logo

14 ఏళ్ల బాలికతో ప్రేమ వివాహం

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక(14)ను పెళ్లి చేసుకున్న యువకుడితోపాటు అతడికి సహకరించిన మరో ముగ్గురు యువకులపై పోక్సో కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.

Updated : 27 Sep 2023 06:13 IST

నలుగురిపై పోక్సో కేసు.. రిమాండ్‌ 

వివరాలు వెల్లడిస్తున్న సీఐ ఎం.సత్యనారాయణ, చిత్రంలో ఎస్సై నర్సింహులు, పోలీసులు, ముసుగులో నిందితులు

మిర్యాలగూడ గ్రామీణం, న్యూస్‌టుడే: తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక(14)ను పెళ్లి చేసుకున్న యువకుడితోపాటు అతడికి సహకరించిన మరో ముగ్గురు యువకులపై పోక్సో కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. గ్రామీణ సీఐ ముత్తినేని సత్యనారాయణ, ఎస్సై డి.నర్సింహులు తెలిపిన వివరాలిలా.. గ్రామీణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కనిపించడం లేదని ఆమె తండ్రి ఈ నెల 22న ఫిర్యాదు చేశారు. అదే రోజు ఓ యువకుడు ఆమెను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లినట్లు తెలియడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికను ప్రేమించిన యాద్గార్‌పల్లికి చెందిన చరణ్‌దీప్‌ తన తమ్ముడు చరణ్‌తేజ్‌, మిత్రులు అంజి, మహేష్‌ సహకారంతో ఆమెను అడవిదేవులపల్లి మండలం సత్రశాలకు తీసుకెళ్లి దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. అక్కడ నుంచి బాలికను నలుగురు కలిసి హైదరాబాదు తీసుకెళ్లారు. భయపడిన బాలిక తన తండ్రి వద్దకు వెళతానని చెప్పగా... హైదరాబాదులోని హయత్‌నగర్‌ బస్టాండ్‌లో వదిలి వెళ్లారు. పోలీసులు, తల్లిదండ్రులు బాలికను గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. నిందితులు నలుగురు అవంతీపురం సమీపంలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు పట్టుకున్నారు. విచారించి నలుగురిని కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్‌ విధించారు.

స్నేహం పేరుతో భవిష్యత్తు పాడు చేసుకోవద్దు

మిత్రులు చేసే చట్టవ్యతిరేక తప్పులకు సహకరించి భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సీఐ సత్యనారాయణ హితవు చెప్పారు. పిల్లల నడవడికను గమనించి వారికి సమాజం, చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని గుర్తించాలన్నారు. పరిణితి లేని ప్రేమతో జైలు పాలుకావొద్దన్నారు. చట్టవ్యతిరేక చర్యలు పాల్పడితే ఎవరిని ఉపేక్షించమని హెచ్చరించారు. కేసులో చాకచక్యం ప్రదర్శించిన కానిస్టేబుల్‌ నాగయ్య, హోంగార్డు గోపిలను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని