logo

ఆదాయం గుత్తేదారుకు.. కష్టాలు వినియోగదారులకు

జిల్లాలోని వార సంతల్లో కూరగాయలతోపాటు పశువుల విక్రయాలు చేపడుతున్నారు. సంతల ద్వారా ప్రతి వారం ఆదాయం సమకూరుతున్నా వసతుల కల్పనకు నోచుకోవడం లేదు.

Updated : 22 Sep 2023 06:22 IST

వారసంతల్లో కొరవడిన వసతులు

సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఇలా బయట సాగుతున్న పశువుల క్రయవిక్రయాలు

భానుపురి, తిరుమలగిరి, న్యూస్‌టుడే: జిల్లాలోని వార సంతల్లో కూరగాయలతోపాటు పశువుల విక్రయాలు చేపడుతున్నారు. సంతల ద్వారా ప్రతి వారం ఆదాయం సమకూరుతున్నా వసతుల కల్పనకు నోచుకోవడం లేదు. అన్నీ సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పశువుల క్రయవిక్రయదారులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ వ్యాపారాలు సాగిస్తున్నారు. వానొస్తే బురదమయమయ్యే ప్రాంతాల్లో కూరగాయలు కొనలేక వినియోగదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.

ఇదీ దుస్థితి..

జిల్లాలో మొత్తం ఆరు సంతలు ఉన్నాయి. మూడు పంచాయతీ ఆధ్వర్యంలో, రెండు మార్కెట్‌ కమిటీ, ఒకటి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. నూతనకల్‌ మండలం మిర్యాల, తుంగతుర్తి, ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నెమ్మికల్‌ సంతలు ఉన్నాయి. వీటికి పంచాయతీ అధికారులు ఏటా వేలం నిర్వహిస్తున్నారు. ఈ సారి వేలంలో మిర్యాలలో రూ.8.50 లక్షలు, తుంగతుర్తి రూ.6.66 లక్షలు, నెమ్మికల్‌ సంతకు వేలం ద్వారా రూ.36.36 లక్షల ఆదాయం సమకూరింది. సూర్యాపేట మార్కెట్‌ యార్డు, కోదాడలో సంతలను మార్కెట్‌ అధికారులు నిర్వహిస్తున్నారు. సూర్యాపేటలో వారానికి రూ.75 వేలు, కోదాడలో రూ.30 వేల ఆదాయం వస్తోంది. తిరుమలగిరిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడుస్తుండగా రూ.14 లక్షలకు వేలం దక్కించుకున్నారు. వీటిల్లో పశువులు, గొర్రెలు, మేకలు, కూరగాయల విక్రయాలు సాగుతుంటాయి. పశువును విక్రయించినా.. కొనుగోలు చేసినా రూ.వెయ్యికి రూ.వంద చొప్పున గుత్తేదారులు తీసుకుంటారు. ఇలా ప్రతి వారం రూ.వేలల్లో ఆదాయం సమకూరుతున్నా సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టిసారించడం లేదు.

తాగునీరు.. నీడ కరవు

వార సంతల్లో ప్రధానంగా తాగునీరు కరవైంది. పొద్దస్తమానం సంతలో నిరీక్షించి తాగునీటికి అరిగొస అనుభవిస్తున్నారు. పక్కనే దుకాణాల్లో కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నారు. ఎలాంటి నీడ వసతి లేకపోవడంతో వర్షానికి తడుస్తూ.. ఎండలో ఇబ్బందులు పడుతూ క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. కనీసం రేకుల షెడ్లు కూడా లేకపోవడంతో కూరగాయల వ్యాపారులు ఎండలోనే విక్రయాలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. చుట్టూ ప్రహరీ నిర్మించ లేదు. ఇప్పటికైనా అధికారులు వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.

తిరుమలగిరిలో గొడుగుల సాయంతో కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులు

సౌకర్యాలు కల్పిస్తాం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో సంతలో సౌకర్యాలు కల్పిస్తాం. తాగునీరు, షెడ్ల నిర్మాణం, ప్రహరీ నిర్మించి వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం.

శ్రీను, మున్సిపల్‌ కమిషనర్‌, తిరుమలగిరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు