logo

స్వరాష్ట్రంలో అనతి కాలంలో.. అద్భుత ప్రగతి

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17 కీలకమైన రోజని, స్వరాష్ట్రంలో అనతి కాలంలో అద్బుత ప్రగతి సాధించినట్లు శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Updated : 18 Sep 2023 06:02 IST

గుత్తా సుఖేందర్‌రెడ్డి

ప్రసంగిస్తున్న గుత్తా

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17 కీలకమైన రోజని, స్వరాష్ట్రంలో అనతి కాలంలో అద్బుత ప్రగతి సాధించినట్లు శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్బంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుకొంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన రైతాంగ పోరాట యోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో విలీనమై నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డమీద త్యాగాలు చేశారని తెలిపారు. 1947లో దేశం స్వాతంత్య్ర సంబురాల్లో ఉంటే హైదరాబాద్‌ ప్రజలు స్వేఛ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడాల్సి వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండగా మెజార్టీ సంస్థానాలు దేశంలో విలీనం అయ్యాయని జునాఘడ్‌, కశ్మీర్‌, హైదరాబాద్‌ సంస్థానాలు మాత్రం విలీనం కాలేదన్నారు. భూస్వాములు, జమీందార్లు, జాగీర్‌దార్లు, దేశ్‌ముఖ్‌లు, ప్రజలను వేధించారని తెలిపారు. ఈ సమయంలో తెలంగాణ పోరాటంలో చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమాలదేవి, తదితరులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. జిల్లా నుంచి బండి యాదగిరి రాసిన బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాం సర్కరోడా  పాట రాచరిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంలో చైతన్యం రగిలించిందన్నారు. ఆ తరువాత జరిగిన తెలంగాణలో తొలిదశ ఉద్యమంలో 350 మంది అసువులు బాసినట్లు పేర్కొన్నారు. మలిదశ ఉద్యమం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో 2001 నుంచి 14 ఏళ్లపాటు గాంధేయ మార్గంలో నడిచి 2014 జూన్‌ 2న రాష్ట్రాన్ని సాధించిన విషయం అందరికి తెలిసిందేనన్నారు.

వ్యవసాయానికి పెద్దపీట

రాష్ట్రం ఏర్పాటు తరవాత దశాబ్ది కాలంలో వ్యవసాయ రంగం దేశంలోనే అద్భుత ప్రగతి సాధించి అగ్రగామిగా నిలిచిందని గుత్తా చెప్పారు. జిల్లాలో పండించిన ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. దామరచర్ల వీర్లపాలెం వద్ద ఐదువేల ఆరు వందల ఎకరాల్లో రూ.30 వేల కోట్లతో 4వేల మెగావాట్ల సామర్ధ్యం గల యాదాద్రి థర్మల్‌పవర్‌ స్టేషన్‌ పనులు 2024  డిసెంబర్‌ నాటికి పూర్తి అవుతాయన్నారు. దీంతో పాటు రైతు బంధు, రైతుబీమా, ద]ళితబంధు, బీసీబంధు, మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం అమలు జరుగుతున్నాయన్నారు. విద్యా, పరిశ్రమలు, ఐటీ రంగం, నీటి పారుదల రంగాలు గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరంనిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ బతుకమ్మ పాట, నల్గొండ అభివృద్ధిపై పాడిన పాటలు అలరించాయి. జిల్లా పోలీస్‌ యంత్రాంగం మైదానంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్‌, భాస్కర్‌రావు, నోముల భగత్‌, చిరుమర్తి లింగయ్య, జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, ఎస్పీ అపూర్వరావు, నాయకులు తిప్పన విజయసింహారెడ్డి, రాంచందర్‌నాయక్‌, మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ: తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ జెండా ఎగురవేస్తున్న శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, చిత్రంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ ఆర్‌.వి. కర్ణన్‌, ఎస్పీ అపూర్వరావు, తదితరులు

కార్యక్రమానికి హాజరైన జడ్పీ ఛైర్మన్‌ బండా, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్‌, భాస్కర్‌రావు, నోముల భగత్‌, తదితరులు

నల్గొండ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థినుల నృత్య ప్రదర్శన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని