Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు.

Updated : 26 Jun 2022 14:58 IST

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకపాటి విక్రమ్‌రెడ్డి తన ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మొత్తంగా 20 రౌండ్లలో లెక్కింపు చేపట్టగా.. ప్రతి రౌండ్‌లోనూ విక్రమ్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు.

ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,13,338 కాగా.. ఈ నెల 23న జరిగిన పోలింగ్‌లో కేవలం 1,37,081 (64 శాతం) మంది ఓటర్లు మాత్రమే ఓటు వేశారు. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగిన విక్రమ్‌ రెడ్డి 15 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 76,096 (పోలైన మొత్తం ఓట్లలో 50 శాతానికిపైగా) ఓట్లు దక్కించుకోవడంతో ఆయన విజయం ఏకపక్షమని తేలిపోయింది. పోస్టల్‌ బ్యాలెట్‌ సహా 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత వైకాపా అభ్యర్థి విక్రమ్‌రెడ్డి 1,02,074 ఓట్లను దక్కించుకున్నారు. తన ప్రత్యర్థి భాజపా అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌పై 82,742 ఓట్ల మెజారిటీతో ఆత్మకూరు ఉప ఎన్నికను విక్రమ్‌రెడ్డి కైవసం చేసుకున్నారు.

20 రౌండ్లలో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు..

* వైకాపా - 1,02,074
* భాజపా - 19,332
* బీఎస్పీ - 4,897
* నోటా - 4,197

పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇలా..

* మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు : 217
* వైకాపా : 167
* భాజపా : 21
* బీఎస్పీ : 7
* ఇతరులు : 10
* తిరస్కరించినవి : 9
* నోటా : 3

2019లో జరిగిన ఆత్మకూరు శాసనసభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకపాటి గౌతమ్‌రెడ్డి 92,758 ఓట్లు దక్కించుకొని ప్రత్యర్థి తెదేపా అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై 22,276 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తాజాగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో 2019లో తన సోదరుడు గౌతమ్‌రెడ్డి సాధించిన ఓట్ల కన్నా 9,316 ఓట్లు అధికంగా సాధించి విజయాన్ని అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని