logo

రహదారే అడ్డా ఆయిల్ దందా

జాతీయ రహదారిపై ఆయిల్‌ మాఫియా రెచ్చిపోతోంది. పోర్టు నుంచి వచ్చే లారీల్లో అక్రమంగా ఆయిల్‌ను తీసి విక్రయిస్తున్నారు. దీనికి స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు వత్తాసు పలుకుతుండటంతో అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.

Published : 29 May 2022 01:39 IST

ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా రూ.కోట్ల సరకు పక్కదారి

చోద్యం చూస్తున్న పోలీసు యంత్రాంగం

రోజుకు 5 వొేల లీటర్ల నూనె స్వాహా

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: వెంకటాచలం, న్యూస్‌టుడే

మనుబోలు పరిధిలో ట్యాంకరు నుంచి ఆయిల్‌ తీస్తున్న డ్రైవర్లు

జాతీయ రహదారిపై ఆయిల్‌ మాఫియా రెచ్చిపోతోంది. పోర్టు నుంచి వచ్చే లారీల్లో అక్రమంగా ఆయిల్‌ను తీసి విక్రయిస్తున్నారు. దీనికి స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు వత్తాసు పలుకుతుండటంతో అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఒకటి, రెండు కాదు వేల లీటర్ల నూను తస్కరిస్తున్నారు. అనంతరం కల్తీ చేయడంతో పాటు.. ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు.. తమిళనాడు, బెంగళూరులకు తరలిస్తున్నారు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ప్రజాధనాన్ని కాజేయడంతో పాటు.. కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు.

జిల్లాలోని ముత్తుకూరు మండలం పంటపాళెం గ్రామ పరిధిలో దాదాపు 8 ఇడిబుల్‌ ఆయిల్‌ కంపెనీలు ఉన్నాయి. విదేశాల నుంచి నౌకల ద్వారా క్రూడ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకున్న కంపెనీలు రిఫైనరీ చేసి అయిదు రకాలుగా విభజిస్తాయి. అనంతరం వాటిని వ్యాపారుల అవసరాల మేరకు విక్రయిస్తున్నాయి. వీటిని తరలించడానికి దాదాపు 420 ట్యాంకర్లను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇడిబుల్‌ ఆయిల్‌ కంపెనీ నుంచి లోడ్‌ అయ్యి బయటకు వచ్చిన లారీలో సరకు నేరుగా కొనుగోలుదారుకు చేరడం లేదు. కొందరు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు, లారీ డ్రైవర్లు కుమ్మక్కై ట్యాంకర్లో నుంచి నూనెను బయటకు తీసుకున్నారు. ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు ప్రాంతాల్లో రహస్య ప్రాంతాలను ఏర్పాటు చేసుకుని ఈ దందాకు తెర తీస్తున్నారు. ఇదేమిటని అడిగిన స్థానికులపై దాడులకు యత్నిస్తున్నారు. ఇటీవల తమిళనాడుకు చెందిన ఓ బిస్కట్‌ కంపెనీకి చెందిన ప్రతినిధి ఈ విషయంపై ట్యాంకర్ల నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. తమకు రావాల్సిన నూనెను దొంగిలిస్తున్నారని నిలదీశారు. దాంతో స్థానికంగా ఉండే ఓ నాయకుడు మధ్యవర్తిత్వం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ తంతు ఏళ్ల తరబడి జరుగుతున్నా.. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని స్థానికులు వాపోతున్నారు.

నెలకు రూ.1.50 కోట్లకు పైగా దోపిడీ

ఇడిబుల్‌ ఆయిల్‌ కంపెనీల నుంచి రోజుకు దాదాపుగా 100 ట్యాంకర్ల నుంచి నూనెను ట్రేడర్లకు తరలిస్తుంటారు. వీటిలో కంపెనీలు, ఇతర పరిశ్రమలకు దాదాపు లారీలతో తరలిస్తారు. వీటిలో 20 నుంచి 25 లారీల్లోంచి నిత్యం ఆయిల్‌ను కాజేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌లో దాదాపు 23 వేల లీటర్లు నూనెను తరలిస్తారు. సాధారణంగా కంపెనీ నిర్వాహకులు ట్యాంకర్‌కు 60 లీటర్ల నూనెను అదనంగా నింపుతారు. దీన్ని అవకాశంగా తీసుకున్న అక్రమార్కులు ఆ మొత్తంతో పాటు ఒక్కో లారీ నుంచి దాదాపుగా 200 లీటర్ల నూనెను తీస్తున్నారు. అంటే రోజుకు దాదాపుగా రూ.6 లక్షల విలువైన 5 వేల లీటర్ల నూనెను అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నారు. ఈ లెక్కన వారానికి రూ.42 లక్షలు, నెలకు దాదాపు రూ.1.50 కోట్ల విలువైన నూనెను కాజేస్తున్నారు. ఇదంతా ఓ ప్రాంతంలో నిల్వ చేసి.. లారీకి సరిపడా వచ్చాక విక్రయిస్తున్నారు. లేదంటే నెల్లూరు నగరం స్టోన్‌హౌస్‌పేటలోని కొందరు ఆయిల్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారని సమాచారం. దీనిలో బెంగళూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. స్థానికులను పనిలో పెట్టుకుని ఈ దందాను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం - రాజేశ్వర్‌రెడ్డి, ఎస్పీ, విజిలెన్స్‌

కంపెనీల నుంచి వెళ్లే రవాణా లారీల్లో అక్రమంగా నూనెను తీసి విక్రయించడం చట్టవిరుద్ధం. దీనిపై నిఘా ఏర్పాటు చేస్తాం. పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

కొండూరు సత్రం సమీపంలో ఏర్పాటు చేసిన షెడ్‌లో ఉంచిన ఆయిల్‌ క్యాన్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని