logo

బాపూ బాటలో..పల్లెవాడలో..!

గ్రామాల పరిశుభ్రతకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.

Published : 27 Sep 2023 02:43 IST

స్వచ్ఛతా ా సేవా కార్యక్రమంలో భాగంగా కొమ్ముబండ తండాలో వీధులను శుభ్రం చేస్తున్న మహిళలు

సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే:  గ్రామాల పరిశుభ్రతకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే స్వచ్ఛ గ్రామాలు రూపుదిద్దుకుంటాయని గాంధీజీ చెప్పిన మాటలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆయన జయంతిని పురస్కరించుకొని గ్రామాల్లో స్వచ్ఛతా ా సేవా కార్యక్రమాలకు 2021, అక్టోబరు 2న శ్రీకారం చుట్టారు. కాగా ఈ కార్యక్రమాలను ఈ నెల 15 నుంచి అక్టోబరు 2 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.

ప్రజల భాగసామ్యంతో శ్రమదానం

ఉమ్మడి జిల్లాలోని 1,740 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రధాన కూడళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, పాఠశాలలు తదితర ప్రజాప్రయోగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. చెత్తాచెదారం, కాల్వల్లో పేరుకున్న మురుగును శుభ్రం చేస్తున్నారు. పంచాయతీ పాలకవర్గాలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగసామ్యంతో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కంపోస్టు షెడ్లలో తడి, పొడి చెత్త వేరు చేయడంతోపాటు సేంద్రియ ఎరువులు తయారు చేయడంపై దృష్టి పెట్టారు. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే గ్రామాల్లో సభల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని తీర్మానించేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని పంచాయతీల్లో ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించేలా కార్యాచరణ రూపొందించారు. దానికి ప్రత్యామ్నాయంగా కాగితం, వస్త్రం, జూట్ సంచులు వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నారు.

రోజు వారీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా!

గత ఏడాది స్వచ్ఛతా ా సేవలో ప్రభుత్వం నిర్ధేశించిన అంశాలన్నీ అమలు కాలేదన్న ఆరోపణలున్నాయి. రహదారుల శుభ్రం, డ్రైనేజీల్లో మురుగు తొలగింపు వంటి రోజువారీ కార్యక్రమాలకే పంచాయతీ అధికారులు పరిమితమయ్యారు. ప్రారంభించిన సమయంలో నామమాత్రంగా కార్యక్రమాలు చేపట్టి వదిలేశారు. ఆదర్శ గ్రామాల్లో మినహా తడి, పొడి చెత్త సేకరణ, కంపోస్టు ఎరువుల తయారీ నేటికీ ఎక్కువ పంచాయతీల్లో జరగడం లేదు. ఎరువుల తయారీ రూపంలో ఆదాయం సంపాదిస్తున్న పంచాయతీలు వేళ్ల మీద లెక్కించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని