పోరాడి సాధించిన రాష్ట్రంలో విప్లవాత్మక ప్రగతి
పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో గణనీయ ప్రగతి జరుగుతోందని, దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధిని పరిశీలిస్తున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి
మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో గణనీయ ప్రగతి జరుగుతోందని, దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధిని పరిశీలిస్తున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ వెంకటరావు అధ్యక్షతన ఆదివారం ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. తొలుత పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రగతి ద్వారా తెలంగాణకు అవార్డులు, రివార్డులు అందుతున్నాయని చెప్పారు. ప్రతి జిల్లాకు వైద్య కళాశాల, గురుకుల పాఠశాలలు, కళాశాలల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తూ ఉన్నతమైన ఫలితాలు సాధిస్తున్నామని వెల్లడించారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పు తెచ్చి గణనీయంగా ప్రగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు. గృహాలకు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత పాలకుల పాలనలో ఫ్లోరైడ్‌తో ప్రజలు పడిన ఇబ్బందులను గుర్తు చేశారు. రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యలు రానీయని ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. ఆనాటి వీర యోధులందరినీ తలచుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. అనేక వ్యూహాలతో జరిపిన పోరాటాలు, త్యాగాలలో నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములేనన్నారు. హక్కుల కోసం ఏకం చేసిన ఆదివాసీ యోధుడు కొమురంభీం సాహసాన్ని, భూస్వాముల ఆగడాలను ఎదురించిన దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని, సర్దార్ జమలాపురం కేశవరావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, రైతాంగ పోరాటానికి తిరుగులేని నాయకత్వాన్ని అందించిన రావి నారాయణరెడ్డి, వీర వనిత చాకలి ఐలమ్మ, మచ్చలేని మహానాయకుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి, సురవరం ప్రతాప్‌రెడ్డి, కవి కాళోజీ, ధర్మభిక్షంగౌడ్ మరెందరో అందించిన సేవలను గుర్తు చేశారు. అనంతరం పీఆర్, డీఆర్డీవో శాఖల అధికారులు, సిబ్బందికి, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. డీడబ్ల్యూవో ఆధ్వర్యంలో ఎనిమిది మందికి మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్ గుజ్జ దీపిక, పుర ఛైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, అదనపు కలెక్టర్లు ప్రియాంక, వెంకట్‌రెడ్డి, జడ్పీ వైస్‌ఛైర్మన్ గోపగాని వెంకటనారాయణ, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ సీఈవో సురేశ్, డీఆర్డీవో కిరణ్, సీపీవో వెంకటేశ్వర్లు, డీఈవో అశోక్, డీఎస్పీ నాగభూషణం పాల్గొన్నారు.
సూర్యాపేటలో జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి వందనం చేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, చిత్రంలో కలెక్టర్ వెంకటరావు
‘కాంగ్రెస్ పార్టీవి పగటి కలలే’
సూర్యాపేట (తాళ్లగడ్డ): విమోచనంపై అమిత్‌షాతోపాటు కొంత మంది లేనిపోని అపోహలు సృష్టించడం దురదృష్టకరమని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పాత గాయాలను రగిలించి సమాజాన్ని చీల్చాలని దుర్మార్గం చేస్తున్న ఇలాంటి వారు దేశ మనుగడకు ప్రమాదకరమని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ నాయకత్వంలో కుట్రలను తిప్పికొట్టే చైతన్యం తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. కర్ణాటకలో ప్రత్యామ్నాయం లేకనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని చెప్పారు. అక్కడ ఒక్క హామీ నెరవేర్చకుండా, కాంగ్రెస్ తన అసలు స్వరూపం బయటపెట్టిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీవి పగటి కలలుగానే మిగిలిపోవడం ఖాయమని తెలిపారు.
15 పంచాయతీలకు స్వచ్ఛ పురస్కారాలు
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్- 2023 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉత్తమ పనితీరు ప్రదర్శించిన 15 గ్రామ పంచాయతీలకు పురస్కారాలు వరించాయి. ఓడీఎఫ్ ప్లస్ సుస్థిరత, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, ఎఫ్‌ఎస్‌ఎం, ఐఈసీ అండ్ కెపాసిటీ బిల్డింగ్ తదితర అంశాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులకు మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదివారం కలెక్టరేట్‌లో ప్రశంసాపత్రం అందించి సన్మానించారు. జిల్లాలోని పొనుగోడు(గరిడేపల్లి), గణపవరం (మునగాల), వెంపటి, గానుగుబండ(తుంగతుర్తి), ఏపూరు, పాతర్లపహాడ్(ఆత్మకూర్.ఎస్), గుంపుల తిరుమలగిరి(చివ్వెంల), అనంతారం(పెన్‌పహాడ్), సిరికొండ, తుమ్మలపల్లి(మోతె), రెడ్డిగూడెం(మద్దిరాల), వేపలసింగారం(హుజూర్‌నగర్), కొండాపురం(చిలుకూరు), శ్రీరంగాపురం(నడిగూడెం), రెడ్లకుంట(కోదాడ) పంచాయతీలు ఎంపికయ్యాయి. స్వచ్ఛతా హీ సేవా -2023 పక్షోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబరు 2 వరకు గ్రామాల్లో శ్రమదానం, ప్రభుత్వ ఆస్తులకు రంగులు, మరమ్మతులు, మాస్ మొబిలైజేషన్ తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్ గుజ్జ దీపిక, కలెక్టర్ వెంకటరావు, అదనపు కలెక్టర్ ప్రియాంక, డీఆర్డీవో కిరణ్, జడ్పీ సీఈవో సురేశ్, డీపీవో యాదయ్య, స్వచ్ఛ భారత్ కన్సల్టెంట్లు నరేందర్, హరి పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి చేతులమీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డు అందుకుంటున్న పాతర్లపహాడ్ సర్పంచి కేశబోయిన మల్లయ్యయాదవ్, చిత్రంలో జడ్పీ ఛైర్‌పర్సన్ గుజ్జ దీపిక,కలెక్టర్ వెంకటరావు, అదనపు కలెక్టర్ ప్రియాంక, తదితరులు
కలెక్టరేట్ ఆవరణలో నాటిక ప్రదర్శిస్తున్న విద్యార్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
BJP: తెలంగాణకు రెండో వారంలో అమిత్‌షా.. 6న నడ్డా
-
World Culture Festival: శాంతి, సామరస్య ప్రపంచం కోసం అందరం కలిసి కృషి చేయాలి!
-
Sudheer Babu: భూతద్దంతో ఈ సినిమాని చూడొద్దు: సుధీర్ బాబు విజ్ఞప్తి
-
Delhi: ఆ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులూ ఇంజినీర్లే.. బాంబుల తయారీలో నిష్ణాతులు
-
Atchannaidu: తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసేంత నేరం బండారు ఏం చేశారు?: అచ్చెన్న
-
Guntur Kaaram: అందుకే పూజా హెగ్డేను రీప్లేస్ చేశాం: నిర్మాత నాగవంశీ