సమయం లేదు మిత్రమా.. ఓటు నమోదుకు వెళ్దామా..
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా నూతన ఓటు నమోదు, తొలగింపు, సవరణలకు దరఖాస్తు గడువు రెండు రోజుల్లో ముగియనుంది.
దరఖాస్తులకు రేపటితో గడువు పూర్తి
నల్గొండలో ఎన్నికల సిబ్బంది, అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ (పాత చిత్రం)
మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా నూతన ఓటు నమోదు, తొలగింపు, సవరణలకు దరఖాస్తు గడువు రెండు రోజుల్లో ముగియనుంది. ఓ వైపు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా.. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేలా.. భారత ఎన్నికల సంఘం యువతలో చైతన్యాన్ని నింపేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా ఓటు నమోదుకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గత నెల 26, 27 తేదీలతో పాటు ఈ నెల 2, 3 తేదీల్లో ఓటు నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది. ఇక ఈ ఏడాది తుది ఓటరు జాబితాలో తమ పేరు ఉండాలంటే అర్హులైన ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 19 వరకు గడువు విధించింది. వచ్చే నెల 4న ఓటరు తుది జాబితా విడుదల కానుంది.
ఇలా దరఖాస్తు చేసుకోండి
ఇప్పటికే 18 ఏళ్లు వయసు నిండిన వారు కానీ..అక్టోబర్ ఒకటో తేదీ నాటికి 18ఏళ్లు నిండనున్న వారు కానీ ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గత 21న విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితాలో తమ పేర్లు లేని పాత ఓటర్లు సైతం కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ‘ఓటర్ హెల్ప్‌లైన్’ మొబైల్ యాప్‌లో కానీ.. voters.eci.gov.in వెబ్‌సైట్‌లో కానీ ఫారం-6 లో వివరాలు నమోదు చేసి కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నూతన ఓటు నమోదుతో పాటు ఓటరు జాబితా నుంచి చనిపోయిన, వలస వెళ్లిన, రెండు ఓటు కలిగిన వారి పేర్లు తొలగింపునకు, ఓటరు జాబితా, కార్డులో పేరు, చిరునామా..ఇతర సవరణలకు సైతం దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. పలు ప్రాంతాల్లో అంగన్‌వాడీ సిబ్బంది(బీఎల్వోలు) సమ్మెలో ఉండటంతో అర్హులైన వారు ఆన్‌లైన్ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
దరఖాస్తు ఫారాలు ఇవీ..
ఫారం-6: కొత్త ఓటు నమోదు కోసం
ఫారం-6ఏ: విదేశాల్లోని భారతీయుల ఓటు నమోదు కోసం
ఫారం-6బీ: ఓటుకు ఆధార్ అనుసంధానం
ఫారం-7: ఓటరు జాబితా నుంచి పేరు తొలగించేందుకు
ఫారం-8: ఓటరు కార్డులో పేరు, చిరునామా, వివిధ వివరాల మార్పుల కోసం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.