవడంతో క్షణాల్లో ప్రాణనష్టం జరుగుతోంది.


రైతులకు సూచిస్తున్నాం
-శ్రీనివాసులు, జిల్లా పశువైద్యాధికారి, సూర్యాపేట

వేసవికాలంలో పశువులను వదిలేయొద్దని యజమానులకు సూచిస్తున్నాం. అయినా వారు వినకపోవడంతో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పశువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. రైతులు అప్రమత్తంగావాటిని సంరక్షించుకోవాలి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని