logo

చూడచక్కని ప్రాంతాలు..ప్రకృతి నేస్తాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యాటకులను ఆకట్టుకునే అనేక ప్రత్యేకతలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయడంతో యాదాద్రి క్షేత్రం రాష్ట్రంలోని భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటుంది.

Published : 27 Sep 2023 02:43 IST

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

రాచకొండ ఖిల్లా ద్వారం

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యాటకులను ఆకట్టుకునే అనేక ప్రత్యేకతలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయడంతో యాదాద్రి క్షేత్రం రాష్ట్రంలోని భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. అదే తరహాలో భువనగిరి కోట, కొలనుపాకలోని ప్రముఖ జైన మందిరం, సోమేశ్వరాలయం, మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకునే అద్భుత ప్రదేశాలు. ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ నుంచి ఉత్తమ గ్రామంగా అవార్డు సాధించిన భూదాన్‌ పోచంపల్లి పట్టు చీరలకు ప్రసిద్ధి. అక్కడే భూదానోద్యమం ఊపిరి పోసుకుంది. దానికి సమీపంలోనే దేశ్‌ముఖి గ్రామంలో దేశంలోనే మొట్టమొదటి సాయిబాబా అష్టభుజి దేవాలయం నిర్మితమైంది. చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెంలో అంతర్జాతీయంగా పేరొందిన ఇక్కత్‌ డిజైన్లతో మగ్గాలపై చేనేత వస్త్రాలు తయారవుతాయి. దీనికి సమీపంలోనే సంస్థాన్‌ నారాయణపురం మండల పరిధిలో తెలంగాణ ప్రాంతమంతటికీ రాజధానిగా విలసిల్లిన రాచకొండ ఉంది. అక్కడి ప్రాచీన ఆలయాలు, శిలా శాసనాలు, ప్రకృతి సౌందర్యం ఆకట్టుకుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన తేలియా రుమాల్‌ తయారు చేసే పుట్టపాక గ్రామం ఇక్కడే ఉంది. ఇక్కడి చేనేత కళాకారులు మగ్గాలపై తేలియా రుమాల్‌ తయారు చేసే ప్రక్రియ వైవిధ్యంగా ఉంటుంది. సిద్దోనిగూడెం శివారులోని గుట్టపై శ్రీ వీర వెంకటవర సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి నెలా ప్రత్యేకంగా వ్రతాలు నిర్వహిస్తుంటారు. వేణుగోపాల స్వామి, సాయిబాబా, ఇతర దేవతలు ఈ గుట్టపైనే కొలువుదీరారు. చౌటుప్పల్‌ పురపాలిక లింగోజీగూడెంలో ఆకట్టుకునే పురాతన మెట్లబావి ఉంది. ఈ ప్రత్యేక ప్రాంతాలను అభివృద్ధి చేసి, తగిన ప్రచారం కల్పిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్థానికులకు ఉపాధి, హస్తకళలకు గుర్తింపుతో పాటు వాటిపై ఆధారపడిన కళాకారులకు చేతినిండా పని, ఆర్థికాభివృద్ధి జరగడంతో పాటు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశముంది. బుధవారం ప్రపంచ పర్యటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం, పర్యటక శాఖ ప్రణాళికలు రూపొందించి, నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


చరిత్రకు నిలువుటద్దం.. ఉండ్రుగొండ గిరిదుర్గం

ఉండ్రుగొండ గిరిదుర్గంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువుదీరిన ఆలయం

చివ్వెంల, న్యూస్‌టుడే: ఎత్తయిన కొండలు, చుట్టూ పచ్చని చెట్లు, ఆధ్యాత్మికతను చాటే దేవాలయాలు, వివిధ రాజుల చరిత్రను తెలిపే శాసనాలు, ప్రాకారాలు, అబ్బురపరిచే పలు కట్టడాలతో చరిత్రకు నిలువుటద్దంగా నిలుస్తోంది ఉండ్రుగొండ గిరిదుర్గం. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సరిగ్గా 10 కి.మీ దూరంలో, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో చివ్వెంల మండలం ఉండ్రుగొండ పంచాయతీ సమీపంలో ఈ కొండలు దర్శనమిస్తుంటాయి. ప్రకృతి రమణీయతను చాటే ఉండ్రుగొండ సొగసు చూపరులకు కనులవిందు చేస్తోంది.

చారిత్రక నేపథ్యం

గిరిదుర్గంలో ఎనిమిది ఎత్తయిన కొండలు, వాటిని కలుపుతూ ఉండే రాతి ప్రాకారాలను చూసి తీరాల్సిందే. 1400 ఎకరాల విస్తీర్ణ్ణం కలిగిన ఈ అడవిలోని కొండలను కలిపే ఉండే రాతి ప్రాకారం 14 కిలోమీటర్ల పొడవునా సుమారుగా 10 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తున ఉంటుంది. అప్పటి రాజులు శత్రువుల దాడి నుంచి రక్షణ పొందడానికి ఈ ప్రాకారాన్ని పటిష్ఠంగా ఏర్పాటు చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కనిపించే రాక్షస గూళ్లు ఆదిమ జాతి మానవుని మనుగడను చూపిస్తాయి. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం, క్రీస్తుశకం 2వ శతాబ్దం నాటి ఆనవాళ్లు ఇక్కడి పలు దేవాలయాల గోడలపై కనిపిస్తుంటాయి. విష్ణుకుండినుల నాటి పలు వైష్ణవ దేవాలయాలు, మండపాలు శిథిలమయ్యాయి. రేచర్ల వెలమరాజుల దుర్గాలు, కళ్యాణ చక్రవర్తుల కాలం నాటి జంట వీరుల గుర్తులు, కాలభైరవ ప్రతిమలు ఇక్కడ కొలువుదీరాయి. ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, రెడ్డిరాజులు, రేచర్ల వెలమరాజులు, చోళులు, కళ్యాణచాళుక్యులు, గజపతిరాజులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, తదితర రాజులు ఈ గిరిదుర్గాన్ని ఆవాసంగా ఏర్పాటుచేసుకొని పరిపాలన చేసినట్లుగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఇందుకు సాక్ష్యంగానే కోటగోడలు, రాజమందిరాలు, నర్తనశాలలు, కోనేర్లు, కొలిమిచావిడి తదితర కట్టడాలు నిలుస్తున్నాయి.

శ్రీస్వామికి నిత్యపూజలు

పదిహేనేళ్ల క్రితం గిరిదుర్గంలో బయటపడిన లక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్టు నిత్యపూజలు, హోమాలతో విరాజిల్లుతోంది. శ్రీఉమామహేశ్వరస్వామి దేవాలయంతో పాటు శ్రీగంగామళ్లేశ్వరస్వామి దేవాలయాలను భక్తులు అధిక సంఖ్యలో సందర్శించి పూజలు చేస్తున్నారు. ఆంజనేయస్వామి, కాలభైరవ, లింగమంతులస్వామి తదితర దేవాలయాల్లో యాత్రికులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.


ఆర్కియాలజీ కేంద్రం ఏర్పాటు చేయాలి

ఆదుర్తి రామయ్య, ఉండ్రుగొండ అభివృద్ధి కమిటీ సభ్యుడు

భక్తులు, పర్యాటకులను ఆకట్టుకునే ఎన్నో వింతలు, విశేషాలు ఉండ్రుగొండ గిరిదుర్గంలో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు గిరిదుర్గానికి వస్తున్నారు. వారికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చితే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఆర్కియాలజీ కేంద్రం ఉంటే పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని