logo

రాజకీయ ప్రచారానికి గణపతి విగ్రహాలు

జిల్లాలో పలు ప్రాంతాలలో గణపతి విగ్రహాలను కొందరు రాజకీయ నాయకులు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి ఉచితంగా పంపిణీ చేస్తుండటంతో స్థానికంగా అమ్మకాలకు అన్ని సిద్ధం చేసుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 18 Sep 2023 06:13 IST

పడిపోయిన అమ్మకాలు

కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్న హుజూర్‌నగర్‌లోని ఓ విక్రయ కేంద్రం

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: జిల్లాలో పలు ప్రాంతాలలో గణపతి విగ్రహాలను కొందరు రాజకీయ నాయకులు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి ఉచితంగా పంపిణీ చేస్తుండటంతో స్థానికంగా అమ్మకాలకు అన్ని సిద్ధం చేసుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలు చందాలకు నాయకులను ఆశ్రయిస్తున్నారు. వారు ఎన్నికలు సమీపిస్తున్నాయన్న ఆలోచనలతో కొందరు విగ్రహాలను ఉచితంగా పంపిణీకి సిద్దం అయ్యారు. ఆ నాయకులు ముందు చూపుతోనే పెద్ద సంఖ్యలో విగ్రహాలు ప్రత్యేక ఆర్డరు పెట్టి చేయించి వాటిని వివిధ ప్రాంతాలకు తరలించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దీంతో స్థానికంగా తయారు చేసి అమ్మకాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న వారు మాత్రం తలలు పట్టుకున్నారు. ఒక్క హుజూర్‌నగర్‌లో ఒక ఎమ్మెల్యే ఆశా వాహుడు 500 విగ్రహాలు పంపిణీకి సిద్ధపడ్డాడు. తను ఉచితంగా విగ్రహాలు ఇవ్వనున్నట్లు వారి శ్రేణుల ద్వారా గ్రామగ్రామాన ప్రచారం చేయటంతో వారంతా ఉచితంగా వచ్చే విగ్రహం కోసం ఎదురు చూస్తున్నారు. పట్టణంలో దాదాపు పరిసరాలలో దాదాపు 3 నుంచి 4 వందల విగ్రహాలు అమ్ముడు పోతాయని అంచనా. ఉచితంగా పెద్ద మొత్తంలో దిగుమతి అవుతుండటంతో ఉత్సవాలు జరుపుకునే వారు వాటి కోసం ఎదురు చూస్తున్నారు.

పెరిగిన ధరలు కూడా కారణం

విగ్రహాల తయారీ దారులకు విగ్రహాల తయారీకి పెద్ద మొత్తంలో ఖర్చు పెరిగిందని అంటున్నారు. అందుకు వాడే అన్ని పదార్ధాల ధరలు పెరగటం, తయారు చేసే కూలీలు కూడా ప్రత్యేకంగా రాజస్థాన్‌ నుంచి తీసుకొస్తారు. వారి ఖర్చులు కూడా తడిసి మోపెడు అవుతున్నట్లు తయారీదారులు చెబుతున్నారు. ఆరు నెలల నుంచి ముందస్తు పెట్టుబడులు పెట్టి విగ్రహాలు తయారు చేయటం వల్ల ఒక్కో విగ్రహం రూ.6 వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతున్నట్లు చెబుతున్నారు. ధరలు విపరీతంగా ఉండటంతో ఉత్సవాలు జరపటం కష్టంగా మారింది. దీంతో విగ్రహాలు ఏర్పాటు చేసే వారు విగ్రహ దాతలను ఎక్కువగా వెతుక్కుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో దాతలు కూడా సులభంగా దొరుకుతున్నట్లు ఉత్సవ కమిటీలు చెబుతున్నాయి. దీంతో ఒకే పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి వాటిని పంపకానికి సిద్ధపడుతున్నారు. ఒకేసారి కొనుగోలు చేసేందుకు నాయకులు భారీగా తయారు చేసే వారిని ఆశ్రయించి తక్కువ ధరలకు చేయించుకుని వాటిని పంపిణీ చేయిస్తున్నట్లు సమాచారం. దీంతో స్థానిక అమ్మకాలు కూడ బాగా తగ్గిపోయినట్లు తయారు దారులు చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని