సవాళ్ల దారిలో.. ఇక్కట్ల సవారి
జాతీయ రహదారి మనుబోలు వద్ద నిలిచిపోయిన వాహనాలు
గూడూరు పట్టణం, గ్రామీణం, మనుబోలు, న్యూస్‌టుడే: మనుబోలు- గూడూరు సరిహద్దులోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై వాహనదారుల ఇక్కట్లు కొనసాగుతున్నాయి. తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసి వరదలు రావడంతో ఇక్కడ ట్రాఫిక్ స్తంభించిన విషయం తెలిసిందే. వంతెనల నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన మళ్లింపు రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. యంత్రాంగం వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణకు శ్రమిస్తున్నా.. ఆగుతూ.. సాగుతూ ఉండే పరిస్థితి నెలకొంది.
అయినప్పటికీ..
నూతనంగా నిర్మిస్తున్న వంతెన సర్వీసు రోడ్డుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి మళ్లింపు రోడ్డును కలిపారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను ప్రత్యామ్నాయ మళ్లింపు రోడ్డుకు పంపుతూ ట్రాఫిక్ పునరుద్ధరించారు. భద్రతా చర్యల మధ్య నెల్లూరు-గూడూరు వైపు వెళ్లే మార్గంలో ఇరువైపులా లారీలను వరద నీరు ప్రవహిస్తున్న రోడ్డుపై పంపించారు. ఈ క్రమంలో అతికష్టం మీద నెమ్మదిగా వరద నీటిలో ప్రయాణిస్తున్న పలు వాహనాలు మధ్యలోనే నిలిచిపోగా.. వాటిని పొక్లెయిన్ల సాయంతో పక్కకు తీశారు. వాహన రాకపోకలు నెమ్మదించడంతో జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు 20 కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోసారి జాతీయ రహదారిపై వరదనీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు నిలిపివేశారు.
అధికారుల పరిశీలన
కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎస్పీ విజయరావు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారుల పర్యవేక్షణలో వాహనాలను కొనసాగించేలా ఆదేశాలిచ్చారు. పెద్ద వాహనాలను ఆ మార్గంలో పంపి, అడ్డరోడ్డు కూడళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తూ క్రమబద్ధీకరించారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ.. వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సమస్య పరిష్కారానికి చర్యలు
- కలెక్టర్ చక్రధర్‌బాబు
వరదనీరు జాతీయ రహదారిపై రావడం వల్ల ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. వంతెనల నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించాం.
భారీ వాహనాల మళ్లింపు
- ఎస్పీ విజయరావు
ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా భారీ వాహనాలను కృష్ణపట్నం పోర్టు రోడ్డు నుంచి దారి మళ్లించి.. కోట దగ్గర జాతీయ రహదారిపైకి వెళ్లేటట్లు చేశాం. చిన్న వాహనాలను మాత్రమే మనుబోలు మార్గంలో పంపుతున్నాం. ఆదిశంకరా కళాశాల సమీపంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. సిబ్బందిని అందుబాటులో ఉంచాం. వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నాం. తిరుపతి నుంచి వచ్చే వాహనాలను నాయుడుపేట నుంచి వెంకటగిరి, రాపూరు, పొదలకూరు మీదుగా.. అయ్యప్పగుడి సెంటర్ నుంచి జాతీయ రహదారికి కలుపుతున్నాం.
పరిస్థితిని పరిశీలించేందుకు లారీ ఎక్కుతున్న కలెక్టర్