logo

ఇంటి వద్దకు కాదు.. వీధిలోకే..!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రజల సౌకర్యార్థం ఇళ్ల వద్దకే రేషన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలోని చౌకదుకాణాల వద్ద ప్రజలు పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా ఇంటి ముందుకే 5, 10, 15, 20 కిలోల సంచుల్లో నింపి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది.

Published : 06 Aug 2022 03:49 IST

రేషన్‌ పంపిణీపై కార్డుదారుల్లో అసంతృప్తి

వీధిలో వాహనం వద్ద బారులు తీరిన బియ్యం తీసుకుంటున్న కార్డుదారులు

న్యూస్‌టుడే, నెల్లూరు (కలెక్టరేట్‌)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రజల సౌకర్యార్థం ఇళ్ల వద్దకే రేషన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలోని చౌకదుకాణాల వద్ద ప్రజలు పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా ఇంటి ముందుకే 5, 10, 15, 20 కిలోల సంచుల్లో నింపి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రేషన్‌ సరకులు పంపిణీ చేస్తున్న వాహనాలు ఇంటింటికి రావడం రావడం లేదు. వీధిలో ఏదో ఒక ప్రాంతంలో ఆగితే అక్కడే వాహనం వద్ద బారులు తీరి బియ్యం తీసుకోవాల్సిన పరిస్థితి. దివ్యాంగులు, వృద్ధులు సైతం వాహనం వద్దకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రూ.కోట్లు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేసినా రూ.వేలల్లో జీతాలు ఇస్తున్నా.. ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఓ సమయం లేకుండా వాహనం ఎప్పుడు వస్తే అప్పుడు పనులు వదులుకొని వెళ్లాల్సి వస్తోంది. ఇంటి వద్దకు వచ్చి సరకులు ఎందుకు ఇవ్వట్లేదని ఎండీయూ వాహనదారులు, వాలంటీర్లను ప్రశ్నిస్తే కుంటి సాకులు చెబుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. సర్వర్‌ ఇక్కడైతేనే పని చేస్తోందని చెబుతూ ఇంటి వద్దకు రాకుండా వాహనం నిలిపిన చోటుకే రావాలని చెబుతున్నారని వాపోతున్నారు. వీధిలో ఒక్కచోటే వాహనం ఆగడంతో కార్డుదారులందరూ ఒకేసారి వస్తున్నారు. ఒక్కోసారి గంటల తరబడి నిరీక్షించడం తప్పడం లేదని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల విభాగం అధికారులు ప్రజా పంపిణీ తీరుపై స్పందించడం లేదు. రేషన్‌ వాహనాల ద్వారా పంపిణీ చేసే ఆపరేటర్లకు ప్రతినెల ప్రభుత్వం రూ.18 వేలు జీతం అందిస్తోంది.

చౌక దుకాణాలకే మొగ్గు
జిల్లాలో కార్డుదారులు గతంలో సమీపంలోని చౌకదుకాణానికి వెళ్లి సరకులు తెచ్చుకునేవారు. ప్రజల వద్ద నగదు ఎప్పుడు ఉంటే అప్పుడు ఏమైనా పనులు ఉంటే వాటిని పూర్తిచేసుకుని వెళ్లే వారు. ప్రస్తుతం వాహనం వీధిలోకి వచ్చిన సమయానికి చేతిలో డబ్బులు ఉన్నా.. లేకున్నా.. తంటాలు పడి సరకులు తీసుకోవాల్సిన పరిస్థితి. చౌకదుకాణాల ద్వారానే రేషన్‌ సరకులు పంపిణీ చేస్తే బాగుంటుందని లబ్ధిదారులు చెబుతున్నారు.
వాహనం ఎప్పుడొస్తుందో తెలియదు - మస్తాన్‌బీ, శెట్టిగుంటరోడ్డు

ఇంటింటికి వచ్చి రేషన్‌ బియ్యం ఇస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడూ అలా ఇవ్వలేదు. ఎండీయూ వాహనం ఏ సమయంలో వచ్చేది కూడా ముందుగా చెప్పడం లేదు. బండిని తీసుకొచ్చి ఏదో ఒక సమయంలో వీధిలో పెడుతున్నారు. అప్పుడు ఇళ్లలో ఉన్న వారు మాత్రమే బియ్యం తెచ్చుకుంటున్నారు. కూలి పనులకు వెళ్లిన నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయాల చుట్టూ తిరిగి చివరకు రేషన్‌ దుకాణం వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
పనులు మానుకోవాల్సి వస్తోంది - పెంచలనర్సయ్య, భగత్‌సింగ్‌ కాలనీ

ప్రతి ఇంటికి రేషన్‌ సరకులు తీసుకొచ్చి ఇస్తామంటే సంతోషించాం. ప్రస్తుతం వాహనం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. పనులు మానుకోవాల్సి వస్తోంది. చౌకదుకాణాల్లో పంపిణీ చేస్తున్నప్పుడు ఏదో ఒక సమయంలో వెళ్లి సరకులు తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు అలా లేదు. బండి వచ్చినప్పుడు మేం ఇంటి వద్ద లేకపోతే సరకులు ఇక లేనట్లే.

ఇంటి వద్దకు వచ్చేలా చర్యలు చేపడతాం - వెంకటేశ్వర్లు, డీఎస్‌వో
జిల్లాలోని కార్డుదారులందరికీ ఇంటి వద్దకే సరకులు అందేలా చర్యలు చేపడతాం. ఎవరూ ఇబ్బంది పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పంపిణీ విధానం పారదర్శకంగా ఉండేలా చూస్తున్నాం.

Read latest Nellore News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు