logo

జలపథం..సంక్లిష్టం

జిల్లాల పునర్విభజనపై అంతటా విస్తృత చర్చ జరుగుతోంది. సరిహద్దుల మొదలు.. ఆదాయ, ఉపాధి అంశాలపై ఆలోచన మొదలైంది. అదే సమయంలో కీలక ప్రాజెక్టుల నిర్వహణ- సాగునీటి ప్రయోజనాలపై ఆందోళన నెలకొంది. జిల్లాల విభజన తీరును పరిశీలిస్తే.

Published : 28 Jan 2022 01:17 IST

ప్రాజెక్టులపై జిల్లా విభజన ప్రభావం

 ఇబ్బందులు తప్పవేమోనని ఆందోళన

జిల్లాల పునర్విభజనపై అంతటా విస్తృత చర్చ జరుగుతోంది. సరిహద్దుల మొదలు.. ఆదాయ, ఉపాధి అంశాలపై ఆలోచన మొదలైంది. అదే సమయంలో కీలక ప్రాజెక్టుల నిర్వహణ- సాగునీటి ప్రయోజనాలపై ఆందోళన నెలకొంది. జిల్లాల విభజన తీరును పరిశీలిస్తే.. ఈ విషయం ఎవరికైనా బోధ పడుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ విషయంలో సానుకూల పరిష్కారం ఎలా ఉండనుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

ఆత్మకూరు, న్యూస్‌టుడే : సోమశిల...అంతరాష్ట్ర ప్రాధాన్యమున్న జలాశయం. ఇప్పటి వరకు ఇది, కండలేరు జలాశయాలు ఒకే జిల్లా పరిధిలోనే ఉండటంతో సమస్యలు ఉత్పన్నం కాలేదు. జిల్లా సరిహద్దులు మారనున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. కండలేరు జలాశయం.. దాని వరద కాలువలు పూర్తిగా తిరుపతి పరిధిలోకి వెళతాయి. ఇక సోమశిల దక్షిణ కాలువ పరిస్థితి. కలువాయి మండల పరిధి మొత్తం తిరుపతిలోకి వెళుతుంది. అంటే.. దక్షిణ కాలువ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు నియంత్రణ వ్యవస్థలు మొత్తం అటువైపే ఉంటాయి. కండలేరు జలాశయం, వరద కాలువ, ఉప కాలువలు, దక్షిణ కాలువల నీరు నెల్లూరు జిల్లా రైతులకు చేరాలంటే.. ఆ జిల్లా అధికారుల అనుమతి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

కనిష్ఠ స్థాయిల్లో కష్టమే..

జలాలు పుష్కలంగా ఉన్న సమయంలో రైతుల ప్రయోజనాలకు పెద్దగా సమస్య రాకపోవచ్ఛు సోమశిల కనిష్ఠ వరద ప్రవాహం 23 టీఎంసీలు. కండలేరుకు స్థానికంగా అందుబాటులోకి వచ్చే నీరు 3 టీఎంసీలు మాత్రమే. కనిష్ఠ వరద ప్రవాహం నమోదైన సమయంలో శ్రీశైలం జలాలతో ఆ కొరతను పూడ్చుతారు. రెండు జిల్లాల నేపథ్యంలో హక్కుల సమస్య వస్తే.. మొదటి ప్రాధాన్యం తెలుగుగంగ పథకానికే ఉంటుందని, ఈ స్థితి జిల్లాల సాగునీటి వినియోగంలో రైతుల మధ్య అసమానతలు, పోరాటాలకు దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నిక్షేపంగా ఉన్న సాగునీటి పంపిణీ విధానాలు జిల్లాల పునర్విభజన పుణ్యమా అని సమస్యలు ఎదుర్కోనున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాల విభజన తీరు రైతులకు ఆందోళన కలిగిస్తోంది.

సోమశిల జలాశయం.. జిల్లాల విభజన తర్వాతా ఈ జలనిధి నెల్లూరు జిల్లాలోనే ఉంటుంది. మొత్తం ఎనిమిది లక్షల ఎకరాల అవసరాలు తీర్చుతుండగా- అందులో ఇప్పుడు మూడు లక్షల ఎకరాలు శ్రీబాలాజీ జిల్లా పరిధిలోకి పోనుంది. జలాశయం ప్రధాన కట్టడం, నీటి విడుదల నియంత్రణ వ్యవస్థలు జిల్లా పరిధిలోనే ఉంటాయి.

ఇది కండలేరు వరద కాలువ. దీని నుంచే మూడో కి.మీ. ప్రాంతంలో దక్షిణ కాలువ విడిపోతుంది. ఈ రెండు కాలువలు మొత్తం నూతనంగా ఏర్పడనున్న తిరుపతి జిల్లా పరిధిలోకి వెళతాయి. ఈ పరిస్థితుల్లో తాగునీటి సమస్యలు జటిలమవుతాయేమోనన్న మాట వ్యక్తమవుతోంది.

ఈ చిత్రంలోనిది కండలేరు జలాశయం.. మొత్తం తిరుపతి నియోజకవర్గం పరిధిలోకి వెళుతుండగా- అభివృద్ధి చెందాల్సిన పలు కాలువలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ప్రతి సమస్యకు తిరుపతి వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమోనన్నది రైతుల ఆందోళన.

‘సోమశిల సామర్థ్యం 78 టీఎంసీలు, కండలేరు జలాశయం సామర్థ్యం 68 టీఎంసీలు. వరదల కాలంలో ఈ రెండింటికి నీటి పంపిణీ ఇప్పటి వరకు సమన్వయంతో సాగేది. ఒకే జిల్లా పరిధిలో ఉండటంతో ఇప్పటి వరకు సమస్య ఉత్పన్నం కాలేదు. పరిధి మార్పు నేపథ్యంలో నాయకులు ప్రభావం చూపితే.. నీటి నిర్వహణ తీరు మారడం సహజమే. అదే నెలకొంటే.. తాము సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.’

భవిష్యత్తులో సమస్యలు - రాపూరు సుందరరామిరెడ్డి, సోమశిల ప్రాజెక్టు కమిటీ మాజీ అధ్యక్షుడు

సోమశిల జలాశయం దక్షిణ కాలువ పరిధిలోని కలువాయి మండలం తిరుపతి జిల్లా పరిధిలోకి వెళ్లడం ఇబ్బందే. దీని ద్వారా సాగునీటి పంపిణీలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కండలేరు జలాశయం పరిధిలోని జిల్లా రైతులకూ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని