logo

66 ఏళ్లలో ఆరుగురే..!

మహిళలు ఏళ్లుగా కంటున్న కల త్వరలోనే నెరవేరబోతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందింది.

Published : 22 Sep 2023 03:29 IST

శాసనసభలో అతివల ప్రాతినిధ్యం అరకొరే.. లోక్‌సభకు కరవే
33 శాతం రిజర్వేషన్ల అమలుతో చట్టసభల్లో పెరగనున్న మహిళల పాత్ర

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: మహిళలు ఏళ్లుగా కంటున్న కల త్వరలోనే నెరవేరబోతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందింది. ఇదివరకే లోక్‌సభ ఆమోదం లభించగా, తాజాగా గురువారం రాత్రి రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. దీనిపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అతివలకు కొంత ఉపశమనం కల్పించినా విధాన నిర్ణయాల్లో వారి పాత్ర స్వల్పమే. చట్ట సభల్లో రిజర్వేషన్ల బిల్లు స్వరూపం, విధి విధానాలపై స్పష్టత లేకున్నా ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యంపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..

రిజర్వేషన్లపై మొదలైన చర్చ

మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం లాంఛనమే కావడంతో..ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గాలు మహిళలకు కేటాయిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న 12 నియోజకవర్గాల్లో ఆరింట్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. హుజూర్‌నగర్‌లో పురుషులకంటే 4,122 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా..నల్గొండలో 4,103 మంది, కోదాడలో 3,729 మంది, సూర్యాపేటలో 3,253 మంది, మిర్యాలగూడలో 2,582 మంది, నాగార్జునసాగర్‌లో 2,268 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో పురుషులు, మహిళల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది.

అవగాహన పెంచుకోవాల్సిందే..

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో రాజకీయాల్లోకి అతివలు ప్రవేశించినప్పటికీ..పలు చర్చలు, నిర్ణయాల్లో వారి పాత్ర అంతంత మాత్రమేనన్నది బహిరంగ రహస్యం. మహిళా ప్రజాప్రతినిధులపై పురుషులే ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు. స్థానిక సంస్థల్లో మాదిరిగా పురుషులపై ఆధారపడే స్వభావం చట్ట సభల్లో పనికిరాదు. ఇప్పటి వరకు చట్టసభల్లో మహిళలకు సరైన అవకాశాలు రానప్పటికీ... మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమల్లోకి వస్తే అనేక మందికి అవకాశం లభిస్తుంది. దీంతో శాసనకర్తలుగా నిర్ణయాత్మక శక్తి కలిగి ఉండి..స్వతంత్రంగా వ్యవహిరించే శక్తి కలిగి ఉండాలి. సభల్లో చర్చల్లో పాల్గొనేలా పూర్తి అవగాహన పెంచుకుని చట్ట సభల్లో తమదైన ముద్ర వేసేలా తయారు కావాల్సి ఉంటుంది.

లోక్‌సభకు ప్రాతినిధ్యమే సున్నా

ఇక ఉమ్మడి జిల్లా నుంచి లోక్‌సభకు ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ప్రాతినిధ్యం వహించలేదు. 1952 నుంచి 2019 వరకు నల్గొండ పార్లమెంటు స్థానానికి 17 సార్లు, 1962 నుంచి 2004 వరకు మిర్యాలగూడ పార్లమెంటు స్థానానికి 12 సార్లు ఎన్నికలు జరుగగా పురుషులే ప్రాతినిధ్యం వహించారు. నూతనంగా ఏర్పడిన భువనగిరి లోక్‌సభ స్థానానికి 2009, 2014, 2019లో ఎన్నికలు జరుగగా పురుషులే ఎన్నికయ్యారు.

1952 నుంచి వీరు మాత్రమే

మ్మడి జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా..పలు నియోజకవర్గాలకు 1952 నుంచి 2018 వరకు అనేక దఫాలుగా ఎన్నికలు జరగగా.. ఈ 66 ఏళ్లలో కేవలం ఐదు నియోజకవర్గాల నుంచి ఆరుగురు మహిళలు మాత్రమే చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఆలేరు నియోజకవర్గం నుంచి ఆరుట్ల కమలాదేవి..1952, 1957లో రెండు పర్యాయాలు పీడీఎఫ్‌ నుంచి, 1962లో సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో భారాస(అప్పటి తెరాస) నుంచి గొంగిడి సునీత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1978, 1983లో రెండు పర్యాయాలు సీపీఐ నుంచి మల్లు స్వరాజ్యం ప్రాతినిధ్యం వహించారు. నల్గొండ నుంచి 1985లో గడ్డం రుద్రమదేవి తెదేపా నుంచి విజయం సాధించారు. భువనగిరి నుంచి 2000, 2004, 2009లో తెదేపా నుంచి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. కోదాడ నుంచి 2014లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి నలమాద పద్మావతిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని