logo

తోడు దొంగలుఏడాదిలో 27వాహనాల చోరీ

ఇద్దరు స్నేహితులు కనిపించిన ప్రతి ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారు.. నెలకు రెండు, మూడు చొప్పున సంవత్సరంలో 27 వాహనాలను మాయం చేశారు. ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఆదేశాల మేరకు సీసీఎస్‌, నెల్లూరుగ్రామీణ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈ దొంగలను అదుపులోకి తీసుకున్నారు.

Published : 21 Jan 2022 02:03 IST


పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు

నెల్లూరు (నేర విభాగం) : ఇద్దరు స్నేహితులు కనిపించిన ప్రతి ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారు.. నెలకు రెండు, మూడు చొప్పున సంవత్సరంలో 27 వాహనాలను మాయం చేశారు. ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఆదేశాల మేరకు సీసీఎస్‌, నెల్లూరుగ్రామీణ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈ దొంగలను అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం స్థానిక సీసీఎస్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో క్రైం బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ బాజీజాన్‌ సైదా ఆ వివరాలను వెల్లడించారు.

వృత్తి వేరైనా.. ప్రవృత్తి మాత్రం ఒక్కటే..

ఒకరు ఆటో డ్రైవరు.. మరొకరు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటారు.. వీరి వృత్తులు వేరైనా ప్రవృత్తి మాత్రం దొంగతనాలు కావడంతో జైలులో కలిశారు. దుత్తలూరు మండలం రాచవారిపల్లికి చెందిన పత్తి వెంకటరత్నం అలియాజ్‌ మధు పాత నేరస్థుడు. ఆటో డ్రైవరుగా పనిచేస్తూ బైక్‌ దొంగతనాలు చేస్తున్నాడు. గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లోనూ జైలు జీవితం గడిపాడు. ఏడాది కిందట సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆత్మకూరు మండలం జగన్నాథరావుపేట ప్రాంతానికి చెందిన షేక్‌ మస్తాన్‌ అలియాజ్‌ కలవల కిషోర్‌ కూడా పాత నిందితుడే. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ రాత్రిళ్లు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతుండగా సూళ్లూరుపేట పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైల్లో స్నేహితులుగా మారిన వీరు.. జిల్లాలోని 14 పోలీసుస్టేషన్ల పరిధిలో 27 ద్విచక్ర వాహనాలు చోరీ చేశారు. అరెస్టు చేసిన సీసీఎస్‌ సిబ్బంది ఏఎస్సై జె.వెంకయ్య, హెడ్‌కానిస్టేబుళ్లు వారీస్‌ అహ్మద్‌, భాస్కర్‌, రామగిరి సురేష్‌కుమార్‌, కానిస్టేబుళ్లు సుబ్బారావు, నరేష్‌, అరుణ్‌కుమార్‌, ఎస్‌కే మహబూబ్‌ బాషా, ఎ.గోపి, షేక్‌ ఇస్మాయిల్‌లను జిల్లా ఎస్పీ అభినందించినట్లు ఇన్‌స్పెక్టర్‌ బాజీజాన్‌ తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని