logo

గృహలక్ష్మి జాబితాలో అవకతవకలు జరిగాయని వాగ్వాదం

గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు జరిగాయని, అర్హుల పేర్లు కాకుండా భారాసలో ఉన్నవారివే ఉన్నాయని, ఆరోపిస్తూ గ్రామస్థులు ఆ గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు.

Published : 21 Sep 2023 04:07 IST

పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన దృశ్యం

నిడమనూరు, న్యూస్‌టుడే: గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు జరిగాయని, అర్హుల పేర్లు కాకుండా భారాసలో ఉన్నవారివే ఉన్నాయని, ఆరోపిస్తూ గ్రామస్థులు ఆ గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. కార్యాలయంలోని సామగ్రిని పగులగొట్టి, తాళం వేసిన ఘటన మండలంలోని ముకుందాపురంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. లబ్ధిదారుల జాబితా గురించి పంచాయతీ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యుడు మంజుల శ్రీను, మాజీ సర్పంచి మండారి శివ, కాంగ్రెస్‌ నాయకులు, గ్రామస్థులు సర్పంచిని అడిగారు. తమ దగ్గర ఉన్న జాబితాలో భారాస వారి పేర్లే ఉన్నాయని, అసలైన అర్హుల పేర్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచి శంకర్‌, కార్యదర్శి కోటేష్‌లు మాట్లాడుతూ ఇంకా తుది, అధికారిక జాబితా రాలేదని, అర్హులైన వారికే ఇళ్లు వస్తాయన్నారు. వారి సమాధానానికి సంతృప్తి చెందిన గ్రామస్థులు ఇటీవల ఇళ్ల పట్టాలు, బీసీ రుణాల మంజూరులో కూడా అర్హులను పక్కన పెట్టి, అనర్హులకు పట్టాలు ఇచ్చారని వాగ్వాదానికి దిగారు. ఘర్షణ పెద్దది కావటంతో పంచాయతీ కార్యాలయంలోని చెక్క బల్లాలు, కుర్చీలను కొన్నింటిని ధ్వంసం చేసి చివరికి పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని ఎంపీడీవో ప్రమోద్‌కుమార్‌తో ఈ విషయం చర్చించగా, అర్హులైన వారికే ఇళ్లు మంజూరవుతాయని వారికి వివరించగా, ఎంపీడీవోకు పంచాయతీ కార్యాలయ తాళాలను అప్పగించారు. ఈ విషయంపై సర్పంచిని వివరణ కోరగా ఎలాంటి జాబితా రాలేదని, కార్యాలయంలో సామగ్రిని ధ్వంసం చేసిన ఘటనపై నిడమనూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు