logo

అభివృద్ధిలో ఆదర్శం.. దేశానికి మార్గదర్శి తెలంగాణ

ఎందరో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తూ, దేశానికి మార్గదర్శిగా నిలిచిందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు.

Updated : 18 Sep 2023 06:23 IST

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత

కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేస్తున్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, చిత్రంలో కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, డీసీపీ రాజేష్‌చంద్ర

భువనగిరి, న్యూస్‌టుడే: ఎందరో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తూ, దేశానికి మార్గదర్శిగా నిలిచిందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్‌ సునీత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గత దశాబ్ద కాలంగా జరుగుతున్న అభివృద్ధి  సంక్షేమ కార్యక్రమాలను ఆమె తన ప్రసంగంలో వివరించారు. రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొందడానికి నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేశారని శ్లాఘించారు. వారికి నివాళులు అర్పించారు. సెప్టెంబరు 17న భారత యూనియన్‌లో విలీనమై 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు శుభాభివందనాలు తెలిపారు. నాటి సాయుధ పోరాటంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కీలకపాత్ర పోషించిందన్నారు. రావి నారాయణరెడ్డి సారథ్యం వహించగా బీఎన్‌ రెడ్డి, ధర్మభిక్షం, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, కట్కూరి రాంచంద్రారెడ్డి, సుద్దాల హన్మంతు, కట్కం సుశీల తదితర పోరాట యోధులు తెలంగాణ స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్నింటా అన్యాయం జరగడంతో 14 ఏళ్ల పాటు గాంధేయ మార్గంలో ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని అద్భుత ప్రగతిని సాధిస్తున్నామని అన్నారు. ప్రధానంగా సాగు, తాగు నీటి రంగాలకు పెద్దపీట వేసి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. నిరంతర విద్యుత్తు సరఫరా కోసం యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్‌ 24 నాటికి అందుబాటులోకి వస్తుందని అన్నారు. బంగారు తెలంగాణ కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషికి అధికారులు, ప్రజాప్రతినిధులు తోడ్పాట అందించడంతో పాటు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

పాఠశాలల విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. నాటి ఉద్యమాలు దేశ సమైక్యత, సమగ్రతను చాటే విధంగా విద్యార్థులు అబ్బురపరిచే ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, డీసీపీ రాజేష్‌ చంద్ర, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, వీరారెడ్డి, రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, పుర అధ్యక్షుడు ఎనబోయిన ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు కొల్పుల అమరేందర్‌, ఆర్డీవో అమరేందర్‌, ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ సభ్యుడు బీరు మల్లయ్య పాల్గొన్నారు.

విద్యార్థుల బృంద నృత్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు