logo

అమ్మ ఒడి.. సంశయాల జడి

ఎప్పటిలా కాదు.. ఈసారి ఎనిమిది అంశాలను ప్రమాణికంగా తీసుకున్నారు అమ్మ ఒడి సాయం అందించేందుకు. రెండేళ్లుగా జనవరిలో ఇచ్చే నిధులు ఈసారి జూన్‌లో ఇస్తామంటోంది ప్రభుత్వం.. మూడు రోజులు ఉంది మేనెల ముగిసేందుకు.. నేటికీ అర్హుల జాబితా అధికారులకు అందలేదు.

Published : 29 May 2022 01:39 IST

డీఈవో, సర్వశిక్షా అభియాన్‌ అధికారులకు అందని జాబితా

తల్లిదండ్రుల్లో ఆవేదన

న్యూస్‌టుడే, నెల్లూరు (విద్య)

తరగతి గదిలో విద్యార్థులు

ఎప్పటిలా కాదు.. ఈసారి ఎనిమిది అంశాలను ప్రమాణికంగా తీసుకున్నారు అమ్మ ఒడి సాయం అందించేందుకు. రెండేళ్లుగా జనవరిలో ఇచ్చే నిధులు ఈసారి జూన్‌లో ఇస్తామంటోంది ప్రభుత్వం.. మూడు రోజులు ఉంది మేనెల ముగిసేందుకు.. నేటికీ అర్హుల జాబితా అధికారులకు అందలేదు. తమ పిల్లల పేర్లు ఉన్నాయా, లేవా అని ఈనెల మొదటి నుంచి డీఈవో, సర్వశిక్షా అభియాన్‌ కార్యాలయాల చుట్టూ తల్లిదండ్రులు ప్రదక్షిణలు చేస్తున్నారు.. నేటికీ ఆ వివరాలు అందక ఆవేదన చెందుతున్నారు. ఇదేమని అధికారులను అడిగితే.. తల్లుల ఖాతాల్లో నేరుగా నిధులు పడతాయంటున్నారు.

 

అమ్మఒడి ప్రారంభించిన మొదటి, రెండో సంవత్సరంలో జనవరిలో విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమయ్యేవి. గతేడాది కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా ఈ పథకం అమలు వాయిదా పడింది. జూన్‌లో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పథకం లబ్ధి పొందాలంటే విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలని నిబంధన విధించింది. రెండేళ్లలో కొవిడ్‌ కారణంగా విద్యాసంస్థలు సక్రమంగా నిర్వహించకపోవడంతో హాజరులో సడలింపునిచ్చింది. ఈసారి దాన్ని పక్కాగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. అర్హులు, అనర్హులను గుర్తింపు ప్రక్రియను గ్రామ, వార్డు వాలంటీర్లు నిర్వహిస్తున్నారు.

విద్యాశాఖాధికారులకే వివరాలు తెలియక..

అమ్మఒడి పథకం ప్రారంభమైన తొలి ఏడాదిలో 2,20,607 మంది, రెండో ఏడాది 2,43,497 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నిధులు జమ అయ్యాయి. ఈ సంవత్సరం జిల్లాలో ఎంత మంది ఖాతాలో జమ కానున్నాయో తెలియడం లేదు. ఈ వివరాలు జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్షా అభియాన్‌ అధికారులకే తెలియకపోవడం గమనార్హం. సంబంధిత శాఖలకు ఈ వివరాలు తెలియకపోతే నిధులెలా జమవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. రెండు రోజులుగా అర్హుల జాబితా వాలంటీర్ల చరవాణిలో కనిపిస్తోంది. ఇప్పటికి రెండుసార్లు అర్హుల జాబితా సమగ్రశిక్షా అభియాన్‌ ద్వారా ప్రకటించగా ఈసారి ఆ శాఖకూ వివరాలు తెలియక పోవడం గమనార్హం. వీటిని తెలుసుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వస్తున్నారు. ఇక్కడ అమ్మఒడి వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో సచివాలయ వాలంటీర్ల వద్దకు వెళుతున్నారు. వారి వద్ద కూడా పూర్తి సమాచారం అందకపోవడంతో నిరాశతో తల్లిదండ్రులు వెనుదిరుగుతున్నారు.

విద్యాశాఖకు వివరాలు రాలేదు

- పి.రమేష్‌, డీఈవో

అమ్మఒడి వివరాలు విద్యాశాఖకు అందలేదు. ప్రభుత్వం అర్హులైన విద్యార్థులకు నేరుగా వారి తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. జూన్‌ మొదటి వారంలో ఇవ్వనుంది.

ఈ అంశాలే కొలమానం..

అమ్మఒడి అర్హులకు సరైన అర్హతలు ఉన్నాయా, లేవా అనే అంశంతో పాటు మరో ఎనిమిది అంశాలను ప్రభుత్వం పరిశీలించనుంది. 75 శాతం హాజరు, 300 యూనిట్లలోపు విద్యుత్తు బిల్లులు, నాలుగు చక్రాల వాహనం, పొలం పరిమితి, తదితర అంశాలున్నాయి. విద్యార్థి, తల్లి ఆధార్‌, జగనన్న విద్యా దీవెన పొందుతున్నారా, మ్యాపింగ్‌ నమోదైందా, లేదా అని పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగించనున్నారు. ఈసారి అమ్మఒడి పథకం కింద రూ.13 వేలు తల్లుల ఖాతాలో జమకానుంది. మిగతా రూ.2 వేలను మరుగుదొడ్ల నిర్వహణ, ‘నాడు- నేడు’ పనుల ద్వారా మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయనున్నారు.

జిల్లాలోని పాఠశాలలు

4,486

1 నుంచి 10వ తరగతి విద్యార్థులు 4,07,078

జూనియర్‌కళాశాలల్లో..

54,987

2019-20లో ఎంపికైనవారు

2,20,607

2020-21లో

2,43,497

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు