logo
Published : 06 Aug 2022 03:49 IST

నీరుంది..దానికో లెక్కుంది!

జీఈసీ ప్రకారం నీటి నిల్వలు 100.49 టీఎంసీలు

అందులో వినియోగిస్తున్నది 34.39 టీఎంసీలు

మిగిలిన భూగర్భ జలం 66.06 టీఎంసీలు

జిల్లాలో భూగర్భ జలాలపై సర్వే

గుక్కెడు నీటికి సగటు కుటుంబం నెలకు రూ. 300 నుంచి రూ. 500 వరకు వెచ్చిస్తోంది. అంత ఖర్చు చేస్తున్నా.. సహజ సిద్ధ గుణాలు కలిగిన, ఆరోగ్యకర, రుచి కరమైన నీటిని తాగుతున్నామా? అంటే అదీ లేదు. ఈ క్రమంలో వర్షపు నీటిని ఒడిసి పట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కాలక్రమేనా వస్తున్న మార్పులు, లోటు వర్షపాతం.. ఇతరత్రా కారణాలతో పలుచోట్ల భూగర్భ జలాలు అడుగం టిపోతుండగా- వాటిని వృద్ధి చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం 2019లో జల్‌శక్తి అభి యాన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. తాజాగా వర్షపునీటిని ఒడి సిపట్టండి అనే నినాదంతో జల్‌శక్తి అభియాన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. క్యాచ్‌ ద రెయిన్‌ నినాదంతో ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నూతనంగా ఏర్పడిన జిల్లాలో మండలాల వారీగా ఏ మేరకు నీటి నిల్వలు ఉన్నాయి. ఎంత వినియోగం జరుగుతోంద నేది లెక్క తేల్చేందుకు తాజాగా సర్వే చేస్తున్నారు.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు

జిల్లాలోని 38 మండలాల్లో 95 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో నీటి లభ్యతను అంచనా వేస్తున్నారు. గత రెండేళ్లుగా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదలతో నిండిన జలాశయాలతో ఆశావహంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సగటున 1.36 మీటర్ల నుంచి 20 మీటర్లలోపే అన్ని మండలాల్లో నీరు అందుబాటులో ఉండగా- దుత్తలూరు, మనుబోలు, సీతారాంపురం, విడువలూరు, దగదర్తి, ఉదయగిరి, మర్రిపాడు, కొండాపురం కలువాయి మండలాల్లో కాస్త 7 నుంచి 20 మీటర్లలోపు దిగువకు వెళ్లినట్లు గుర్తించారు. గత ఏడాది జులైతో పోల్చితే.. జిల్లా సగటు నీటి లభ్యత 5.43 మీటర్లు ఉంది. ప్రస్తుతం జిల్లాలో 100.49 మేర నీటి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అందులో 34.39 టీఎంసీల వినియోగం జరుగుతున్నట్లు భూగర్భ జలశాఖ డీడీ శోభన్‌బాబు తెలిపారు.

ప్రత్యేక ప్రణాళిక
వర్షపునీరు వృథా కాకుండా.. భూగర్భంలోకి ఇంకించేందుకు డ్వామా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. సాధారణంగా గంటసేపు కురిసే వర్షపాతంలో కేవలం 10 శాతం మాత్రమే భూమిలోకి ఇంకుతోందని నిపుణులు చెబుతున్నారు. 40 శాతం నీరు ప్రవాహం ద్వారా వెళితే.. మరో 40 శాతం ఆవిరిగా మారుతోంది. పది శాతం తేమ రూపంలో మట్టిలో ఉంటోందని స్పష్టం చేస్తున్నారు. జిల్లా విభజన తర్వాత మొదటిసారిగా ఈ సర్వే నిర్వహిస్తుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోర్టు పరిసరాలతో పాటు పారిశ్రామిక వాడల్లో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏయే పంటలు సాగవుతున్నాయి.. మండలాల వారీగా ఎక్కడెక్కడ ఎంతెంత మేర భూగర్భ జలాలు ఉన్నాయనే వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సేకరించిన సమాచారాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉండటంతో తదనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు ఉపాధిహామీ కింద ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఏడాది తాగునీటి ట్యాంకులు, దోబీఘాట్‌లు, చెరువుల తవ్వకాలు, కాలువల పనులు, ఎం.ఐ. ట్యాంకులు, కందకాల తవ్వకం, చెక్‌డ్యాములు, చెరువుల్లో పశువులు నీరు తాగేందుకు ప్రత్యేక గుంతలు అభివృద్ధి చేయనున్నారు. రూ. 161.47 కోట్లతో 7822 పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వింజమూరు మండలంలో ఏర్పాటు చేసిన ఫీజోమీటరు

భూగర్భ జలాల పెంపునకు కృషి
జిల్లాలో నీటి వనరులను కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధిహామీ పథకంలో భాగంగా నీటి వనరులను అభివృద్ధి చేస్తున్నాం. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే భూగర్భ జల మట్టాలు పడిపోయిన మండలాలను గుర్తించాం. అక్కడ పనులు వేగవంతం చేస్తాం.  - తిరుపతయ్య, డ్వామా పీడీ

 

Read latest Nellore News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని