logo

చీకటి జీవోలు వెనక్కు తీసుకునే వరకు పోరాటం

రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీలోని 8 అంశాలపై ఇచ్చిన చీకటి జీవోలను ప్రభుత్వం వెనక్కు తీసుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని పీఆర్సీ సాధన సమితి ఛైర్మన్లు మన్నేపల్లి పెంచలరావు, ఏనుగు రమణారెడ్డి, అల్లంపాటి పెంచలరెడ్డి, చేజర్ల సుధాకర్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరులోని ఎన్జీవో హోంలో జేఏసీ

Published : 24 Jan 2022 06:12 IST


ప్రసంగిస్తున్న పెంచలరావు.. వేదికపై రమణారెడ్డి, పెంచలరెడ్డి

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీలోని 8 అంశాలపై ఇచ్చిన చీకటి జీవోలను ప్రభుత్వం వెనక్కు తీసుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని పీఆర్సీ సాధన సమితి ఛైర్మన్లు మన్నేపల్లి పెంచలరావు, ఏనుగు రమణారెడ్డి, అల్లంపాటి పెంచలరెడ్డి, చేజర్ల సుధాకర్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరులోని ఎన్జీవో హోంలో జేఏసీ రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 25వ తేదీన కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు ఏబీఎం కాంపౌండ్‌ నుంచి ర్యాలీగా బయలుదేరి గాంధీబొమ్మ, వీఆర్సీ, మద్రాసు బస్టాండు మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంటుందని జిల్లాలోని అన్ని తాలుకాల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, కాంట్రాక్టు పొరుగు సేవల ఉద్యోగులు, ఆర్టీసీ, విద్యుత్తుశాఖ ఉద్యోగులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. 26న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందిస్తామన్నారు. దశల వారీగా ఆందోళనలు చేపట్టి ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఫ్యాప్టో ఛైర్మన్‌ మురళీధర్‌, ఏపీజీఈఏ రాష్ట్ర సహాధ్యక్షుడు చొప్పా రవీంద్రబాబు, జేఏసీల కన్వీనర్లు నాయుడు వెంకటస్వామి, చెంచురామయ్య, మల్లికార్జున్‌, రమణారెడ్డి, ఐసీడీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.గిరిధర్‌, వార్డన్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు విజయకుమార్‌, పంచాయతీరాజ్‌ జిల్లా అధ్యక్షుడు పెంచలయ్య, ట్రెజరీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్‌, రెవెన్యూ సర్వీసెస్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘ రాష్ట్ర నాయకులు గిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని