logo

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం..!

ఎల్‌ఏ సాగరం రెవెన్యూ ఆబ్కారీ శాఖ కార్యాలయం సమీపంలో సర్వే నెంబర్‌ 65లో 0.90 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించి విక్రయించేశారు. స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఆబ్కారీ శాఖకు 20 సెంట్లు మేర అప్పగించగా సుమారు

Published : 28 Jan 2022 01:17 IST

స్థిరాస్తి వెంచర్లలోని వాటిని తేల్చని పురపాలక అధికారులు

నాయుడుపేట వద్ద ప్రభుత్వ స్థలంలో ఆగిన నిర్మాణం

 

ఎల్‌ఏ సాగరం రెవెన్యూ ఆబ్కారీ శాఖ కార్యాలయం సమీపంలో సర్వే నెంబర్‌ 65లో 0.90 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించి విక్రయించేశారు. స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఆబ్కారీ శాఖకు 20 సెంట్లు మేర అప్పగించగా సుమారు రూ.8.40 కోట్ల విలువైన మిగిలిన స్థలం అన్యాక్రాంతమైనా పట్టించుకునే వారు లేరు. ఇదే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి పూనుకున్న ఓ వ్యక్తిని అడ్డుకోగా అనంతరం దాని జోలికి వెళ్లలేదు.

నాయుడుపేట పురపాలక ఎల్‌ఏ సాగరం గ్రామంలో సర్వే నెంబర్‌ 8లోని సబ్‌ డివిజన్‌లో 15 ఏళ్ల క్రితం 8 ఎకరాల్లో వెంచర్‌ వేశారు. అందులో 10 శాతం అంటే 0.80 ఎకరాలు భూమిని పంచాయతీకి అప్పగించారు. ఇదంతా వ్యాపారులు మ్యాప్‌ ద్వారా గుర్తించి ఇక్కడ కొనుగోలుదారులకు చెప్పిన మాటలు.. ఆ భూమిని పంచాయతీ స్వాధీనం చేసుకుని వ్యాపారి దగ్గర రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంది. ఇదంతా పట్టకపోవడంతో సదరు వెంచర్‌ ఏర్పాటు చేసిన కొందరు ఈ భూమిని తనదిగా విక్రయించాలని చూస్తున్నారు. దీని విలువ సుమారు రూ.7.20 కోట్లు కాగా దీనిని ఇప్పటికీ స్వాధీన చర్యలు చేపట్టలేదు.

న్యూస్‌టుడే, నాయుడుపేట గ్రామీణం : ఇలా పలు చోట్ల ప్రభుత్వ భూముల అన్యాక్రాంతమవుతున్నా పురపాలక, స్థానిక అధికారులు పట్టించుకోవడంలేదు. వెంచర్లలో వదలిన 10 శాతం జాగాను స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయి. సదరు ఆస్తులు వ్యాపారులే విక్రయించేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. ఇలా ఇప్పటికే నాయుడుపేట పట్టణంలో కొన్ని స్థలాలు మాయం కాగా తాజాగా బీఎమ్‌ఆర్‌ నగర్‌ ఆనుకుని ఉన్న రూ.7.20 కోట్ల విలువైన స్థలంపై కన్నేశారు. పట్టణానికి చెందిన ఓ నాయకుడి సహకారంతో ఓ వ్యక్తి దీనిని కాజేసేందుకు యత్నిస్తున్నారు. స్థానికులు దీనిపై ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నాయుడుపేట కూడలి ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. పురపాలక సంఘంగా ఆవిర్భవించిన తరువాత భూములు విలువ ఆమాంతం పెరిగింది. ఇదంతా గమనిస్తున్న స్థిరాస్తి వ్యాపారులు ఎక్కడ ప్రభుత్వ భూములున్నాయో గుర్తించి వాటిని వారి భూముల్లో కలిపి విక్రయించేశారు. కొందరు వెంచర్లు వేసి భూములు కాజేశారు. వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉన్నా అధికారులు మీనమేషాలు వేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి చొరవతో కొన్ని భూముల వివరాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. వాటిల్లో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారు. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు మిన్నకుండటంతో స్థిరాస్తి వ్యాపారులు చెలరేగిపోతున్నారు.

రూ. 100 కోట్ల భూములకు వివరాలేవీ..

పట్టణంలో అటు ఎల్‌ఏ సాగరం, ఇటు విన్నమాల రెవెన్యూ పరిధిలో వాగులు, గుంట పోరంబోకులు, కాలువలు, అనాధీనం భూములు ఉండగా క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. పట్టణంలో తమ ఆస్తులు గుర్తించడంలో అధికారులు తీరక లేకుండా ఉన్నారు. ప్రభుత్వ భవనాలు, ఇతర సామాజిక కార్యక్రమాల భవనాలకు స్థలాల కొరత ఉంది. ఈ రెండు రెవెన్యూ ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములు పెత్తందారుల ఆధీనంలో ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఆక్రమించి కట్టడాలు చేపట్టారు. ఉన్నతాధికారులు చొరవ చూపి ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సి ఉంది. ఆక్రమిత భూముల విలువ సుమారు రూ.100 కోట్ల దాకా ఉంటుందని అంచనా.

ఇప్పటికే కొన్ని స్వాధీనం చేసుకున్నాం : చంద్రశేఖర్‌రెడ్డి, కమిషనర్‌, నాయుడుపేట

పట్టణంలోని ప్రభుత్వ భూములు కోసం సర్వే చేస్తున్నాం. గుర్తించిన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుని వాటిల్లో ప్రయోజన కార్యక్రమాలు చేపడుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని