logo

Nellore news : స్కాన్ చేస్తున్నారా..తస్మాత్ జాగ్రత్త

వాట్సాప్‌లో వచ్చిందని.. స్నేహితుడు పంపించాడనీ.. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేశారా? అంతే సంగతులు.. ఉన్నదంతా దోచుకుంటున్నారు. డ్రా చేయకుండానే ఖాతాలో ఉన్న నగదు లాగేసుకుంటున్నారు. సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాను తెరపైకి తీసుకొచ్చారు.

Updated : 08 Aug 2022 07:41 IST

జిల్లాలో పెరుగుతున్న సైబర్‌ నేరాలు

రోజుకో కేసు నమోదు

క్యూఆర్‌ స్కానర్లు

ఈ నెల 2న ఓఎల్‌ఎక్స్‌లో ఎలక్ట్రానిక్‌ వస్తువులు విక్రయించేందుకు ఓ వ్యక్తి యాప్‌లో వస్తువులు పొందుపరిచారు. గుర్తుతెలియని వ్యక్తి తాను ఆ వస్తువులు కొనుగోలు చేస్తానని నమ్మబలికి క్యూఆర్‌ కోడ్‌ పంపించాడు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే తాను నగదు పంపిస్తానని వాట్సాప్‌కు స్కానర్‌ పంపించాడు. అతని మాటలు నమ్మిన బాధితుడు స్కాన్‌ చేయగా.. ఇంకేముంది అతని ఖాతాలో ఉన్న రూ.1.98లక్షలు విత్‌డ్రా అయినట్లు చరవాణికి సందేశాలొచ్చాయి. ఇంకేముంది బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 3న ఇదే తరహాలో విమానానికి టిక్కెట్లు బుక్‌ చేయాలని ఓ ఆగంతుకుడు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రూ.1.25లక్షలు స్వాహా చేశాడు. తాను ఇండియన్‌ ఆర్మీలో పని చేస్తున్నానని చెప్పి, చెన్నై నుంచి దిల్లీకి 5టిక్కెట్లు కావాలని కోరాడు. అందుకు నగదు కోసం క్యూఆర్‌ కోడ్‌ పంపిస్తున్నానని నమ్మించాడు.  టిక్కెట్‌ విక్రయదారుడి నుంచి వెంటనే క్యూఆర్‌ కోడ్‌ వచ్చింది. దాన్ని స్కాన్‌ చేయగా, ఇంకేముంది ఖాతాలో ఉన్నదంతా దోచేశాడు.

న్యూస్‌టుడే, నెల్లూరు(నేర విభాగం): వాట్సాప్‌లో వచ్చిందని.. స్నేహితుడు పంపించాడనీ.. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేశారా? అంతే సంగతులు.. ఉన్నదంతా దోచుకుంటున్నారు. డ్రా చేయకుండానే ఖాతాలో ఉన్న నగదు లాగేసుకుంటున్నారు. సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాను తెరపైకి తీసుకొచ్చారు. స్కానర్‌ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. ఎక్కడో కూర్చొని చరవాణీలకు స్కానర్లను పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. నెల్లూరు నగరంలో ఈ తరహా నేరాలు పెరిగాయి. ఓటీపీ, ఏటీఎం పిన్‌ నంబర్లతో జరిగే ఆన్‌లైన్‌ మోసాలు కాకుండా కొత్త తరహా నేరాలు చేస్తున్నారు. ప్రతి పోలీసుస్టేషన్లలోనూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

జిల్లాలో సైబర్‌ నేరాలకు సంబంధించి బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. గతంలో ఫోన్ల ద్వారా ఓటీటీ, ఏటీఎం పిన్‌ నంబర్లు, ఫేస్‌బుక్‌లో నగదు అడగడం, ఖాతా వివరాలు తెలుసుకుని నేరాలకు పాల్పడేవారు. అయితే, మారుతున్న కాలానుగుణంగా ప్రజలు కాస్త అవగాహనకు రావడం, సైబర్‌ నేరాలు అప్రమత్తమయ్యారు. ఆన్‌లైన్‌ మోసాలపై ప్రచారం జరగడం, నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుసుకోవడంతో అనుచిత కాల్స్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే, ఈ క్రమంలో సైబర్‌ మోసగాళ్లు అప్‌డేట్‌ అయ్యారు. తాజాగా క్యూఆర్‌ కోడ్‌ సాయంతో ఖాతాలో ఉన్న నగదు మొత్తం లాగేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ నుంచి సేకరించిన ఫోన్‌ నంబర్ల ద్వారా ఫోన్లు చేసి మాయమాటలతో కలుపుకుంటున్నారు. అనంతరం క్యూఆర్‌ కోడ్‌ పంపించి స్కాన్‌ చేసేలా చేస్తున్నారు. ఉన్నదంతా దోచుకుంటున్నారు. ఇలాంటి నేరాలు ఇటీవల కాలం నుంచే పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లలో నిత్యం ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు రూ.వేలల్లో నగదు పోగొట్టుకుంటే, మరికొందరు రూ.లక్షల్లో నగదును కోల్పోతున్నారు. పోలీసులు సైతం చేసేదేమిలేక కేసులు నమోదు చేస్తున్నారు. నగరంలోని ఆరు పోలీసుస్టేషన్లలో రోజూ సైబర్‌ నేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అప్రమత్తమే శ్రీ రామరక్ష
ఫోన్ల నుంచి నగదు మాట వినగానే నమ్మకపోవడమే మంచిది. నగదు విషయంలో ఎలాంటి పొరపాటు లేకుండా అప్రమత్తంగా ఉండటమే శ్రీరామరక్ష. ఎవరైనా సరే.. ఎప్పుడైనా సరే.. ఫోన్లలో నగదు మాట రాగానే నమ్మకండి. వ్యాపారాలుగానీ, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి సైతం వీరు ఫోన్లు చేస్తున్నారు. ప్రతి నెలా చెల్లించే ఈఎంఐ ఈ సారి క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లించాలంటూ నమ్మిస్తున్నారు. కాస్త ఆదమరిచినా అంతే సంగతులు. ఫోన్‌పే, జీపే, పేటీఎం పే లాంటి యూపీఐ లావాదేవీలు సైతం స్కానర్లు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి లావాదేవీల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే క్యూఆర్‌ స్కానర్లకు స్కాన్‌ చేయకూడదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని