logo

అమ్మఒడి.. అలజడి!

‘అమ్మఒడి’ ఆశయం మంచిదే అయినా.. నిబంధనల పేరుతో అడ్డగోలుగా లబ్ధిదారుల జాబితాలో కోతలు పెట్టడంతో ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది చేసే కొన్ని పొరపాట్ల కారణంగా అర్హులైన ఎంతో మంది ప్రభుత్వ

Published : 28 Jun 2022 02:13 IST
జిల్లాలో భారీగా తగ్గిన లబ్ధిదారులు
ఈనాడు డిజిటల్‌, నెల్లూరు

‘అమ్మఒడి’ ఆశయం మంచిదే అయినా.. నిబంధనల పేరుతో అడ్డగోలుగా లబ్ధిదారుల జాబితాలో కోతలు పెట్టడంతో ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది చేసే కొన్ని పొరపాట్ల కారణంగా అర్హులైన ఎంతో మంది ప్రభుత్వ సాయాన్ని కోల్పోతున్నారు. కొవిడ్‌తో ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా- పిల్లల చదువుకు ప్రభుత్వం అందించే సాయం రాదని తెలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము అర్హులమే అంటూ.. సంబంధిత పత్రాలతో సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.

జిల్లాలో 4,486 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా- వీటిలో 1 నుంచి 10వ తరగతి వరకు 4.07 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. జూనియర్‌ కళాశాలల్లో 54వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు. గత ఏడాది వీరిలో 2.43 లక్షల మందికి అమ్మఒడి పథకం ద్వారా రూ. 340.80 కోట్ల వరకు అందజేశారు. నిబంధనల పేరుతో కోత పెట్టడంతో.. మొదటి, రెండు విడతల్లో లబ్ధిపొందిన చాలా మంది మూడో విడత సాయానికి దూరమయ్యారు. తాజాగా సోమవారం ప్రభుత్వం తల్లుల ఖతాల్లో డబ్బు జమ చేసింది. ఎన్నికల కోడ్‌ పూర్తయిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమవుతాయి. ఇప్పటికే అర్హులు, అనర్హుల జాబితాలు సచివాలయాలకు రావడంతో.. వాటిని చూసుకున్న లబ్ధిదారులు   లబోదిబోమంటున్నారు.

అనర్హులుగా 43,126 మంది

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి.. ఈ ఏడాది జనవరిలో లబ్ధి ఇవ్వాల్సి ఉంది. ఆరు నెలల తర్వాత సోమవారం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. కొత్త కొత్త నిబంధనల పేరుతో దాదాపు 43,129 మందిని అనర్హులుగా గుర్తించారు. రెండో విడత సాయం అందించినప్పుడు పాఠశాల నిర్వహణ ఖర్చు పేరుతో రూ.వెయ్యి కోత పెట్టి రూ. 14వేలు జమ చేయగా.. ప్రస్తుతం మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో మరో వెయ్యి కోత పెట్టి.. రూ. 13వేలు అందజేశారు. ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. స్కూల్‌ ఫీజులు భారం కాకుండా కాస్త ఉపశమనం కలుగుతుందని భావించిన తల్లులకు నిరాశే మిగిలింది.

అర్హత ఉన్నా..

అర్హత ఉన్నా.. వివిధ కారణాలతో అనర్హులుగా ప్రకటించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో ఉంచిన జాబితా ప్రకారం వివరాలు తెలుసుకుని పత్రాల కోసం పరుగులు తీశారు. సంబంధిత శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకొచ్చి సచివాలయాల్లో అందజేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. సచివాలయాల్లో అప్‌లోడ్‌ చేస్తున్న దరఖాస్తుల వరకు మాత్రమే తమకు తెలుసని, లబ్ధిదారుల ఫిర్యాదులను పరిష్కరించాలంటే ఎవరికి సిఫార్సు చేయాలో అర్థం కావడం లేదని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు.

ఆందోళన వద్దు...: ధనలక్ష్మి, డీపీవో

నిబంధనల ప్రకారం అర్హులైన వారందరికీ ప్రభుత్వం అమ్మఒడి నిధులు ఇవ్వాలని భావిస్తోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. జిల్లాలోని పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాం. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.


మూడు మీటర్లు ఉన్నాయని..

మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. నా భర్త శ్రీనివాసులు చిన్న వ్యాపారం చేస్తుంటారు. అదే మా కుటుంబానికి ఆధారం. మా పాప కృషాలిని అయిదో తరగతి పూర్తి చేసింది. మాకు రెండు విడతలు అమ్మఒడి సాయం అందింది. ఈసారి మీకు మూడు విద్యుత్తు మీటర్లు ఉన్నాయని.. వాటిలో 300 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్తు వినియోగిస్తున్నారంటూ అనర్హులుగా తేల్చారు. మా పేరుపై ఎలాంటి మీటర్లు లేవు.


కారే జీవనాధారం!

పొదలకూరుకు చెందిన పి.సుప్రజ, రాము దంపతులు. వీరి కుమారుడు వెంకట బాలు. ఏడో తరగతి పూర్తి చేసుకుని ఎనిమిదిలో చేరబోతున్నాడు. రాము కారు డ్రైవరుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈయన పేరుతో కారు ఉన్నందున.. ఈ ఏడాది బాలుకు అమ్మఒడి పథకం వర్తించని అధికారులు తేల్చి చెప్పారు. కొవిడ్‌ సమయంలో కిరాయిలు లేకపోవడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము బాబు చదువుకు అక్కరకొస్తుందనుకున్నాం. ఇప్పుడు అది కూడా ఆగిపోవడంతో దిక్కుతోచడం లేదు’ అని సుప్రజ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ చిత్రంలోనిది ఓ సచివాలయం పరిధిలోని అమ్మఒడి అనర్హుల జాబితా. దీని ప్రకారం ఈ జాబితాలో మొత్తం 111 మంది అనర్హులుగా తేల్చారు. వీరిలో 50 మందిని 300 యూనిట్లు, నాలుగు చక్రాల వాహనం, హాజరు తగ్గడం, పట్టణ ప్రాంతంలో 1000 చ.అడుగుల కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు వంటి కారణాలతో, మిగిలిన 61 మందిని విద్యార్థి, తల్లి పేర్లు బియ్యం కార్డులో లేవని తొలగించడం గమనార్హం.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు