logo

సమర్థంగా ఎదుర్కొందాం..!

మూడో దశ కరోనా క్రమేపీ విస్తరిస్తోంది.. స్వల్ప లక్షణాలే అయినా ఎక్కువ మందికి పాకుతోంది.. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.. అలక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో యంత్రాంగం మరింత పటిష్ఠంగా

Published : 24 Jan 2022 06:12 IST

పారదర్శకత సేవలతో కొవిడ్‌కు అడ్డుకట్ట


టీకా వేస్తున్న సిబ్బంది

మూడో దశ కరోనా క్రమేపీ విస్తరిస్తోంది.. స్వల్ప లక్షణాలే అయినా ఎక్కువ మందికి పాకుతోంది.. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.. అలక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో యంత్రాంగం మరింత పటిష్ఠంగా సేవలందిస్తే.. కరోనా నివారణ సాధ్యమవుతుంది.

న్యూస్‌టుడే, నెల్లూరు(వైద్యం) మూడో దశ కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. రోజుకు వెయ్యికి పైగా కేసులు వస్తున్నాయి. ఈ క్రమంలో వైరస్‌ దూకుడుకు కళ్లెం పడటం లేదు. మరోవైపు జిల్లా యంత్రాంగం పలు రకాల చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో లోపం వెంటాడుతూనే ఉంది. ఫలితంగా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. కేసులు సైతం పెరిగిపోతున్నా.. కట్టడి చర్యలు తూతూమంత్రంగా ఉంటున్నాయి. ఇప్పటికే రాత్రి 11 దాటితే కర్ఫ్యూను అమలు చేస్తున్నా.. కేసుల కట్టడికి ఊతమివ్వడం లేదు. దాంతో మరింతగా కర్ఫ్యూ చర్యలను కఠినతరం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

త్వరితగతిన ఫలితాలివ్వాలి:జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రులు, సచివాలయాల్లో కరోనా నిర్ధారణకు నమూనాల సేకరణ జరుగుతోంది. ఈ పరీక్షలను పెంచాల్సి ఉన్నా.. కిట్ల కొరత నెలకొన్నట్లు తెలుస్తోంది. నమూనాలను జీజీహెచ్‌లోని వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లోనే పరీక్షిస్తున్నారు. రోజుకు వేలకొద్ది కేసులు వస్తున్న నేపథ్యంలో ఫలితాలు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతోంది. గూడూరు, కావలి ప్రాంతీయ ఆసుపత్రులు, ఆత్మకూరు జిల్లా ఆసుపత్రుల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల నిమిత్తం వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొస్తే ఆయా ప్రాంతాల్లోని వారికి త్వరితగతిన ఫలితాలు అందుతాయి. దాంతో బాధితులు త్వరగా చికిత్సలు తీసుకునే వీలుంటుంది.

హద్దు మీరుతున్న వసూళ్లు

జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లు సైతం ఐసీఎంఆర్‌ అనుమతి పొంది ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇందుకు ప్రజల నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నాయనే విమర్శలున్నాయి. వీటికి రూ.350 మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలున్నా పట్టించుకోవడం లేదు.

వ్యాక్సినేషన్‌లో లోపాలు:జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌లో లోపాలు సరిదిద్దాల్సి ఉంది. చాలా మందికి వేయకుండానే వేసినట్లు చరవాణిలకు సందేశాలు వస్తున్నాయి. ఫలితంగా అర్హులైన వారికి వ్యాక్సిన్‌ పొందడంలోనూ ఇబ్బందులు నెలకొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా తొలిడోసు కింద 25,75,444 మందికి వ్యాక్సిన్‌ను నూరుశాతం పూర్తి చేయగా, రెండో డోసు కింద 21,76,726 మంది వరకు వేశారు. వ్యాక్సిన్‌ కొరత సైతం ఉన్నట్లు తెలుస్తోంది.

పక్కాగా ఫీవర్‌ సర్వే..

జిల్లాలో వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతున్న ఫీవర్‌ సర్వేను మరింత పటిష్ఠంగా నిర్వహించాల్సి ఉంది. ప్రతి వారం ఈ సర్వేను చేపడుతున్నారు. తమ పరిధిలోని ఇళ్ల వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఇలాగే వ్యాక్సిన్‌ వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతంగా నిర్వహిస్తే.. జ్వర కేసులు మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జరుగుతున్న ఫీవర్‌ సర్వేలోనూ పలు జ్వర పీడితులు వెలుగు చూస్తున్నారు.

త్వరలో గూడూరులో పరీక్షలు

- డాక్టర్‌ ఉమా, జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారి

వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని గూడూరు ఆసుపత్రిలోనూ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు త్వరలో ప్రారంభమవుతాయి. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ నిర్వహించాం. కొద్ది రోజుల్లోనే ఇక్కడా పరీక్షల నిర్వహణ అందుబాటులోకి వస్తుంది. దాంతో కొవిడ్‌ కేసుల ఫలితాలు త్వరితగతిన వెల్లడించేందుకు అవకాశముంది. ఆత్మకూరు, కావలి పరిధిలోని నమూనాలను జీజీహెచ్‌కు పంపుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని