logo

పెరిగిన వినియోగం.. విద్యుత్తు వ్యవస్థపై భారం

సాగర్‌ ఆయకట్టుతోపాటు విద్యుత్తు పంపుసెట్లతో సాగుచేస్తున్న ప్రాంతాల్లో విద్యుత్తు వినియోగం డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది.

Published : 21 Sep 2023 04:05 IST

గరిడేపల్లి: గారకుంట తండా శివారులో వాడుతున్న వరిపైరు

గరిడేపల్లి, న్యూస్‌టుడే: సాగర్‌ ఆయకట్టుతోపాటు విద్యుత్తు పంపుసెట్లతో సాగుచేస్తున్న ప్రాంతాల్లో విద్యుత్తు వినియోగం డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. వానా కాలమైనా వర్షాల జాడ లేకపోవడంతో సాగులో నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి రైతులు అత్యధికంగా విద్యుత్తు మోటర్లను వినియోగిస్తున్నారు. ఫలితంగా విద్యుత్తు ఉప కేంద్రంలోని నియంత్రికలపై భారం పడుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లే లైన్లు లోడ్‌ తట్టుకోలేకపోతున్నాయి. నిత్యం బ్రేక్‌డౌన్‌లు, అంతరాయాలు ఏర్పడి సాగుకు సక్రమంగా విద్యుత్తు సరఫరా లేక పొలాలు వాడుపడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పంటలు ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురవడమో.. లేదంటే సాగర్‌ నీరు ఒక తడి వస్తేనే వేసిన పంట చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

వరుణుడి జాడలేక..

వానాకాలంలో వర్షాలు దోబూచులాట ఆడుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆరంభంలో ఒకసారి భారీగా వర్షం పడినా తర్వాత ముఖం చాటేశాయి. నెల రోజులకు అంటే ఈనెల మొదటి వారంలో భారీ వర్షం పడింది. దాంతో రైతులు బోర్లు, బావుల కింద ఎక్కువ విస్తీర్ణంలో నాట్లు వేశారు. ఆ తర్వాత వర్షం జాడ లేకపోవడంతో పొలాలు తడిసే పరిస్థితి లేదు. 24 గంటల విద్యుత్తు సరఫరా ఉంటుందని రెండు అంగుళాల నీరు పోసే బోర్ల కింద మూడు ఎకరాల వరకు నాట్లు వేశారు. వర్షం అడపాదడపా పడుతుంటే భూగర్భ జలాలు పెరగడంతో పాటు నీరు అంత అవసరం ఉండదని భావించి ముమ్మరంగా నాట్లు వేశారు. ఇప్పుడు వర్షం జాడ కన్పించడం లేదు.

అధికారులు సతమతం

లోడ్‌ పెరుగుతుండటం, నిత్యం బ్రేక్‌డౌన్‌లు అవుతుండటంతో ఏం చేయాలో తెలియక విద్యుత్తు అధికారులు సతమతమవుతున్నారు. ఒకవైపు బిల్లుల వసూళ్లు, రీడింగ్‌ల నమోదు, గృహ వినియోగ సర్వీసుల సమస్యలు చూస్తూ వ్యవసాయానికి వచ్చే లైన్లు బ్రేక్‌డౌన్‌ అవుతుండటంతో అటూ ఇటూ పరుగెత్తలేక క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. సిబ్బంది కొరతతో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కాస్త కరంటు గురించి తెలిసిన యువకులు సొంతంగా మరమ్మతులు చేసుకుంటున్నారు. లైన్లు బ్రేక్‌డౌన్‌ అయినపుడు సైతం విద్యుత్తు అధికారులకు సహకారం అందిస్తున్నారు. విద్యుత్తు మోటర్ల డిమాండ్‌కు అనుగుణంగా నియంత్రికలు ఏర్పాటుచేయడంతో పాటు సమస్య ఉన్న లైన్లలో మరమ్మతులు చేయడం, ఇన్సులేటర్లు మార్చడం వంటి పనులు చేపడితే కరంటు నిరంతరాయంగా ఇవ్వొచ్చని రైతులు పేర్కొంటున్నారు.

భారీగా పెరిగిన మోటార్ల వాడకం

సాగర్‌ ఎడమ కాల్వకు నీరు రాదనే కచ్చితమైన నిర్ణయానికి వచ్చిన రైతులు తమ పొలాలను కాపాడుకోవడానికి బోర్లు వేశారు. ఈ ఒక్క సీజన్‌లోనే 300కు పైగా బోర్లు వేసినట్లు అంచనా. అధికారికంగా అనుమతి లేకపోయినా పంటను కాపాడుకునేందుకు వాటికి మోటర్లు ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటికే ఉన్న వ్యవసాయ మోటర్లకే పరిమితమైన నియంత్రికల సామర్థ్యానికి కొత్తవి తోడవడంతో సబ్‌స్టేషన్లపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా అందులోని పరికరాలు కాలిపోతున్నాయి. పలు ఉప కేంద్రాలు లోడ్‌ తట్టుకోకపోవడంతో ఇప్పటికే అధిక సామర్థ్యమున్న పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటుచేశారు. అయినా లోడ్‌ పెరుగుతూనే ఉంది. వ్యవసాయ విద్యుత్తు వినియోగానికి తోడు ఎండల తీవ్రతకు రాత్రి, పగలు ఏసీలు వాడుతూనే ఉన్నారు. అటు గృహ, వ్యవసాయ వినియోగం పెరిగి నిత్యం అంతరాయాలు ఏర్పడుతున్నాయి. లైను తెగిపోవడం, కాలిపోవడం, నియంత్రికల వద్ద ఫ్యూజులు మాడిపోవడం సాధారణమవుతోంది. దీంతో  వ్యవసాయానికి 18 గంటల కరంటు కూడా సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు. కొన్ని ఫీడర్ల కింద 16 నుంచి 18 గంటల సరఫరా సాగుతున్నా అత్యధిక లోడు ఉన్న ఫీడర్ల కింద సరఫరా చేయలేకపోతున్నారు. నిత్యం అటూ ఇటూ మారుస్తుండటంతో రైతులకు పొలాలు తడవక రోడ్డెక్కుతున్నారు. విద్యుత్తు హెచ్చుతగ్గులు, బ్రేక్‌డౌన్లు కావడంతో మోటర్లపై ప్రభావం పడుతోంది. నిత్యం ఏదో ఒక మోటరు కాలిపోతుంది. స్టార్టర్లు, ఫ్యూజులు, మ్యాగ్నెట్లు, రిలేలు కాలిపోతున్నాయి.

భారమిలా..

విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు రెట్టింపు దశకు చేరింది. దీనికి ఉదాహరణగా  గరిడేపల్లి మండలంలోని ఉప కేంద్రాల్లో లోడ్‌ పరిస్థితి పరిశీలిస్తే ఇలా ఉంది. (వినియోగం ఆంప్స్‌లలో)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని