logo
Published : 02/12/2021 04:40 IST

కాలుష్యభూతం..కావాలి చైతన్యం

ఇష్టానుసారంగా చెట్ల నరికివేత

పెరుగుతున్న ఇంధన, ప్లాస్టిక్‌ వినియోగం

నేడు జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం

నగరంలో చెత్త కాల్చడంతో వస్తున్న పొగ

పీల్చే గాలి, తాగే నీరు కలుషితమైంది. దీనికితోడు విచక్షణారహితంగా ప్రకృతి వనరుల వినియోగం జరుగుతోంది. భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని పరిశ్రమల నుంచి కాలుష్య వాయువులు విడుదలవుతున్నాయి. దీంతో వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈభూతం నుంచి ప్రాణికోటిని రక్షించుకోవాలంటే చైతన్యం కావాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. మొక్కలు నాటి పెంచాలని సూచిస్తున్నారు. వనరుల వినియోగంలో విచక్షణ పాటించాలని హెచ్చరిస్తున్నారు. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంపై కథనం.

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాలుష్యం ప్రమాదకరంగా పెరుగుతున్న పట్టణాల జాబితాలో నెల్లూరు పేరును 2018లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. నగరంలో కాలం చెల్లిన వాహనాలు లెక్కకు మిక్కిలిగా రోడ్లపై తిరుగుతున్నాయి. దీంతో గాలి కలుషితమవుతోంది. ప్రమాదకరమైన క్యాన్సర్‌తో పాటు ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతోంది. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం పీల్చే గాలిలో సూక్ష్మ ధూళి కణాల వార్షిక సగటు ఒక క్యూబిక్‌ మీటర్‌ గాలిలో 60 మైక్రోగ్రాములకు మించి ఉండకూడదు. రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో గాలిలో సూక్ష్మ ధూళి కణాలు (పీఎం10) 62గా నమోదైనట్లు వెల్లడించింది. కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని హెచ్చరించింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో 16 మెగా ప్రాజెక్టులు, 54 పెద్ద పరిశ్రమలు, అయిదు వేల వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. చెన్నై- బెంగళూరు నడవాలో భాగంగా క్రిస్‌ సిటీ ఏర్పాటు కాబోతుంది. మరెన్నో కొత్త పరిశ్రమలు రానున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం పర్యావరణంపై చూపే ప్రభావాన్ని బట్టి రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ కేటగిరీలుగా విభజించారు. జిల్లాలో రెడ్‌ కేటగిరీలో 212, ఆరెంజ్‌లో 112, గ్రీన్‌ కేటగిరీలో 98 పరిశ్రమలున్నాయి. పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు తగ్గట్లుగా పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు జరగాలి. పరిశ్రమ ఏర్పాటు కాబోయే స్థలంలో 30 శాతం పచ్చదనాన్ని పెంపొందించాలి. అయితే కొన్ని పరిశ్రమలు నిబంధనలను పట్టించుకోవడం లేదు.

తరిగిపోతున్న వన సంపద

పెరుగుతున్న జనాభా అవసరాలు.. అభివృద్ధి పేరుతో జరుగుతున్న రోడ్ల విస్తరణ. కాలువల నిర్మాణాల పేరుతో చెట్లను ఇష్టానుసారంగా నరికివేస్తున్నారు. అదేస్థాయిలో మొక్కలను నాటే కార్యక్రమాలు జరగడం లేదు. వివిధ ప్రాజెక్టుల పేరుతో అటవీ భూమిని బదలాయించడం, అటవీసంపదను స్మగ్లర్లు కొల్లగొట్టడంతో వన సంపద కనుమరుగవుతోంది. నిబంధనల ప్రకారం 31శాతం అటవీ భూభాగం ఉండాల్సి ఉండగా తక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి.

రోడ్లన్నీ పొగబారుతున్నాయి

వాహనాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల వరకు ద్విచక్రవాహనాలు, ఆటోలు, కారులు, లారీలు, ట్రాక్టర్లు తదితర వాహనాలతో కలిపి 5.50లక్షల వరకు వాహనాలుంటాయని అంచనా. వాహనాల పెరుగుదలతో ఇంధన వినియోగం ఎక్కువైంది. వీటితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలతో కాలుష్యం మరింత పెరిగిపోతోంది.

ఏది చె(చి)త్తశుద్ధి

జిల్లాలో కాలుష్యం పెరిగిపోవడానికి ఆవాసాల నుంచి వస్తున్న చెత్తను శుద్ధి చేసే పనులు మాటలకే పరిమితమైంది. నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో జనావాసాల నుంచి రోజు 300 టన్నుల చెత్త వస్తోంది. కావలిలో 43, గూడూరులో 34, సూళ్లూరుపేటలో 21, బుచ్చిలో 20, ఆత్మకూరులో 16.5 టన్నుల చొప్పున చెత్త వెలువడుతోంది. వెంకటగిరిలో 600 కేజీలు వస్తోంది. దీన్నుంచి కరెంటు ఉత్పత్తి, ఎరువుల తయారుచేస్తామని అధికారులు చేస్తున్న ప్రకటనలు ఆచరణరలోకి రావడం లేదు. దీన్ని కాల్చివేయడం ప్రమాదకరంగా మారుతోంది.

నివారించేందుకు చర్యలు

రాజశేఖర్‌, ఈఈ, కాలుష్యనియంత్రణ మండలి

జిల్లాలో కాలుష్యం నివారించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. అన్ని శాఖలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నాం. 2018లో కాలుష్యం పెరిగిన పట్టణాల జాబితాలో నెల్లూరు ఉంది. కొవిడ్‌, లాక్‌డౌన్‌ పరిస్థితుల నాటి నుంచి జిల్లా, నగరంలో కాలుష్యం తగ్గింది. కాలుష్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం.

Read latest Nellore News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని