కలలో కాసుల గలగల.. ఆశల వలలో విలవిల
ఇటీవల వచ్చిన ఓ సినిమాలో కథానాయకుడు నిరుపేద స్థితి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు.
అధిక వడ్డీ, రెట్టింపు లాభాల ప్రకటనలకు మోసపోతున్న సామాన్యులు
నాంపల్లి, న్యూస్‌టుడే
దళారి చేతిలో మోసపోయి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మిర్చి రైతులు (పాతచిత్రం)
ఇటీవల వచ్చిన ఓ సినిమాలో కథానాయకుడు నిరుపేద స్థితి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. అనుకోకుండా కలిసి వచ్చిన వ్యాపారంతో రూ.కోట్లు గడించి స్థితిమంతుడు అవుతాడు. ఈ చిత్రం ఆసాంతం కథానాయకుడి డబ్బు, బంగళాలు, సహచరులు, సహాయకులతో దిగువ, మధ్య తరగతి ప్రేక్షకుల రోమాలు నిక్కపొడిచేలా కొనసాగుతుంది. సినిమా కథలో లీనమైన ప్రేక్షకుడు ఆ పాత్రలో తనను ఆపాదించుకొని ఆ క్షణం మురిసిపోతాడు. మెలకువలో కనే ఆ కలంతా 2.30 గంటల్లో చెదిరిపోతుంది. నిలకడగా, న్యాయ బద్ధంగా సంపద సృష్టించాలంటే ఓపిక ఉండాలి. అడ్డుదోవల్లో వెళ్తే అధోగతే. ఉమ్మడి జిల్లాలో చాలా మంది అధిక వడ్డీలకు ఆశపడి ప్రైవేటు వ్యక్తులకు కోట్లాది రూపాయలు అప్పుగా ఇచ్చారు. కొన్ని చోట్ల కర్షకులు అధిక ధర వస్తుందని దళారులకు పంట ఫలాలు అమ్ముకున్నారు. స్వేదం చిందించి కూడబెట్టిన నగదు తక్కువ సమయంలో రెట్టింపు అవుతుందనే ఆశతో స్థిరాస్తి వ్యాపారులకు ధారపోశారు. తీరా వాళ్లు పెట్టే బేడా సర్దేశాక విలవిల్లాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆశల వలలో పడి నష్టపోతున్న దిగువ, మధ్య తరగతి కుటుంబాల తీరుపై ‘న్యూస్‌టుడే’ కథనం.
- నాంపల్లి మండలం నెమిళ్లగూడెం, దామెర, వడ్డెపల్లి గ్రామాల పరిధిలోని రైతుల నుంచి ఈ ఏడాది మార్చిలో పొరుగు జిల్లాకు చెందిన ఓ దళారి మిర్చి కొనుగోలు చేశాడు. గ్రామాల్లో మధ్యవర్తులను నియమించుకొని మార్కెట్ ధర రూ.16 వేలు ఉండగా, రూ.23 వేలకు క్వింటా చొప్పున కొనుగోలు చేశాడు. నాణ్యత, తేమతో సంబంధం లేదన్నట్లు కొందరికి వెంటనే చెల్లింపులు జరిపాడు. దీంతో ఆయా గ్రామాల రైతులు ఆశపడి దళారీకి మిర్చి విక్రయించారు. ఒకరిద్దరు రైతులకు చెల్లింపులు జరిపిన దళారి మిగిలిన రైతులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
- స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అనతికాలంలోనే రెట్టింపు లాభాలు ఆర్జించవచ్చని ఓ కంపెనీకి చెందిన పలువురు ఏజెంట్లు మర్రిగూడ మండలంలోని భారీగా పెట్టుబడులు పెట్టించారు. రూ.లక్ష పెట్టుబడి పెడితే ఏడాదిలో రెండింతల లాభం వస్తుందని చెప్పడంతో పలువురు అందులో చేరారు. కంపెనీ సైతం కొందరికి నెలనెలా చెల్లించాల్సిన సొమ్ము ఠంచనుగా అందజేస్తుండటంతో ఆశపడిన సామాన్యులు నమ్మకం కుదిరి రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టారు. తర్వాత చేతులు ఎత్తేయడంతో సుమారు 50 మంది వరకు బాధితులు సదరు కంపెనీ ఇచ్చిన చెక్కులతో పోలీసులను ఆశ్రయించారు.
- హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన ఓ కంపెనీ రూ.లక్ష కడితే నెలకు రూ.10 వేల చొప్పున 20 నెలలు చెల్లిస్తామని చెప్పడంతో నల్గొండ జిల్లా గట్టుప్పల్, మునుగోడు, చండూరు మండలాలకు చెందిన బాధితులు పెట్టుబడులు పెట్టారు. ఆరు నెలల పాటు చెల్లింపులు జరిపిన కంపెనీ అనంతరం నిలిపివేసింది. పది నెలలు గడుస్తున్నా కంపెనీ నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో ఈ నెల 12న బాధితులు కంపెనీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
- యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లాకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి గతేడాది అధిక వడ్డీ ఆశ చూపి 200 మంది నుంచి సుమారు రూ.20 కోట్లు వసూలు చేశాడు. అప్పుఇచ్చిన వారికి ప్రామిసరీ నోట్లు, బాండు పేపర్లపై సంతకం చేసి ఇచ్చాడు. కొద్ది రోజులు అధిక వడ్డీ చెల్లించిన అతను నెలలు గడుస్తున్నా అసలు, వడ్డీ చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
- సూర్యాపేట జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన చిట్టీలు, ఫైనాన్స్ నడిపే ఓ వ్యాపారి నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. అధిక వడ్డీ ఆశ చూపి అమాయకుల నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. తర్వాత కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన బాధితులు గతేడాది అక్టోబర్‌లో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆలోచించండి..
- ఎక్కడైనా, ఎవరైనా వడ్డీ వ్యాపారం చేయాలనుకుంటే రుసుము చెల్లించి, ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. స్థానికంగా ఉన్న రెవెన్యూ కార్యాలయంలో అధికారులను సంప్రదించి లైసెన్స్ పొందాలి. రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది.
- డిపాజిట్లకు అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి. చాలా బ్యాంకుల్లో రూ.5 లక్షల వరకు రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీ ఉంటుంది.
- ఇచ్చిన డబ్బు తిరిగి పొందేందుకు చట్టపరంగా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. దీర్గకాలంలో మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీ ఆధారిత మదుపులు సంపద సృష్టిస్తాయి.
- పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నప్పుడు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ల సహాయంతో పొదుపు మదుపు చేయవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.