logo

మహిళల్లో చైతన్యం నింపుతూ.. సాధికారత సాధిస్తూ

మహిళల కోసం ఉన్న ప్రతి చట్టాన్ని ఉపయోగించుకోవడం,  వారికి ఉన్న హక్కులను తెలియజేయడం, అవి అమలు జరిగేలా చూడడానికి మహిళా సాధికారత కేంద్రాన్ని గత ఏప్రిల్‌లో నల్గొండలో ఏర్పాటు చేశారు.

Published : 22 Sep 2023 03:29 IST

స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధికారత కేంద్రం

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: మహిళల కోసం ఉన్న ప్రతి చట్టాన్ని ఉపయోగించుకోవడం,  వారికి ఉన్న హక్కులను తెలియజేయడం, అవి అమలు జరిగేలా చూడడానికి మహిళా సాధికారత కేంద్రాన్ని గత ఏప్రిల్‌లో నల్గొండలో ఏర్పాటు చేశారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ప్రస్తుతం ఆరుగురు మహిళా సిబ్బంది పనిచేస్తున్నారు. బేటీ బచావో, బేటీ పడావో పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మరింత పటిష్ఠ పరిచేందుకు నిత్యం సదస్సులను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాలను గుర్తించి అన్నివర్గాల వారిలో చైతన్యం పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు లింగనిర్ధారణ పరీక్షలు జరగకుండా పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని అమలు పరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అత్యాచారానికి గురైన చిన్నారులు, మహిళలకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నారు. ఎఫ్‌ఐఆర్‌ అయిన వెంటనే బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చే రూ.25 వేలు తీసుకున్నవారు 116 మంది, ఛార్జిషీట్‌ నమోదైన తరువాత మరో రూ.25 వేల నగదు తీసుకున్న వారు 238 మంది ఉన్నారు. మహిళలపై దాడికి పాల్పడిన వారిలో 34 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేయించినట్లు కార్యాలయ లెక్కలు చెబుతున్నాయి. 200కు పైగా కేసులు కోర్టులో చివరి దశలో పురోగతిలో ఉన్నాయి. సఖీ, భరోసా కేంద్రాలతో పాటు మహిళా సాధికారిత కేంద్రాన్ని బాధితులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

181 టోల్‌ఫ్రీ నెంబరు వినియోగించుకోవాలి

మహిళలు, చిన్నారుల్లో అన్ని రకాలుగా చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. మహిళా సాధికారిత కేంద్రం ద్వారా చైతన్య సదస్సులు ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. మహిళలు, చిన్నారులు ఎక్కడైనా అత్యాచారం, వేధింపులకు గురైతే 181 టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలి. మహిళల కోసం వస్తున్న ప్రతి చట్టం సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాం.

కృష్ణవేణి, పీడీ, ఐసీడీఎస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని