logo

నీరింకని కళ్ళు

‘కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించండి. అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరగా పరిహారం చెల్లించండని ప్రతిసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పాలా? ఇప్పటికీ పదిసార్లు చెప్పాం. పలుమార్లు ఉత్తర్వులు ఇచ్చాం. అయినా చెల్లించలేదు. కాబట్టే సీఎస్‌ను మా ముందు హాజరుకావాలన్నాం. ఇలాంటి వ్యవహారాల్లో సున్నితంగా వ్యవహ

Published : 22 May 2022 03:32 IST

సాయం కోసం కొవిడ్‌ బాధితుల నిరీక్షణ

దరఖాస్తుదారుల్లో సగం మందికే లబ్ధి

‘కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించండి. అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరగా పరిహారం చెల్లించండని ప్రతిసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పాలా? ఇప్పటికీ పదిసార్లు చెప్పాం. పలుమార్లు ఉత్తర్వులు ఇచ్చాం. అయినా చెల్లించలేదు. కాబట్టే సీఎస్‌ను మా ముందు హాజరుకావాలన్నాం. ఇలాంటి వ్యవహారాల్లో సున్నితంగా వ్యవహరించలేరా? - ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఊహించని విపత్తుతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంటి పెద్దలు, చేతికందొచ్చిన కుమారులు చనిపోవడంతో ఎందరో దిక్కులేనివారుగా మారారు. చివరి నిమిషాల్లో తమవారిని కాపాడుకునేందుకు చేసిన ఖర్చుతో... అప్పుల్లో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం.. ఉదాశీన వైఖరి కొవిడ్‌ చేసిన గాయం కంటే ఎక్కువగా బాధిస్తోందని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. ప్రభుత్వ పరిహారంతో కాస్తయినా ఉపశమనం లభిస్తుందని ఆశగా ఎదరు చూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. దాదాపు నాలుగు నెలలుగా ఒక్కరికీ నగదు జమకాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.


కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద దరఖాస్తులు సమర్పించేందుకు

బారులు తీరిన బాధితులు (పాత చిత్రం)

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు : జిల్లాలో వందల సంఖ్యలో బాధితులు ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తుండగా- వారిలో కొందరి పేర్లు ప్రభుత్వ జాబితాలో నమోదు కాలేదు. దీంతో పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం.. పాత నెల్లూరు జిల్లాలో 1,65,986 మందికిపైగా కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో 1,170 మంది మృతి చెందారు. కాగా, వాస్తవ పరిస్థితులకు, అధికారుల లెక్కలకు ఎక్కడా పొంత ఉండటం లేదు. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో వందల సంఖ్యలో మరణాలు సంభవించినా.. నివేదికలో మాత్రం 20 కంటే ఎక్కువ కాలేదు. దాన్ని నిజం చేస్తూ.. జిల్లాలో 3,150 మంది కొవిడ్‌ మృతుల పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సుప్రింకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీరిలో 95 శాతం మందికి పైగా అర్హులని అధికారులు గుర్తించారు. కానీ, ప్రభుత్వ లెక్కల్లో ఉన్న వారికే తొలుత పరిహారం ఇవ్వడంతో మిగిలిన కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఎదురుచూపులు.. దరఖాస్తుల స్వీకరణకు తొలుత కలెక్టరేట్‌లో ఏర్పాట్లు చేశారు. అనంతరం దాన్ని జీజీహెచ్‌కు మార్చారు. జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. పత్రాలు సరిగా లేవని కొర్రీలు పెట్టినా.. ఓపిగ్గా తిరిగారు. తొలుత కొంత మందికే పరిహారం అందగా.. మిగిలిన వారు వచ్చి అధికారులను సంప్రదించారు. ఆధార్‌ లింకు కాలేదని, దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయని, ధ్రువీకరణ పత్రం అందలేదనే సాకుతో కాలం వెల్లదీశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను మార్చింది. ధ్రువీకరణ పత్రం లేకున్నా కొవిడ్‌ సమయంలో అకస్మాత్తుగా కాలం చేసిన వారివి కరోనా మరణాలుగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో జిల్లాలో 3,150 మంది అర్హులయ్యారు. ఈ ప్రహసనం పూర్తికావడానికి 5 నెలలు పట్టింది. వీరిలో 1,278 మంది ఇంకా ఎదురు చూస్తుండగా.. జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నిధులు జమ కాలేదు. బాధితులకు ఇచ్చిన నిధులు ఇతర అవసరాలకు వినియోగించడం వల్లే.. ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

అర్హులందరికీ అందిస్తాం.. - పెంచలయ్య, డీఎంహెచ్‌వో

కొవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్ఛు అర్హులైన వారందరికీ ప్రభుత్వం తరఫున రూ. 50వేలు అందుతాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల జాబితాను ఉన్నతాధికారుల దృష్టిలో ఉంచాం. నిధులు రాగానే అందజేస్తాం.

కొవిడ్‌ పరీక్షలు 22,88,877

పాజిటివ్‌ కేసులు 1,65,986

పాజిటివ్‌ రేటు 7.17 శాతం

మొత్తం మరణాలు 1170 (అధికారికం) 

వచ్చిన దరఖాస్తులు 3,150

పరిహారం అందింది 1,866

తిరస్కరించి నవి 8

ఎదురు చూస్తున్నది 1,278

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని