logo

8 నెలలు.. 1253 మంది కుక్కకాటు బాధితులు

నేరేడుచర్లలో ఇద్దరు మహిళలపై గతవారం పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. స్థానికంగా శునకాల సంతతి నియంత్రణ శస్త్రచికిత్స కేంద్రాలు లేకపోవడంతో వాటి సంతతి పెరిగి దాడులు చేస్తున్నాయి

Published : 21 Sep 2023 03:40 IST

వాడవాడలో శునకాల స్వైరవిహారం
కానరాని నియంత్రణ చర్యలు

సూర్యాపేటలో రాత్రి సమయంలో కుక్కల సంచారం

*  నేరేడుచర్లలో ఇద్దరు మహిళలపై గతవారం పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. స్థానికంగా శునకాల సంతతి నియంత్రణ శస్త్రచికిత్స కేంద్రాలు లేకపోవడంతో వాటి సంతతి పెరిగి దాడులు చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లి క్షేమంగా చేరుకునే పరిస్థితి లేదు. ఎక్కడైనా కుక్కల దాడి జరిగితే అధికారులు హడావుడి చేస్తూ.. ఆ తర్వాత మిన్నకుంటున్నారు.

సూర్యాపేట పురపాలిక, నేరేడుచర్ల, న్యూస్‌టుడే: జిల్లాలో రోజురోజుకూ శునకాల బెడద అధికమవుతోంది. ఎక్కడో ఒకచోట రోజుకొకరు వాటి వల్ల గాయపడుతూనే ఉన్నారు. కానీ, కుక్కల ఆగడాల నియంత్రణకు అడుగులు పడటం లేదు. ప్రతి పురపాలికలో శునకాల సంతతి నియంత్రణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని గతేడాది హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, జిల్లాలో సూర్యాపేట మినహా మిగతా కోదాడ, తిరుమలగిరి, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల పురపాలికల్లో నేటికీ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మిగతా నాలుగు మున్సిపాలిటీల నుంచి ప్రత్యేకంగా వాహనంలో సూర్యాపేటకు కుక్కలను తీసుకొచ్చి చికిత్స చేయించి తీసుకెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి సంతతి తగ్గడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 31 వరకు జిల్లాలో 1253 మంది కుక్కకాటు బారిన పడ్డారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.

దూరభారంతో ఇబ్బందులు

కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, నేరేడుచర్ల పురపాలికకు సూర్యాపేటకు మధ్య దూరం సుమారు 35 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మున్సిపల్‌ సిబ్బంది వాహనంలో కుక్కలను తీసుకువచ్చేందుకు దూరభారంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి శనకానికి సంతతి నియంత్రణ శస్త్రచికిత్స చేయాలంటే సుమారు రూ.1600 వరకు వ్యయమవుతుంది. వాటితోపాటు డీజిల్‌ ఖర్చు భరించాల్సి ఉంటుంది. నెలకు మూడు, నాలుగు సార్లు సూర్యాపేటకు వస్తుండటంతో పురపాలికలకు ఖర్చులు పెరుగుతున్నాయి. ఆ మొత్తాన్ని భరించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఆయా పట్టణాల్లో శునకాల సంతతి పెరిగి ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు శునకాల ఆగడాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


ఉన్నతాధికారులకు నివేదిస్తాం
- శ్రీనివాస్‌రెడ్డి,మున్సిపల్‌ కమిషనర్‌, నేరేడుచర్ల

కుక్కల సంతతి నియంత్రణ శస్త్ర చికిత్స కేంద్రాల ఏర్పాటు విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారి నుంచి ఆదేశాలు రాగానే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం శునకాల శస్త్ర చికిత్సల నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు