logo

ప్రభుత్వ స్థలం... సర్కారుకే అద్దెకు

పెన్నా పొర్లుకట్టలు... ఆర్‌అండ్‌బి రోడ్డు మధ్యలో ఉన్న ప్రభుత్వ స్థలంపై అధికార పార్టీ నాయకుడి కన్నుపడింది. అనుకున్నదే తడవుగా గదుల నిర్మాణం చేపట్టారు. ఏకంగా ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణానికి అద్దెకిచ్ఛి.. ప్రతి నెలా నగదు వసూలు చేస్తున్నాడు. అధికార పార్టీ నాయకుడు

Published : 22 May 2022 03:32 IST

అక్రమ నిర్మాణాలతో రూ.7.20 లక్షల వసూళ్లు

ప్రభుత్వ స్థలంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణం

పెన్నా పొర్లుకట్టలు... ఆర్‌అండ్‌బి రోడ్డు మధ్యలో ఉన్న ప్రభుత్వ స్థలంపై అధికార పార్టీ నాయకుడి కన్నుపడింది. అనుకున్నదే తడవుగా గదుల నిర్మాణం చేపట్టారు. ఏకంగా ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణానికి అద్దెకిచ్ఛి.. ప్రతి నెలా నగదు వసూలు చేస్తున్నాడు. అధికార పార్టీ నాయకుడు అక్రమ నిర్మాణం చేపట్టగా.. విషయం తెలిసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు.

న్యూస్‌టుడే, ఇందుకూరుపేట : ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెం గ్రామ పొలిమేర్లలో రోడ్డుకు ఉత్తరం వైపున పెన్నా పొర్లు కట్టలున్నాయి. పంట కాలువ ఉండగా... ఆ పక్కనే ముదివర్తిపాళెం- పల్లెపాడు ప్రధాన రెండు వరుసల ప్రధాన రోడ్డు ఉంది. పంట కాలువకు, ఆర్‌అండ్‌బి రోడ్డుకు మధ్య ప్రభుత్వ స్థలంపై నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడి కన్నుపడింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వ మద్యం దుకాణం నిర్వహించేందుకు గదులు కావాలని అన్వేషిస్తుండగా... సదరు నాయకుడు ఈ స్థలం నాదని గదులు నిర్మించి ఇస్తానని చెప్పాడు. అధికార పార్టీ నాయకుడు కావడంతో అధికారులు అంగీకరించారు. ఒక గదిని మద్యం దుకాణానికి, మరొక గదిని శీతల పానీయాల విక్రయాలకు అద్దెకిచ్చాడు. ఆక్రమణలపై గ్రామస్థులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. మద్యం దుకాణం నిర్వహణకు ఒక గది అద్దెకివ్వగా ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.14 వేలు, శీతల పానియాల దుకాణం నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.24 వేలు వసూలు చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఏకంగా రూ.7.20 లక్షలు అద్దె తీసుకున్నాడు.

అధికారులు ఏమంటున్నారంటే...?

దుకాణం పంటకాలువ, ఆర్‌అండ్‌బి రోడ్డు మధ్యన ఉందని, ఈ స్థలం ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బి శాఖలకు సంబంధించిందని, ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణమని తేలితే గదులను తొలగిస్తామని నీటిపారుదల శాఖ ఏఈ విజయ్‌భాస్కర్‌ రెడ్డి తెలిపారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... విషయం మా దృష్టికి రాలేదని, విచారణ జరిపి ప్రభుత్వస్థలంలో ఉంటే మరొక చోటుకు మారుస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని