logo

పొర్లుకట్ట ..పనులు పట్టవే ఎట్టా?

రుతు పవనాల రాకపై వాతావరణశాఖ ప్రకటన రైతుల్లో ఆనందం నింపుతున్నా.. అదే సమయంలో గతం మిగిల్చిన గాయాలు.. జిల్లాలోని పరిస్థితులు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఓ వైపు సోమశిల రక్షణ కట్టడాల పనుల్లో వేగం పెరగాల్సిన అవసరం ఉండగా- మరోవైపు జలవనరుల శాఖ పర్యవేక్షణలో రూ. 17కోట్ల విలువైన పొర్లుకట్ట మరమ్మతుల తీరు

Published : 22 May 2022 03:32 IST
నాణ్యత తీరుపై తీవ్ర అభ్యంతరాలు

రుతు పవనాల రాకపై వాతావరణశాఖ ప్రకటన రైతుల్లో ఆనందం నింపుతున్నా.. అదే సమయంలో గతం మిగిల్చిన గాయాలు.. జిల్లాలోని పరిస్థితులు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఓ వైపు సోమశిల రక్షణ కట్టడాల పనుల్లో వేగం పెరగాల్సిన అవసరం ఉండగా- మరోవైపు జలవనరుల శాఖ పర్యవేక్షణలో రూ. 17కోట్ల విలువైన పొర్లుకట్ట మరమ్మతుల తీరు వారిని ఆలోచనలో పడేస్తున్నాయి. పనులు జరుగుతున్న కొన్ని ప్రాంతాల్లో నాణ్యత తీరుపై రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు దృష్టి సారించడంతో పాటు పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉంది. - న్యూస్‌టుడే, ఆత్మకూరు

జిల్లాలో పెన్నానది 110 కి.మీ. ప్రవహిస్తుండగా- సోమశిల నుంచి సముద్రం వరకు ఇరువైపులా ఉన్న మండలాల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో బ్రిటీష్‌ కాలంలోనే పొర్లుకట్టలు నిర్మించారు. క్రమేపీ వాటిని ధ్వంసం చేశారు. కొందరు సమీప పొలాల్లో కలుపుకోగా.. మరికొందరు ఇసుక అక్రమ తరలింపునకు నాశనం చేశారు. గత వరదలకు సోమశిల నుంచి 5.5 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా- పొర్లుకట్టలకు గండ్లు పడ్డాయి. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద నష్టాల పరిశీలనకు వచ్చిన సీఎం.. రూ. 120 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వరద మరమ్మతుల పేరుతో పనులు చేపడుతున్నారు.

అనంతసాగరం మండలం కచేరిదేవరాయపల్లి వద్ద గత వరదలకు పొర్లుకట్టలు దెబ్బతినగా- మరమ్మతులకు వినియోగిస్తున్న మట్టి ఇది. సమీపంలోని చౌడుమట్టిని పనుల్లో వినియోగిస్తున్నారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో పొరలా ఎర్ర మరం తోలి చక్కగా ఉందనిపించారు.

ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెంలో నిర్మిస్తున్న పొర్లుకట్ట ఇది. ఈ పనుల నాణ్యతపై రైతులు అభ్యంతరం తెలిపారు. అయినా.. మార్పు రాకపోవడంతో అడ్డుకున్నారు. సమీపంలోని ఇసుక మట్టిని వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు మాత్రం అది చెరువు మట్టి అంటున్నా.. నీరు ఉన్న కారణంగా చెరువులో అసలు మట్టి తీయలేని పరిస్థితి నెలకొని ఉండటం గమనార్హం.

ఇసుక తరలింపు ట్రాక్టర్లు, లారీలు వెళ్లేందుకు వీలుగా విడవలూరు మండలం ముదివర్తి వద్ద గుత్తేదారుడు పొర్లుకట్టకు గండికొట్టడంతో రైతులు ఆందోళన చేపట్టిన దృశ్యమిది. ఇక్కడ కట్ట పూర్తిగా ఛిద్రమైంది. అయినా అధికారులు పట్టించుకోలేదు. మరమ్మతులకు నిధులు మంజూరైనా.. ఇంకా పనులు చేపట్టలేదు.

వెంగంనాయుడుపల్లి సమీపంలోని పొర్లుకట్ట ఇది. దీనికి ఓ వైపు రేవూరు, మరోవైపు మినగల్లు ఏటికాలువలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యనున్న పొర్లుకట్ట స్థలాన్ని పొలంగా మార్చాలని కొందరు తవ్వి పూర్తిగా చదువు చేస్తున్నారు. అధికారులు అటువైపు చూసింది లేదు.

నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం

పొర్లుకట్టల పనులు పటిష్ఠంగానే చేస్తున్నారు. చెరువు మట్టిని తోలుతున్నారు. ఈ విషయంలో రైతులు అపోహ పడుతున్నారు. నేను వెళ్లి ముదివర్తిపాళెం పనులు పరిశీలించాను. పటిష్ఠంగానే చేస్తున్నారు. నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. - కృష్ణమోహన్‌, జలవనరులశాఖ ఎస్‌ఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని