logo

సోమవారం..మొర వినం..!

వీరిద్దరి సమస్యలే కాదు, ప్రతి సోమవారం మూడు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారింది.

Published : 27 Sep 2023 02:43 IST

ప్రజా సమస్యలకు పరిష్కారం చూపని కలెక్టరేట్‌ ప్రజావాణి
ఏళ్ల తరబడి తిరుగుతున్నా న్యాయం దక్కట్లేదని వాపోతున్న బాధితులు

ఈనాడు, నల్గొండ : వీరిద్దరి సమస్యలే కాదు, ప్రతి సోమవారం మూడు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారింది. స్థానిక అధికారులను కలిసినా లాభం లేకపోవడంతో ఉన్నతాధికారులను కలిసి, తమ సమస్యలను విన్నవిస్తే పరిష్కారం దొరుకుతుందని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న బాధితులకు ఇక్కడా న్యాయం జరగడం లేదు. తిరిగి స్థానిక అధికారులనే కలవాలని బాధితులను ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉసూరుమంటున్నారు. క్షేత్రస్థాయిలో భూ సంబంధిత సమస్యలు, ధరణి, ఆసరా పెన్షన్‌లు రావడం లేదని, రెండు పడకగదుల ఇళ్లను కేటాయించాలనే కారణాలతోనే ఎక్కువ మంది బాధితులు నిత్యం ప్రజావాణికి వస్తున్నారు. ఇటువంటి వారిని క్షేత్రస్థాయిలోని అధికారులను కలవాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా.... క్షేత్రస్థాయిలో పరిష్కారం దొరకక..కలెక్టరేట్‌కు వచ్చిన వారినీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వినతులు వేలల్లో...పరిష్కారం పదుల్లో...

మూడు జిల్లాల కలెక్టరేట్‌లకు ప్రతి సోమవారం వందల సంఖ్యలో బాధితులు ఉన్నతాధికారులను కలవడానికి వస్తున్నారు. సాధారణ రోజుల్లో కలిసేందుకు వచ్చిన వారు వీరికి అదనం. ఇలా ప్రతి దరఖాస్తును కలెక్టరేట్‌లో నమోదు చేస్తున్నారు. అయితే దరఖాస్తు పరిష్కారం రిపోర్టును మాత్రం నమోదు చేయడం లేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. నిత్యం వేలల్లో వినతులు వస్తున్నా...పరిష్కారం మాత్రం పదుల సంఖ్యలోనే ఉంటున్నాయని సమాచారం. ప్రజావాణికి వస్తున్న దరఖాస్తులను తప్పకుండా నమోదు చేసి వాటిని నిర్ణీత సమయంలో పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తే తప్పితే పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం కావు. ఈ మేరకు ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలతో పోలిస్తే నల్గొండలోనే ప్రస్తుతం ఎక్కువ వినతులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.


నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరుకు చెందిన సరికొండ రామలింగరాజుకు సర్వే సంఖ్య 385/ఊలో రెండెకరాల భూమి ఉంది. అందుకు సంబంధించి గతంలో ప్రభుత్వం పట్టా పుస్తకం మంజూరు చేసింది. ఏళ్ల నుంచి ఆ భూమిలో ఆయన సేద్యం చేసుకుంటున్నారు. కొత్తగా వచ్చిన ధరణిలో మాత్రం రెండెకరాలకు బదులు ఎకరం భూమిని మాత్రమే అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దానినీ నిషేధిత జాబితాలో ఉంచారు. ఇది తన పూర్వికుల నుంచి వచ్చిన ఆస్తి అని, తన భూమిని నిషేధిత జాబితాలో నుంచి తొలగించి ఆన్‌లైన్‌లో రెండెకరాలనూ నమోదు చేయాలని రెండేళ్ల నుంచి నల్గొండ కలెక్టరేట్‌కు మూడు సార్లు వచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని బాధితుడు ‘ఈనాడు’తో వాపోయారు. అక్కడ, ఇక్కడ అంటూ తిప్పుతున్నారు తప్పితే తన సమస్యను ఎవరూ పట్టించుకోలేదని ఆయన ‘ఈనాడు’తో ఆవేదన వ్యక్తం చేశారు. అంగవైకల్యంతో బాధపడుతున్న తాను ప్రతిసారీ నల్గొండకు రాలేకపోతున్నానని వెల్లడించారు.


సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం తాళ్లసింగారానికి చెందిన మడ్డి అంజయ్య సూర్యాపేటలోని ఎస్‌బీఐ బ్యాంకులో పంట రుణం తీసుకున్నారు. తాజాగా ప్రభుత్వం చేసిన రుణ మాఫీలో ఈయనకు రూ.60,622 మాఫీ అయినట్లు చరవాణికి సందేశం వచ్చింది. బ్యాంకులో అడిగితే రుణమాఫీ కాలేదని చెబుతున్నారని, గత నెల రోజుల్లో మూడు సార్లు కలెక్టరేట్‌లోని ప్రజావాణికి వస్తున్నానని...అయితే బ్యాంకు అధికారులను కలవాలని చెబుతున్నారు కానీ తన సమస్యను పరిష్కారం చేయడం లేదని అంజయ్య వాపోయారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని