logo

గిరిలో గుట్టుగా తవ్వకాలు!

ఉదయగిరి ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు గుట్టుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన వ్యక్తులను, ఆధునాతన యంత్రాలను తీసుకొచ్చి వాటి ద్వారా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Published : 26 May 2022 03:22 IST


తవ్వకాలకు వెళుతూ విద్యుత్తు తీగలు తగిలి మృతిచెందిన కృష్ణయ్య
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు (పాత చిత్రం)

న్యూస్‌టుడే, ఉదయగిరి, దుత్తలూరు ఉదయగిరి ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు గుట్టుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన వ్యక్తులను, ఆధునాతన యంత్రాలను తీసుకొచ్చి వాటి ద్వారా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గుప్త నిధుల కోసం పురాతన ఆలయాల ప్రాంగణాలు, రాజుల కాలంలో నిర్మాణాలు చేసిన చెరువులతోపాటు పురాతన ఆనవాళ్లున్న ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. కరోనా తరువాత స్తబ్బుగా ఉన్న ఈ వ్యవహారం ఇటీవల మళ్లీ జోరందుకుంది. గుప్త నిధుల తవ్వకాలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నా ఆ ముఠా మాత్రం తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఉదయగిరి ప్రాంతంలో పూర్వం అనేక రాజ వంశస్థులతో పాటు నవాబుల పాలనలో ఆలయాలు, మసీదులు, చెరువులు నిర్మించారు. ఐతే ఆలయాలు, మసీదుల్లో అప్పట్లో రాజులు బంగారం దాచి ఉంచి అందుకు గుర్తులను సైతం పెట్టారనే అపోహలతో గుప్త నిధుల ముఠా పురాతన ఆనవాళ్లు ఎక్కడ కనిపించినా గుట్టుగా గుల్ల చేస్తున్నారు. 
ప్రలోభాలకు మోసపోవద్దు : గిరిబాబు, సీఐ ఉదయగిరి
గుప్త నిధుల తవ్వకాలు జరగకుండా నిత్యం సిబ్బందితో పర్యవేక్షిస్తున్నాం. ఇటీవల గుప్త నిధుల తవ్వకాలు కోసం వెళుతూ ఒక వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపాం. వారి వద్ద నుంచి మెటల్‌ డిటెక్టరును స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం గుప్త నిధుల తవ్వకాల తగ్గాయి. కొన్ని ముఠాల ప్రలోభాలకు ఎవరూ మోసపోవద్దు. గుప్త నిధుల తవ్వకాలు జరుగుతున్నట్లు ప్రజలు సమాచారమందిస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాం.

*ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి చెన్నైతో పాటు ఇతర జిల్లాలకు చెందిన ముఠాతో కలిసి పరికరాలతో గుప్త నిధుల తవ్వకాల కోసం సర్వరాబాద్‌ సమీపంలోని అటవీ ప్రాంతానికి రాత్రి వేళల్లో వెళుతూ దారికి అడ్డంగా ఉన్న విద్యుత్తు తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. 
* ఉదయగిరి- బండగానిపల్లి మార్గంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల ఇనుప రాడ్లతో దుర్గం కొండ పరిసర ప్రాంతాల్లోకి వెళుతూ స్థానికులకు కనిపించారు. వారు ఎందుకొచ్చారో తెలియక పల్లె ప్రజలు పోలీసులు, అటవీశాఖాధికారులకు సమాచారమివ్వడంతో వారు గాలిస్తున్నారు. 

కొందరు బృందాలుగా ఏర్పడి... బీ ఉదయగిరి కొండపై ఏదో ఒక వైపు గుప్త నిధుల కోసం కొందరు బృందాలుగా ఏర్పడి రాత్రి సమయాల్లో తవ్వకాలు చేపడుతున్నారు. పలుమార్లు స్థానికులు కొండపై జరుగుతున్న గుప్త నిధుల తవ్వకాల విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.* ఉదయగిరి పట్టణంలోని రంగనాయకులస్వామి ఆలయంలోని గర్భ గుడి ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు గోడలకు రంధ్రాలు వేశారు. * ఉదయగిరి పట్టణంలోని కృష్ణ మందిరంలో పురాతన కల్యాణ వేదిక వద్ద గుప్త నిధుల కోసం యంత్రాలతో పెకలించారు. రాతి స్తంభాలకు రంధ్రాలు వేశారు. * ఉదయగిరి పెద్ద చెరువు అలుగు వద్ద, సీతారామపురం మండలం విఠలేశ్వస్వామి ఆలయం సమీపంలోని స్వామి చెరువు, వరికుంటపాడు మండలం కనియంపాడు చెరువుల వద్ద తవ్వకాలు జరిగాయి. * ఉదయగిరి మండలం గుడినరవలో పురాతన నంది విగ్రహాన్ని కొన్నేళ్ల క్రితం చోరీ చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని