logo

ఓటు నమోదుకు 86,849 దరఖాస్తులు

రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2ను విడుదల చేసింది.

Published : 21 Sep 2023 03:47 IST

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2ను విడుదల చేసింది. ప్రణాళికలో భాగంగా ఓటు నమోదు, తొలగింపు, జాబితాలో పేరు ఇతర సవరణలకు దరఖాస్తుల గడువు ఈ నెల 19తో ముగిసింది. గడువు ముగిసే నాటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,65,489 దరఖాస్తులు రాగా.. ఓటు నమోదు(ఫారం-6) కోసం 86,849 దరఖాస్తులు, ఓటు తొలగింపునకు(ఫారం-7) 40,897 దరఖాస్తులు, జాబితాలో పేరు, ఇతర సవరణల(ఫారం-8) కోసం 37,745 దరఖాస్తులు వచ్చాయి.

  ఈ నెల 28 వరకు విచారణ

ఈనెల 19 వరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల విచారణ ప్రక్రియ ఈ నెల 28 వరకు ముగియనుంది. విచారణ ఆధారంగా ఆయా దరఖాస్తులను జాబితాలో నిక్షిప్తం చేసే పనిలో ఎన్నికల సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. అక్టోబరు నాలుగో తారీఖున ఓటరు తుది జాబితా విడుదల కానుంది. మరో వైపు దరఖాస్తుల విచారణ చేయాల్సిన బీఎల్వోలలో అత్యధిక మంది ఉండే అంగన్‌వాడీ సిబ్బంది సమ్మెలో ఉండటంతో వారి స్థానంలో పర్యవేక్షకులు క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తున్నారు. విచారణకు సైతం గడువు ముగుస్తుండటంతో సిబ్బందిలో ఆందోళన మొదలైంది.

పలు సందేహాలు

బీఎల్వోలు చేయాల్సిన దరఖాస్తుల విచారణను సూపర్‌వైజర్లు చిత్తశుద్ధితో చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 18 నుంచి 22 ఏళ్ల వయసున్న వారు నూతన ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే విచారణ లేకుండానే అంగీకరిస్తుండగా.. ఆపై పడిన వయసున్న వారు నూతన ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే విచారించేందుకు బీఎల్వోల సాయం తీసుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఓటు తొలగింపులోనూ మరణించిన వారి ఓట్లైతే మరణ ధ్రువీకరణ పత్రం జత చేస్తే వెంటనే అనుమతిస్తుండగా.. మిగిలిన వాటిపై విచారణ చేపడుతున్నామంటున్నారు. మరికొన్ని దరఖాస్తులు కార్యాలయాల్లో కూర్చునే అధికారులు అంగీకారం తెలుపుతున్నారనే వాదన సైతం వినిపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని