Crime News: కొడుతూ.. తిడుతూ.. ఆపై వీడియో తీసి
మహిళపై నెల్లూరులో పాశవిక దాడి
మూడు నెలల నాటి వీడియో తాజాగా వెలుగులోకి
ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సీహెచ్. విజయరావు. చిత్రంలో నిందితులు
నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే : ఓ మహిళపై విచక్షణా రహితంగా దాడి చేయడమే కాకుండా ఆ సంఘటనను చిత్రీకరించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడు నెలల కిందట జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బుధవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఆ వివరాలను ఎస్పీ సీహెచ్. విజయరావు వెల్లడించారు. ‘‘నెల్లూరులోని రామకోటయ్య నగర్‌కు చెందిన పల్లాల వెంకటేష్, శివకుమార్ స్నేహితులు. మరో ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువతి వెంకటేష్‌తో సన్నిహితంగా ఉండేది. అనంతరం అతడి ప్రవర్తన నచ్చక మాట్లాడటం మానేసింది. దాంతో వెంకటేష్ కొత్తూరు ప్రాంతంలోని అడవిలోకి ఆమెను తీసుకెళ్లి తనతో పాటు స్నేహితుడితోనూ సన్నిహితంగా ఉండాలంటూ అసభ్యంగా దూషిస్తూ కర్ర, చేతులతో దాడి చేశాడు. తనను విడిచిపెట్టాలని మొర పెట్టుకున్నా వినిపించుకోలేదు. ఈ ఘటనను శివకుమార్ తన ఫోనులో వీడియో తీశాడు. అది బుధవారం వైరల్ కావడంతో ఇద్దరినీ పోలీసులు కలువాయి మండలం తెగచర్లలో అరెస్టు చేశారు. బుధవారం ఉదయం 8 గంటలకు.. యువతిపై దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా గంట వ్యవధిలోనే పోలీసులు నిందితులను అరెస్టు చేశారు’’ అని ఎస్పీ వివరించారు. యువతిపై దాడి చేసిన వెంకటేష్ మీద రౌడీషీట్ తెరుస్తున్నట్లు చెప్పారు.
నిందితులపై చర్యలు తీసుకోవాలి: లోకేశ్
ఈనాడు డిజిటల్,అమరావతి : నెల్లూరు జిల్లాలో మహిళను అత్యంత దారుణంగా హింసించడమే కాకుండా.. దాడిని చిత్రీకరిస్తూ పైశాచిక ఆనందం పొందే ధైర్యం చేస్తున్నారంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులున్నాయో అర్థమవుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మహిళపై దాడికి పాల్పడ్డవారిపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి చేతగానితనాన్ని అలుసుగా తీసుకున్న మృగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. జగన్.. అధికారంలోకొచ్చాక ఆంధ్రప్రదేశ్‌ను అఫ్గానిస్థాన్‌లా మార్చేశారు’’ అని ధ్వజమెత్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.