logo

పోటీల్లో రాణించి.. క్రీడా పాఠశాలల్లో చేరి

బాల్యం నుంచే చిన్నారులను క్రీడల్లో మెరికలుగా తయారు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాఠశాలలను నిర్వహిస్తోంది.

Published : 22 Sep 2023 03:29 IST

జిల్లా నుంచి 16 మంది విద్యార్థుల ఎంపిక

సూర్యాపేçËలో క్రీడా పాఠశాల ఎంపిక పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: బాల్యం నుంచే చిన్నారులను క్రీడల్లో మెరికలుగా తయారు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాఠశాలలను నిర్వహిస్తోంది. చదువుతోపాటు ఆటల్లోనూ శిక్షణ ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేర్చడమే ఈ పాఠశాలల లక్ష్యం. వీటిల్లో ప్రవేశానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 4, 5 తరగతుల విద్యార్థులకు మెడిసిన్‌ బాల్‌ త్రో, 800 మీటర్ల పరుగు, స్టాడింగ్‌ బ్రాడ్‌జంప్‌, వర్టికల్‌ జంప్‌, షటిల్‌ రన్‌, 30 మీటర్ల ఫ్లయింగ్‌ స్టార్ట్‌, ఫ్లెక్సిబులిటీ తదితర పోటీలు నిర్వహిస్తారు. మండల, జిల్లా స్థాయిలో బాలబాలికలకు పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ మళ్లీ ఆయా క్రీడాంశాల్లో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.  జిల్లా నుంచి 25 మంది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనగా 16 మంది సత్తాచాటి క్రీడా పాఠశాలలకు ఎంపికయ్యారు. హకీంపేట (హైదరాబాద్‌), కరీంనగర్‌, ఆదిలాబాద్‌లోని క్రీడా పాఠశాలల్లో నాలుగు, అయిదు తరగతుల్లో చోటు దక్కించుకున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే పాఠశాలల్లో చేరగా.. మరికొందరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఆటలపై మక్కువతో సాధన

ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నా. నాన్న సురేందర్‌ ప్రైవేటు ఉద్యోగి. క్రీడలపై మక్కువతో పోటీల్లో పాల్గొంటున్నా. క్రీడా పాఠశాలలో చదువుకోవాలనే తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చేందుకు సాధన చేశా. మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి పాఠశాలలో ప్రవేశానికి అర్హత సాధించినందుకు సంతోషంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పరుగు పందెంలో రాణించడమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నా.

గుగులోతు దివ్యశ్రీ, రావులపల్లి ఎక్స్‌రోడ్డుతండా, తుంగతుర్తి

అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని..

స్థానికంగా ఐదో తరగతి చదువుతున్నా. జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొమ్మిది విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో అత్యధిక మార్కులు సాధించి క్రీడా పాఠశాలకు ఎంపికయ్యాను. తండ్రి వెంకన్న ప్రోత్సాహం, ఉపాధ్యాయులు ఇచ్చిన శిక్షణతో ఆటల్లో రాణిస్తున్నా. అంతర్జాతీయ స్థాయి ఆటల్లో రాణించాలని ఇప్పటి నుంచే సాధన చేస్తున్నా.

సూరారపు రేష్మ, వెంపటి, తుంగతుర్తి

సత్తా చాటిన సోదరులు

ఆత్మకూర్‌(ఎస్‌) మండలం పాతర్లపహాడ్‌కు చెందిన సూర సుమన్‌ కుమారులు సిద్ధు నాలుగు, శ్రీనాథ్‌ అయిదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరికి చిన్ననాటి నుంచి క్రీడల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. వీరి ఆసక్తిని గ్రహించిన తండ్రి సుమన్‌ చిన్నారులను క్రీడా పాఠశాలలో చేర్పించేందుకు తొమ్మిది విభాగాల క్రీడల్లో సత్తా చాటేందుకు తర్ఫీదు ఇచ్చారు. తండ్రి ఇచ్చిన శిక్షణతోనే వారిద్దరూ క్రీడా పాఠశాలకు ఎంపికయ్యారు. అన్నదమ్ములు ఎంపికవడంతో ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు. ‘నాన్న ప్రోత్సాహంతోనే పాఠశాలకు ఎంపికయ్యామని, కబడ్డీలో జాతీయ స్థాయిలో ఆడి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తామ’ని సోదరులు సిద్ధు, శ్రీనాథ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని