logo

పాల్వాయి స్రవంతికి మాతృవియోగం

కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి పాల్వాయి స్రవంతి తల్లి, దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్ధన్‌రెడ్డి సతీమణి సృజమణి బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు.

Updated : 21 Sep 2023 05:22 IST

పాల్వాయి సృజమణి

చండూరు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి పాల్వాయి స్రవంతి తల్లి, దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్ధన్‌రెడ్డి సతీమణి సృజమణి బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చండూరు మండల పరిధిలోని వారి స్వగ్రామం ఇడికూడలో ఆమె నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా ఆరోగ్యం క్షీణిస్తూ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో బుధవారం చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివదేహాన్ని హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని వారి నివాసానికి తీసుకెళ్లారు. గురువారం ఇడికూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.


మహిళ బలవన్మరణం

ఆత్మకూరు(ఎం), న్యూస్‌టుడే: పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... మండలంలోని పోసానికుంటకు చెందిన సుడి నర్సిరెడ్డి, అండమ్మల కుమార్తె మంజుల (40)కు సుమారు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో వివాహమై, ఇద్దరు కుమారులున్నారు. 12 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఆత్మకూరులో తల్లి వద్దే ఉంటోంది. ఆమె ఇద్దరు కుమారులు హైదరాబాద్‌లోని నానమ్మతో కలిసి ఉంటున్నారు. బుధవారం సాయంత్రం మంజుల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, భువనగిరి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మరణించింది. బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు కాలేదని ఎస్సై డి.నాగరాజు తెలిపారు.  


టెట్‌ సరిగా రాయలేదని యువతి ఆత్మహత్య

ఆరు నెలల కిందటే వివాహం.. అంతలోనే విషాదం

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: టెట్‌ సరిగా రాయలేదని  ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి చెందిన ఘటన నార్కట్‌పల్లి మండలం బాజకుంట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాజకుంట వాసి చిల్లర ఉమ(24) ఈ నెల 15న నిర్వహించిన టెట్‌ రాశారు. పరీక్ష సరిగా రాయలేకపోయానని మనస్తాపం చెందిన ఆమె ఈ నెల 18న ఇంటి వద్ద కలుపు నివారణ మందు తాగారు.   విషయం తెలుసుకుని ఆమెను కుటుంబ సభ్యులు నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఉమకు అదే గ్రామానికి చెందిన సాయికుమార్‌తో ఆరు నెలల క్రితమే వివాహమైంది. తండ్రి పల్లగొర్ల ఆదినారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదాబాబు తెలిపారు.


ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడి మృతి

మిర్యాలగూడ గ్రామీణం, న్యూస్‌టుడే: దిచక్ర వాహనంతో కుక్కను ఢీకొని రోడ్డు డివైడర్‌ ఇనుప గ్రిల్‌పై పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని అవంతీపురం గ్రామంలో గల కోదాడ-జడ్చర్ల ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం చోటుచేసుకుంది. చేతికంది వచ్చిన కుమారుడి మృతితో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. స్థానికులు, గ్రామీణ ఎస్సై డి.నర్సింహులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన చరణ్‌ అలియాస్‌ ఆలేటి చంద్రకాంత్‌(23) అమ్మ, అన్న, వదినతో కలసి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో నివాసముంటూ గడ్డిపల్లిలోని ఓ బియ్యం మిల్లులో గుమస్తాగా పని చేస్తున్నారు. స్వగ్రామం కొత్తగూడెంలో మేనమామ సోమయ్య ఇంటికి మంగళవారం రాత్రి వచ్చారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 5.30 గంటల సమయంలో గడ్డిపల్లికి వెళ్లేందుకు తన ద్విచక్ర వాహనంపై చంద్రకాంత్‌ బయలుదేరారు. కొత్తగూడెం గ్రామంలో గల అద్దంకి-నార్కట్‌పల్లి రహదారి మీదుగా కోదాడ-జడ్చర్ల ప్రధాన రోడ్డుపై అవంతీపురం గ్రామానికి చేరుకోగానే.. వేగంగా పరుగెత్తుకుంటూ రోడ్డుపై అడ్డంగా వచ్చిన కుక్కను ఢీకొని, రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్‌ ఇనుప గ్రిల్‌పై పడ్డారు. దీంతో చంద్రకాంత్‌ శరీరం, తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా.. ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చంద్రకాంత్‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. సోదరుడు ఆలేటి శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 


ట్రాక్టర్‌ కింద పడి డ్రైవర్‌ దుర్మరణం

కనగల్‌, న్యూస్‌టుడే: ట్రాక్టర్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తు దానికింద పడి డ్రైవర్‌ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా కనగల్‌ మండలం శేరిలింగోటం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై నర్ర అంతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రాకేష్‌(35) మంగళవారం రాత్రి నల్గొండ నుంచి గ్రామానికి వస్తుండగా శేరిలింగోటం వద్ద సర్వీస్‌ రోడ్డులో ట్రాక్టర్‌ అదపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. డ్రైవర్‌ సీట్‌లో ఉన్న రాకేష్‌ కింద పడటంతో వెనుక టైరు అతడి మీద నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలైన రాకేశ్‌ను చికిత్స నిమిత్తం 108లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు


ప్రాణం తీసిన విద్యుత్తు కంచె

నాగారం, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని డి.కొత్తపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.కొత్తపల్లికి చెందిన మామిడాల సత్యనారాయణ పొలాన్ని మోదాల లింగయ్య కౌలుకు తీసుకొని వరి సాగుచేస్తున్నారు. కోతుల బెడద కారణంగా పొలం చుట్టూ విద్యుత్తు కంచె ఏర్పాటుచేసుకున్నారు. ఈ విషయం తెలియని ఆ గ్రామస్థురాలు ఇరుగు యశోద(50) పాడిగేదెకు మేత కోసం గడ్డి కోయడానికి మంగళవారం సాయంత్రం ఆ పొలానికి వెళ్లారు. విద్యుత్తు కంచెను గమనించకుండా గడ్డి కోయడంతో విద్యుదాఘాతానికి గురై యశోద అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకగా పొలంలో విగత జీవిగా పడిపోయి ఉన్న యశోదను గుర్తించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు బుధవారం సూర్యాపేట-జనగామ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. పోలీసులు సర్ది చెప్పి ఆందోళన విరమించారు. మృతురాలికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు ఉపేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్తయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని