logo

సూర్యాపేట సిగలో మరో కలికితురాయి

వైద్యకళాశాల, కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయాలను ఇప్పటికే ప్రారంభించిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో తాజాగా మరో కలికితురాయి చేరనుంది.

Published : 22 Sep 2023 03:29 IST

త్వరలోనే పాత కలెక్టరేట్‌లో ఐటీ హబ్‌ ఏర్పాటు
ఉపాధి కల్పనకు కార్పొరేట్‌ కంపెనీలతో మంత్రి జగదీశ్‌రెడ్డి చర్చలు

సూర్యాపేట పాత కలెక్టరేట్‌ కార్యాలయం

ఈనాడు, నల్గొండ: వైద్యకళాశాల, కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయాలను ఇప్పటికే ప్రారంభించిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో తాజాగా మరో కలికితురాయి చేరనుంది. త్వరలోనే పాత కలెక్టరేట్‌ భవనంలో ఐటీ హబ్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరున కొన్ని కంపెనీలతో ఐటీ హబ్‌ ప్రారంభించేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి యుద్ధప్రాతిపాదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఐటీ హబ్‌ ఏర్పాటు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అంశంపై అమెరికాలోని పలు ప్రముఖ ఐటీ కంపెనీలతో మంత్రి చర్చలు జరిపారు. హైదరాబాద్‌లోని మంత్రి అధికారిక నివాసంలో జరిగిన జూమ్‌ మీటింగ్‌ చర్చల్లో తెలంగాణ ఐటీ, పెట్టుబడుల శాఖ సీఈవో విజయ్‌ రంగినేని, టాస్క్‌ కో ఆర్డినేటర్‌ ప్రదీప్‌ పాల్గొన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్‌తోనూ గురువారం ప్రగతిభవన్‌లో జగదీశ్‌రెడ్డి సమావేశమై ఐటీ హబ్‌ ఏర్పాటుపై చర్చించారు. ప్రస్తుతం ఆరు కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు, తొలి దశలో ఆ కంపెనీలు 200 ఉద్యోగాలను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి ‘ఈనాడు’కు వెల్లడించారు. ఏడాది కాలంలో ఉద్యోగాల సంఖ్యను వేయికి పెంచనున్నాయి. ప్రస్తుతం పాత కలెక్టరేట్‌లో తాత్కాలికంగా ఐటీ హబ్‌ కార్యకలాపాలకు మౌలిక వసతులను సమకూర్చనున్నారు. ఈ మేరకు జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలోని పాత కలెక్టరేట్‌ను గురువారం పరిశీలించారు. తక్షణం భవనంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. వచ్చే నెల మధ్యలోనే ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరులోనే ఐటీ హబ్‌ను ప్రారంభించి, ఎన్నికల అనంతరం హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పక్కన సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో నల్గొండలో మాదిరిగా శాశ్వత భవనానికి చర్యలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

యువతకు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాం

హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లోనే కాకుండా సూర్యాపేట లాంటి పట్టణ ప్రాంతాల్లోనూ ఐటీ సేవలు అందించాలనేది సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కల. గతంలోనే సూర్యాపేటకు ఐటీ హబ్‌ను తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తామని మాట ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకునే క్రమంలో త్వరలోనే పాత కలెక్టరేట్‌లో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. సాంకేతిక విద్య చదివి, నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఐటీ హబ్‌ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆరు కంపెనీలు రావడానికి సుముఖత తెలపగా..మరిన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నాం. ఐటీ హబ్‌ ఏర్పాటు నాటికి సుమారు 20 కంపెనీలు యువతకు ఉపాధి కల్పించనున్నాయి.

జగదీశ్‌రెడ్డి, విద్యుత్తు, ఇంధనశాఖ మంత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని