logo

నిధులున్నా.. నిస్తేజం!

‘నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం కొండ్లపూడి గ్రామంలో చిన్నపాటి గుంతలకు ప్యాచ్‌ పనులు చేయించాలన్నా.. బిల్లులు సకాలంలో రావంటూ గుత్తేదారులు ముందుకు రాని పరిస్థితి. బోర్ల మరమ్మతులకూ అదే దుస్థితి. స్థానిక పంచాయతీల్లో ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలించడం లేదు.ఇక కావలి మండలం చెంచుగానిపాళెంలో బోర్లు

Published : 20 May 2022 01:44 IST

ఆగిన బిల్లులతో కదలని పనులు

విడవలూరు పరిధిలో గోతులు తేలిన మట్టిరోడ్డు

 

‘నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం కొండ్లపూడి గ్రామంలో చిన్నపాటి గుంతలకు ప్యాచ్‌ పనులు చేయించాలన్నా.. బిల్లులు సకాలంలో రావంటూ గుత్తేదారులు ముందుకు రాని పరిస్థితి. బోర్ల మరమ్మతులకూ అదే దుస్థితి. స్థానిక పంచాయతీల్లో ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలించడం లేదు.ఇక కావలి మండలం చెంచుగానిపాళెంలో బోర్లు పనిచేయకున్నా.. నిధులు లేక పరిష్కరించేవారు కరవయ్యారు.’

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే : ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన(పీఎంజీఎస్‌వై)కు జిల్లా ఎంపికైందని సంతోషించారు. ఎస్సీ జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో ఈ పథకం ద్వారా కొద్దిపాటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చని భావించారు. ఎస్సీ జనాభా అధికంగా ఉన్న 72 గ్రామాలను మొదటి విడత గుర్తించి.. అక్కడి సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు పంపగా- దాదాపు రూ. 14కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధుల్లో ఒక్కో గ్రామానికి రూ. 20 లక్షల చొప్పున కేటాయించారు.

ఆశ: ప్రతిపాదిత గ్రామాల్లో.. పంచాయతీ పాలకవర్గాల ఆధ్వర్యంలో 380 పనులు మంజూరు చేశారు. రూ. అయిదు లక్షల్లోపు వాటిని నామినేషన్‌ పద్ధతిలో చేపట్టారు. పంచాయతీరాజ్‌ లెక్కల ప్రకారం.. వాటిలో 116 పూర్తి చేశారు. మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో స్థానిక సర్పంచులు అప్పోసప్పో చేసి.. రూ. 3.99 కోట్ల విలువైన పనులు చేయించారు. చిన్నపాటి పనులే కదా! బిల్లులు త్వరగా వస్తాయని భావించారు.

నిరాశ: పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులు జడ్పీ నుంచి కంప్యూటర్‌ ద్వారా అప్‌లోడ్‌ అయినా.. సీఎఫ్‌ఎంఎస్‌లోకి వెళ్లడంతో.. అసలు బిల్లులు కంప్యూటర్‌లో కనిపించడం లేదని అధికారలు చేతులెత్తేశారు. ఇటీవల జడ్పీ సమావేశంలో ఈ విషయమై జడ్పీటీసీ సభ్యులు పంచాయతీరాజ్‌ అధికారులను నిలదీసినా ఫలితం లేకపోయింది. తమకొచ్చిన ప్రతి బిల్లును వెంటనే పరిశీలించి.. రాష్ట్ర ఆర్థిక అధికారులకు పంపించామని.. తమ పాత్ర అంతటితో పూర్తయిందని స్పష్టం చేశారు. మరోవైపు మంజూరైన నిధులున్నా.. బిల్లులు సకాలంలో రాని నేపథ్యంలో.. మిగిలిన పనులను చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. గుర్తించిన పలు సమస్యలు అలాగే వెక్కిరిస్తూ.. ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.

 

చిన్న చిన్న సమస్యలు.. చికాకు పెడుతున్నాయి. దళితవాడల్లో మోటార్లు, రోడ్లు, బోర్ల మరమ్మతులూ కరవై ప్రజలు అవస్థలు పడుతున్న పరిస్థితి. అలాగని నిధులు లేవా అంటే.. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద మంజూరైన రూ. 14కోట్లు మూలుగుతున్నాయి. చిక్కల్లా.. ఇప్పటికే ఈ పథకం కింద చేపట్టిన 116 పనులకు సంబంధించిన రూ. 3.99 కోట్ల బిల్లులు అతీగతీ లేకపోవడమే. దీంతో నిధులున్నా.. బిల్లులు రావన్న ఉద్దేశంతో ఆయా పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.

లేఖరాశాం.. బిల్లులొస్తాయి.. - వాణి, జడ్పీ ఇన్‌ఛార్జి సీఈవో

 

ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనలో భాగంగా చేసిన పనులకు సంబంధించిన రూ. 3.99 కోట్ల బిల్లులు ఆగిన విషయాన్ని జడ్పీటీసీ సభ్యులు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో జిల్లా అధికారులపరంగా ప్రక్రియ అంతా పూర్తి చేశాం. రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు లేఖలు రాశాం. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. తప్పక బిల్లులన్ని వస్తాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని