logo

పరిశ్రమిస్తేనే..పురోగతి !

పునర్విభజనతో జిల్లా పారిశ్రామికంగా నష్టపోయింది. ఇప్పటికే అభివృద్ధి చెందిన నాయుడుపేట, గూడూరు, తడ తదితరాలు తిరుపతి జిల్లాలో విలీనం కావడంతో అత్యధిక పరిశ్రమలు అటువైపు వెళ్లిపోయాయి. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టుతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఆయిల్‌ పరిశ్రమలు, థర్మల్‌ ప్లాంట్లు మినహా పెద్ద

Published : 20 May 2022 01:44 IST

ఏళ్లుగా ఊరిస్తున్న ప్రాజెక్టులకు కలగని మోక్షం

మిథానీ కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న

కలెక్టర్‌, సంస్థ ప్రతినిధులు(పాత చిత్రం)

పునర్విభజనతో జిల్లా పారిశ్రామికంగా నష్టపోయింది. ఇప్పటికే అభివృద్ధి చెందిన నాయుడుపేట, గూడూరు, తడ తదితరాలు తిరుపతి జిల్లాలో విలీనం కావడంతో అత్యధిక పరిశ్రమలు అటువైపు వెళ్లిపోయాయి. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టుతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఆయిల్‌ పరిశ్రమలు, థర్మల్‌ ప్లాంట్లు మినహా పెద్దగా చెప్పుకోదగ్గవి లేవు. రామాయపట్నం పోర్టు నిర్మించే ప్రాంతం జిల్లాలో కలవడంతో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా మార్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఇప్పటికే ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తేనే నిర్దేశిత లక్ష్యం వీలైనంత త్వరగా సాకారమవుతుంది.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు : జిల్లాలో మొత్తం 29 భారీ పరిశ్రమలు ఉన్నాయి. రూ. 2,261 కోట్లతో ఏర్పాటైన వీటిలో సుమారు 4,964 మంది, వీటితో పాటు రూ. 29,682 కోట్లతో ఏర్పాటు చేసిన మెగా పరిశ్రమల్లో 13,750 మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. కొత్తగా 9 మెగా, భారీ ప్రాజెక్టులు, మరో 206 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వీటిలో మిథాని, క్రిబ్‌కో వంటివి ఉండగా.. ఏళ్లుగా అడుగులు ముందుకు పడకపోవడం నిరాశ కలిగిస్తోంది. కొడవలూరు మండలం బొడ్డువారిపాళెంలో నాల్కో, మిథానీ సంయుక్త సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్‌ ఆధ్వర్యంలో అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటుకు 2015లోనే చర్యలు చేపట్టారు. రూ. 6వేల కోట్లతో 110 ఎకరాల్లో ఏర్పాటు చేయాల్సిన దీనిపై ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్పష్టత లేదు. ఇది ఏర్పాటైతే.. 2వేల మందికి ప్రత్యక్షంగా, పది వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు వెంకటాచలం మండలం సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న క్రిబ్‌కో ఎరువుల కర్మాగారానికి 2017లో 289.81 ఎకరాలు కేటాయించారు. రూ. రెండు వేల కోట్లతో నెలకొల్ఫి. రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. దీని సంగతి అంతే.. తాజాగా క్రిబ్‌కో ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో.. ఈ సారైనా ప్రారంభిస్తారన్న ఆశాభావం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

మౌలిక వసతులు కల్పిస్తేనే...

జిల్లాలో మొత్తం 11 పారిశ్రామిక వాడలు సిద్ధంగా ఉండగా- 2,42,15,619 చ.కి.మీల విస్తీర్ణంలో సుమారుగా 1637 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. నెల్లూరు నగరంలోని ఆటోనగర్‌లో మొత్తం 691 ప్లాట్లు ఉండగా- వాటిలో 54 మోటారు రంగానికి చెందిన పరికరాలు, విడిభాగాల యూనిట్లు ఏర్పాటు చేశారు. అనంతవరం, పంటపాళెం, రామదాసు కండ్రిక, కృష్ణపట్నం ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్‌ పార్కుల్లో బల్క్‌ పరిశ్రమల ఏర్పాటుకు ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన స్థల సేకరణ పూర్తయినా.. అందులో మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఇప్పటికిప్పుడు పరిశ్రమల ఏర్పాటుకు ఎవరైనా ముందుకొచ్చినా.. బొడ్డువారిపాళెం, కె.కె.గుంటలో మినహా.. మిగతా వాటిలో తగ్గ సౌకర్యాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న ఇండస్ట్రియల్‌ పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

ఔత్సాహికులు ముందుకు రావాలి - కె.వి.ఎన్‌.చక్రధర్‌బాబు, కలెక్టర్‌

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అపార వనరులున్నాయి. ప్రస్తుతమున్న 11 ఇండస్ట్రియల్‌ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాం. బొడ్డువారిపాళెంలో మిథానీ పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతానికి సమీపంలో ఎంఎస్‌ఎంసీ పార్కు ఉంది. దాదాపు 187 ప్లాట్లు ప్రాజెక్టులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్ఛు ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు అందుతాయి. అక్కడున్న ప్లాట్ల ధరలు గతంలో కంటే కాస్త తక్కువకే అందుబాటులో ఉన్నాయి. ఫుడ్‌ప్రొసెసింగ్‌, సర్వీస్‌ సెక్టార్‌ పరిశ్రమలకు భవిష్యత్తు ఉంది.

కనెక్టివిటీ! 

విమానాశ్రయం తిరుపతి, చెన్నై 

పోర్టు కృష్ణపట్నం

రహదారులు 6508.35 కి.మీ

జాతీయ రహదారులు 281.02 కి.మీ

రాష్ట్ర రహదారులు 647.80 కి.మీ

ప్రధాన జిల్లా రోడ్డు 1269.80 కి.మీ

రైల్వే లైను 117 కి.మీ

జిల్లా జనాభా (2011 లెక్కల ప్రకారం) 24.69 లక్షలు

పనిచేసే వారి సంఖ్య 9.15 లక్షలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని