logo

నిఘా నీడలో నిమజ్జనం

జిల్లాలో దాదాపు 4,943 విగ్రహాలకు బుధవారం నిమజ్జనం జరగనుంది. నల్గొండ డివిజన్‌లో 2,446 విగ్రహాలకు వల్లభరావు చెరువు, చర్లపల్లి భీమ సముద్రం, మిర్యాలగూడలో 1,656 విగ్రహాలకు నాగార్జన సాగర్‌

Published : 27 Sep 2023 02:43 IST

జిల్లా కేంద్రంలోని వల్లభరావు చెరువు వద్ద అందుబాటులో ఉంచిన క్రేన్‌

నల్గొండ అర్బన్‌: జిల్లాలో దాదాపు 4,943 విగ్రహాలకు బుధవారం నిమజ్జనం జరగనుంది. నల్గొండ డివిజన్‌లో 2,446 విగ్రహాలకు వల్లభరావు చెరువు, చర్లపల్లి భీమ సముద్రం, మిర్యాలగూడలో 1,656 విగ్రహాలకు నాగార్జన సాగర్‌, అడవిదేవులపల్లి, వాడపల్లి,  దేవరకొండలో 841 విగ్రహాలకు పెద్దమునుగల్‌, డిండి, కొండభీమనపల్లి ప్రాంతాల్లో నిమజ్జనం కోసం రెవెన్యూ, మున్సిపాలిటీ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్తు, నీటిపారుదల శాఖల అధికారుల సమన్వయంతో పూర్తిస్థాయిల్లో ఏర్పాట్లు చేశారు.

నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాలతో పాటు నకిరేకల్‌, నార్కట్‌పల్లి ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ప్రతి గణపతి మండపాలకు జియో ట్యాగింగ్‌ చేయడంతో పాటు వాహనాలకు నెంబర్లు ఇచ్చారు. జిల్లా కేంద్రంలో 12 అడుగులకు పైబడిన విగ్రహాలను చర్లపల్లి భీమ సముద్రం, తక్కువగా ఉన్న వాటిని వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. బారికేడ్‌లు, క్రేన్‌లతో పాటు, తాగునీరు, ప్రాథమిక చికిత్స, లైటింగ్‌ వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

నిబంధనలు పాటించాలి: ఎస్పీ.. జిల్లాలో బుధవారం జరిగే గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రలో నిబంధనలు పాటించాలి. అన్ని ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తుతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం. జిల్లాలో 600 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పాల్గొంటున్నారు. ఇతర శాఖల సమన్వయంతో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. శోభాయాత్రలో పాల్గొనే ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలి. మద్యం తాగి వాహనాలు నడపడంతో పాటు, డీజేలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించ కూడదు. నిబంధనలు పాటించని వారిని ఉపేక్షించేది లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని