logo

సొంత ఊరిపై మమకారం..రూ.2 కోట్లతో పాఠశాల భవన నిర్మాణం

ధనార్జనే ముఖ్యం కాదు.. సొంత గ్రామం అభివృద్ధి లక్ష్యంగా భావించారు. మారుమూల గ్రామీణ ప్రాంతంలో అరకొర వసతులతో విద్యార్థులు పడుతున్న అవస్థలు గుర్తించి పాఠశాల అభివృద్ధికి చేయూతనివ్వడానికి ముందుకు వచ్చారు సుమధుర ఫౌండేషన్‌ ఛైర్మన్‌ గుండా మధుసూదన్‌

Published : 21 Sep 2023 03:47 IST

 22న ప్రారంభించనున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

ఇస్కిల్లలో సుమధుర ఫౌండేషన్‌ సంస్థ నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం

రామన్నపేట, న్యూస్‌టుడే: ధనార్జనే ముఖ్యం కాదు.. సొంత గ్రామం అభివృద్ధి లక్ష్యంగా భావించారు. మారుమూల గ్రామీణ ప్రాంతంలో అరకొర వసతులతో విద్యార్థులు పడుతున్న అవస్థలు గుర్తించి పాఠశాల అభివృద్ధికి చేయూతనివ్వడానికి ముందుకు వచ్చారు సుమధుర ఫౌండేషన్‌ ఛైర్మన్‌ గుండా మధుసూదన్‌. ఈయన స్వగ్రామమైన రామన్నపేట మండలం ఇస్కిల్లలో సొంతంగా రూ.2కోట్లుతో కార్పొరేట్‌ తరహా అధునాతన వసతులతో గుండా సత్తయ్య మెమోరియల్‌ పేరిట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఈ పాఠశాల భవనాన్ని ఈ నెల 22న మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించనున్నారు. విద్య ప్రతి విద్యార్థి హక్కు అనే నినాదంతో గ్రామంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మధుసూదన్‌. ఉన్నత విద్య కోసం గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. యువత అభ్యున్నతి కోసం యూట్యూబ్‌, బేసిక్‌ కంప్యూటర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఏర్పాటు చేశారు. పాఠశాలలో సదుపాయాలు సక్రమంగా లేకపోవటంతో నూతన భవన నిర్మాణాన్ని గత సంవత్సరం డిసెంబరులో ప్రారంభించి పూర్తిచేశారు. అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 14గదులు నిర్మించారు. విశాలమైన తరగతి గదులతో పాటు కంప్యూటర్‌్, సైన్స్‌ ల్యాబ్‌, డిజిటల్‌ లైబ్రరీ, వంట గది, భోజన శాల, రెండు అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు, వంట గదులు, రూ.3 లక్షలతో డిజిటల్‌ తరగతి గది, క్రీడా సామగ్రి, గ్రంథాలయంలో రూ.50వేలు విలువైన పుస్తకాలు, ప్రొజెక్టరు, గంటకు వంద లీటర్లు సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రం వంటి సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 80మంది విద్యార్థులున్నారు.


ఆనందంగా ఉంది..
గుండా మధుసూదన్‌, సుమధుర ఫౌండేషన్‌, ఛైర్మన్‌

స్వగ్రామం ఇస్కిల్లలో పూర్తి స్థాయిలో పాఠశాల భవనాన్ని నిర్మించటం ఆనందంగా ఉంది. నేను పుట్టిపెరిగిన గ్రామంలో సేవ చేయాలనే నా కల సాకారమైంది. మారుమూల ప్రాంతమైన ఈ గ్రామంలో నగరం తరహాలో అన్ని హంగులతో పాఠశాల భవనం అందుబాటులోకి వచ్చింది. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలన్నదే నా లక్ష్యం. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఈ పాఠశాల వారధిగా  నిలుస్తుందని నమ్ముతున్న. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని