logo

బుడంగుంటలో భూ దందా

కావలి పురపాలిక పరిధిలోని శివారు ప్రాంతం బుడంగుంటకు స్పందన వినతుల విచారణలో భాగంగా వెళ్లిన కావలి ఆర్డీవో వి.కె.శీనానాయక్‌, తహసీల్దారు మాధవరెడ్డి అవాక్కయ్యారు. అక్కడి భూములను సొంత జాగీరుగా పంచేసుకోగా- విచారణ సందర్భంగా ఆర్డీవోకు స్థానికుల నుంచి వచ్చిన ఫి

Published : 20 May 2022 01:44 IST

 

కావలి, న్యూస్‌టుడే: కావలి పురపాలిక పరిధిలోని శివారు ప్రాంతం బుడంగుంటకు స్పందన వినతుల విచారణలో భాగంగా వెళ్లిన కావలి ఆర్డీవో వి.కె.శీనానాయక్‌, తహసీల్దారు మాధవరెడ్డి అవాక్కయ్యారు. అక్కడి భూములను సొంత జాగీరుగా పంచేసుకోగా- విచారణ సందర్భంగా ఆర్డీవోకు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులు అనేకం.. ఆరా తీస్తుంటే రెవెన్యూశాఖకు చెందిన వారే ఉండటం.. కుటుంబ సభ్యుల పేరిట వారే అక్రమాలకు పాల్పడటం తేటతెల్లమైంది. విచారణతో ఎక్కడ పట్టుబడతామోనని.. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ వీఆర్వో ఆకస్మిక సెలవుపై వెళ్లడం పరిస్థితికి అద్దం పట్టింది. దీంతో ఈ అక్రమాల తంతును తేల్చేందుకు అయిదుగురు వీఆర్వోలతో ఓ విచారణ బృందాన్ని నియమించారు.

ఇలా వెలుగులోకి... ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సినవారే వాటిపై కన్నేశారు. కావలి పురపాలిక పరిధిలో జాగాల కబళింపే ధ్యేయంగా సాగుతున్నారు. ఆపై ఏకంగా ఆక్రమిత స్థలాలను చట్టబద్ధంగా సొంతం చేసుకోవాలనే పన్నాగంతో పెట్రేగిపోతున్నారు. వీరి ఆగడాలపై కలెక్టరేట్‌లో జరిగే స్పందనకు ఫిర్యాదులు, వినతులు వెల్లువెత్తాయి. మండల, డివిజన్‌ స్థాయిలో కాకుండా.. బాధితులు కలెక్టరేట్‌ వరకు వ్యయప్రయాసలకు ఓర్చి వెళుతుండంతో విస్తుబోయారు. తీరా చూస్తే.. ఓ పెద్ద భూ కుంభకోణం వెలుగు చూస్తోంది.

అడ్డగోలుగా... రెవెన్యూ రికార్డులు చేతుల్లో పెట్టుకుని ట్యాంపరింగ్‌ చేయడం.. కార్యాలయంలో ఉన్న రికార్డులు తారుమారు చేయకున్నా.. పాత తహసీల్దార్ల సంతకాలతో ఫోర్జరీ చేసి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం.. వాటి ఆధారంగా కోర్టుల్లో కేసులు వేసి.. బాధితులను ఉక్కిరిబిక్కిరి చేసి.. అందిన కాడికి రాబట్టుకోవడం ఇక్కడ కొందరికి పరిపాటిగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో పోరంబోకుగా ఉండి.. ఎవరికీ కేటాయించని జాగాలను ఎంచక్కా క్షేత్ర స్థాయిలో చేతులు మారడం నిత్యకృత్యమైంది. సర్కారీ జాగా కనిపిస్తే కబళించి.. ధ్రువీకరణలు తెచ్చుకోవడం సాధారణమైంది. ప్రస్తుత విచారణతో అయినా ఇలాంటి అవకతవకలకు అడ్డుకట్ట పడాలన్న ఆకాంక్ష ప్రజల్లో వ్యక్తమవుతోంది.

స్పందన వినతులతో... - వి.కె.శీనానాయక్‌, కావలి ఆర్డీవో

కొంత మంది మహిళలు వరసగా మూడు వారాల పాటు కలెక్టరేట్‌లో జరిగే స్పందనలో వినతులు అందించారు. స్థానికంగా తమ వద్దకు రాకుండా నేరుగా జిల్లా కేంద్రానికి వెళ్లడం ఏమిటా అనిపించింది. విచారణ చేపడితే.. దొంగ పట్టాల వ్యవహారాలు, పాత తహసీల్దార్ల సంతకాలతో అక్రమాలకు పాల్పడటంతో పాటు అనే విషయాలు వెలుగు చూశాయి. ఆ ముఠా ఆగడాలు నిలువరిస్తాం. బుడంగుంటలో ఖాళీ ప్లాట్లన్నీ స్వాధీనం చేసుకున్నాం. వాటిలో ఎవరూ అడుగుపెట్టరాదు.. విచారణ పూర్తయ్యే వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని