Andhra News: అధికార పార్టీ అయినా... నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే తీరే వేరు!

నెల్లూరు నగరంలో అడుగుతీసి అడుగు వేయలేనంతగా గుంతలమయం. మురుగునీటి కాల్వల నిర్వహణ గురించి అడిగితే పట్టించుకునే వారే లేరు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల

Published : 07 Jul 2022 01:23 IST

నెల్లూరు: నెల్లూరు నగరంలో అడుగుతీసి అడుగు వేయలేనంతగా గుంతలమయం.. మురుగునీటి కాల్వల నిర్వహణ గురించి అడిగితే పట్టించుకునే వారే లేరు.. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల గురించి నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు.. ఇవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కాదు. వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదనతో చేసిన వ్యాఖ్యలివి. అధికార పార్టీలో ఉన్నప్పటికీ వివిధ సమస్యలపై కోటంరెడ్డి స్పందిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన వైకాపా జిల్లా ప్లీనరీ సమావేశంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను శత్రువులుగా భావించి కక్ష సాధింపులకు పాల్పడవద్దని సూచించారు.

మురుగు కాల్వలో దిగి నిరసన

రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలో మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం  మురుగు కాల్వలో దిగి కోటంరెడ్డి నిరసన తెలిపారు. రైల్వే, నగర కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షమైనా, అధికార పక్షమైనా సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానన్నారు. తాజాగా ఇవాళ నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయంలోని తిక్కన భవన్‌లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో కోటంరెడ్డి గోడు వెళ్లబోసుకున్నారు. నెల్లూరు రూరల్‌ మండలంలోని వావిలేటపాడు జగనన్న లేఅవుట్‌లో కనీస సౌకర్యాలు కూడా లేవని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. 10 నెలలుగా సమస్యను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కరించడం లేదని వాపోయారు. రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటి మరమ్మతులకు రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిలిచిపోయిన బీసీ భవన్‌, అంబేడ్కర్‌ భవన్‌ల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కోరారు.

బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్‌నారాయణరెడ్డి చెప్పారు. అధికారులు చొరవ తీసుకుని అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. జిల్లాకు అధికారులు ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో తెలియడం లేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులకు అధికారులు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు చేపట్టామని, పంచాయతీ రోడ్ల పనులు త్వరలోనే చేపడతామని మంత్రి కాకాణి వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని