logo

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ

రానున్న ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు కలెక్టరు వినయ్‌కృష్ణారెడ్డి వెల్లడించారు.

Updated : 27 Sep 2023 06:09 IST

తుది దశకు ఓటరు జాబితా కసరత్తు
ఒకట్రెండు రోజుల్లో బస్వాపురం నిర్వాసితులకు పూర్తి పరిహారం
‘ఈనాడు’తో కలెక్టరు వినయ్‌కృష్ణారెడ్డి

ఈనాడు, నల్గొండ : రానున్న ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు కలెక్టరు వినయ్‌కృష్ణారెడ్డి వెల్లడించారు. వచ్చే నెలలో షెడ్యూల్‌ విడుదల కానుందనే ప్రచారం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఓటరు జాబితా నమోదు, ప్రచురణ, అధికారులకు శిక్షణా కార్యక్రమాలన్నీ తుది దశకు చేరాయని పేర్కొన్నారు. ‘ఈనాడు’తో ఆయన మంగళవారం ప్రత్యేకంగా మాట్లాడారు.

సమావేశానికి అంతా సిద్ధం

వచ్చే నెల 4న హైదరాబాద్‌లో సీఈసీ అధికారులతో కలెక్టర్ల సమావేశం ఉంది. జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవో)గా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేస్తున్న కసరత్తుపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వాల్సి ఉంది. అందుకు అన్ని వివరాలను సిద్ధం చేశాం. ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణకు చేసిన కసరత్తును అందులో కేంద్ర అధికారులకు వివరిస్తాం. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని కమిటీలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. షెడ్యూల్‌ విడుదలయిన క్షణం నుంచి అవన్నీ చురుగ్గా పనిచేస్తాయి. ఓటరు జాబితా తయారు నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు జరిగే క్రతువులో ఎక్కడా పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

మానవీయ కోణంలో..      

బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారికి పెండింగ్‌లో ఉన్న నిధులు ఒకట్రెండు రోజుల్లో పూర్తిగా విడుదల కానున్నాయి. నిర్వాసితుల సమస్యలను మానవీయ కోణంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అందుకు ప్రతి బుధవారం జిల్లా అధికారులందరితో కలిసి భూ సేకరణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నాం. బీఎన్‌ తిమ్మాపురంతో పాటూ నిర్వాసితులందరికీ రావాల్సిన పరిహారం దక్కగానే రిజర్వాయర్‌ను పూర్తిగా నింపడానికి చర్యలు తీసుకుంటాం.

టెండర్లను ఆహ్వానించాం

సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలో అభివృద్ధి కార్యక్రమాలను చురుగ్గా చేయాలని నిర్ణయించాం. గ్రామంలో సుమారు 430కి పైగా ఇళ్ల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించాం. వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ కొలిక్కి వస్తుంది. దీంతో లే అవుట్‌ ప్రకారం ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతాం. ఇప్పటికే ప్రభుత్వ భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.

బోగస్‌ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ

‘ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రతి పోలింగ్‌ బూత్‌లోనూ బోగస్‌ ఓట్లపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి తొలగించాం. పోలింగ్‌ కేంద్రాల్లో ఇతరులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఓటరు నమోదుకు సుమారు 33 వేల దరఖాస్తులు వచ్చాయి. అన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నాం. ఓటరు గుర్తింపు కార్డులను నేరుగా ఓటరుకు పంపేందుకు కొత్త ఏజెన్సీని నియమించాం. ఓటరుగా నమోదైన వారం పది రోజుల్లో పోస్టు ద్వారా సదరు ఓటరుకు గుర్తింపు కార్డు వస్తుంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపులో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కొత్త నిబంధనలను పాటించాలని ఆదేశించింది. దీని ప్రకారం రెండు నియోజకవర్గాల్లో సుమారు 100కు పైగా క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించాల్సి వస్తోంది. షెడ్యూల్‌ విడుదల సమయంలో సీఈసీ నిబంధనలను అనుసరించి వాటిని ప్రకటిస్తాం. నోటిఫికేషన్‌ విడుదల అనంతరం సాంకేతికంగా నామినేషన్‌కు పది రోజుల ముందు వరకు నమోదు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పిస్తాం. వాటిని తుది ఓటరు జాబితాకు అనుబంధంగా జోడిస్తాం. (నామినేషన్‌కు ముందు రోజు వరకూ ఓటరు నమోదుకు అవకాశం ఉన్నా...నమోదు చేసుకున్న దరఖాస్తుల పరిశీలకు పది రోజుల సమయం పడుతుండటంతో పది రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటేనే కొత్త ఓటరుగా అవకాశం ఉంటుంది).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని