logo

జర మా మొర విని.. విఘ్నాలు తొలగించు వినాయకా

శివ, పార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు. సకల గణాలకు అధిపతి కాబట్టి.. గణపతి అంటారు.

Updated : 18 Sep 2023 06:13 IST

శివ, పార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు. సకల గణాలకు అధిపతి కాబట్టి.. గణపతి అంటారు. విఘ్నాలు తొలగించే దేవుడని నమ్ముతూ విఘ్నేశ్వరుడు అని భక్తులు పిలుచుకుంటారు. వినాయక చవితిని పురస్కరించుకుని విఘ్నేశ్వరుడికి ఆయనకు ఇష్టమైన ఉండ్రాళ్లతో పాయసం చేసి భక్తి, శ్రద్ధలతో సమర్పిస్తారు. తమ విఘ్నాలను తొలగించమని వేడుకుంటారు. ప్రధాన కూడళ్లలో గణనాథుడి విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలతో యువత సందడి చేస్తుంది. ‘వినాయక చవితి’ని పురస్కరించుకుని మన జిల్లాలో నెలకొన్న పరిస్థితులను అన్వయించుకుంటే....

చిట్యాల, న్యూస్‌టుడ


ఎవరిని కటాక్షిస్తావో స్వామి.. !

రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపో  యాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనంటూ ఢంకా భజాయిస్తూ సభలు, సమావేశాలు, యాత్రలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలోనూ అలాంటి వాతావరణం అలుముకుంది. అధికార పార్టీలో ఇప్పటికే అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది. ప్రతిపక్ష పార్టీల్లో ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కొన్ని పూర్తిచేయగా, మరికొన్ని క్షేత్రస్థాయిలో ప్రజలను కలవడం, సమస్యలపై కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. ఎక్కువ స్థానాలు సాధించి జిల్లాపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు తలపోస్తున్నారు. సొంతపార్టీలోనే ఒకరిపై ఒకరు పైచేయి సాధించే దిశగా ప్రయత్నం కొందరు చేస్తుంటే, అసమ్మతుల మూలంగా ఏర్పడిన తలనొప్పిని అనుభవిస్తున్నవారు మరికొందరు. తమకు పోటీచేసే అవకాశం దక్కాలని కోటి దేవతలకు మొక్కుతున్నవారు కొందరైతే, అధిష్ఠానం దృష్టిని ఎలాగైనా ఆకర్షించాలనే చివరి ప్రయత్నాలు సాగిస్తున్నవారు ఇంకొందరు. ఈ దఫా తమ ఉనికిని చాటాలని కొన్ని పక్షాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. వీరంతా తమకున్న విఘ్నాలు తొలగించి, విజయాలను అందించాలని విఘ్నరాజు.. విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నారు.

యువతను మేల్కొలుపు లంబోదర..!

ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ నిలిచింది. ఇదే సమయంలో ప్రస్తుతం యువత ఎక్కువగా భారత్‌లోనే ఉన్నారు. ఏ వ్యవస్థలో అయినా యువత ఎక్కువగా ఉండే సమాజం అభివృద్ధి చెందుతుంది. యువత దుర్వ్యసనాలకు బానిసలుగా మారినప్పుడు వారు దేశానికే భారం అవుతారు. దురదృష్టవశాత్తు రాజకీయ వ్యవస్థ యువతను తమ ప్రయోజనాల కోసం ఎక్కువగా వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో ఎక్కువ శ్రమలేకుండా అధికంగా సంపాదించుకోవాలనే దురాలోచన యువతలో పాదుగొల్పుతున్నారు. దీనికి తోడు సాధారణ యువతలో గంజాయికు అలవాటు పడుతున్నవారు ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్నచిన్న విషయాలకే అతిగా స్పందించడం, హత్యలు వంటి దారుణాలకూ పాల్పడుతున్నారు. దుర్వ్యసనాల బారిన పడకుండా వారిని సన్మార్గంలోకి మళ్లించి, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వారిలో నింపి బాధ్యతగల భావి పౌరులుగా తీర్చిదిద్దే దిశగా పాలకులు చర్యలు చేపట్టే విధంగా చూడాలని సమాజహితాన్ని కోరేవారు పార్వతీ తనయుడిని కోరుతున్నారు.

అక్షరాలు వెలిగించు..ఏకదంతుడా..!

సమాజం బాగుపడాలన్నా ప్రజలు చైతన్యంగా ఉండాలి. ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దేది విద్యావ్యవస్థ. ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యావ్యవస్థ కట్టుదిట్టంగా ఉంటే మెరుగైన సమాజానికి అది దారితీస్తుంది. ఉద్యోగాల సాధన లక్ష్యంగా సాగే వ్యవస్థ కన్నా, బాధ్యత గల పౌరులుగా మానవ జీవితాలను నిలబెట్టే వ్యవస్థను విద్యార్థులు సాధించగలిగే విధంగా విద్యావిధానం ఉండాలంటారు నిపుణులు. కుల, మతాలకు అతీతంగా అందరికి విద్య, అందరికీ ఉపాధి లభించాలని, విద్యారంగంలో ఖాళీలను భర్తీచేయడం, మౌలిక సదుపాయాలు కల్పించడం వంటివి ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపించే విధంగా పాలకుల మనసులో ఆలోచనలు కలిగించాలని మేధావులు కోరుకుంటున్నారు.

ఆడపిల్లలకు అండగా ఉండు.. గణనాథా..!

మ్మాయిలు, యువతుల పట్ల రోజురోజుకు అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఆకతాయిల వేధింపుల మూలంగా యువతులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. పరాయి వ్యక్తులే కాకుండా ఇంటి మనుషులు, బంధువులు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంటే ‘అమ్మాయిగా పుట్టడమే మేము చేసిన పాపమా..?’ అని మౌనంగా వారు రోదిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చట్టాల అమలును మరింత పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతున్నాయి. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు, చిన్నచిన్న ప్రైవేటు సంస్థల నుంచి కార్పొరేట్‌ సంస్థల వరకు పనిచేసే చోటకూడా మహిళలు వేధింపులను ఎదుర్కొంటూనే ఉన్నారు. వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తూ, బాధితులను రక్షిస్తూ, వారికి అండగా ఉండే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని చిత్తశుద్ధితో కదలించాలని అమ్మాయిలు, యువతులు, మహిళలు ఆ గణనాథుడిని వేడుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని